
సామెతలు 24
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం
అధ్యాయ సారాంశం
జ్ఞానం బలమైన ఇంటిని స్థాపించి, కష్టాల్లో ధైర్యాన్ని ఇస్తుంది. నీతిమంతులు పడిపోయిన తరువాత లేస్తారు, హానివైపు నడిపించబడుతున్నవారిని పొరుగువారు నిర్లక్ష్యం చేయకూడదు, శత్రువులు సంతోషించడానికి సందర్భాలు కావు, నిర్లక్ష్యం చేసిన పొలాలు సోమరి సాకులను బయటపెడతాయి.
జ్ఞానంరక్షణస్థితిస్థాపకతశ్రద్ధ
1చెడ్డవారిని చూసి అసూయపడవద్దు, వారి సహవాసం కోరుకోవద్దు;
2వారి హృదయాలు హింసను చేయాలని యోచిస్తాయి, వారి పెదవులు ఇబ్బంది పెట్టడం గురించి మాట్లాడతాయి.
3జ్ఞానం వలన ఇల్లు కట్టబడుతుంది, గ్రహింపు వలన అది స్థిరంగా ఉంటుంది.
4తెలివిచేత దాని గదులు అరుదైన అందమైన నిధులతో నింపబడతాయి.
5జ్ఞానులు బలవంతులకన్నా శక్తివంతులు, తెలివిగలవారు ఇంకా బలంగా ఎదుగుతారు.
6ఖచ్చితంగా యుద్ధం చేయడానికి మీకు నడిపించేవారు అవసరం అనేకమంది సలహాదారుల ద్వారా విజయం సాధ్యమవుతుంది.
7మూర్ఖులకు జ్ఞానం ఎంతో ఎత్తులో ఉంటుంది; సమాజ గవిని దగ్గర వారు మాట్లాడడానికి ఏమి లేదు.
8కీడు చేయాలని చూసే వ్యక్తి కుట్రలు చేసే వ్యక్తి అని పిలువబడతాడు.
9మూర్ఖుల పథకాలు పాపం, ఎగతాళి చేసేవారిని నరులు అసహ్యించుకుంటారు.
10ఒకవేళ మీరు ఇబ్బందుల సమయంలో తడబడితే, మీ బలం ఎంత సూక్ష్మమైనది!
11చావుకు కొనిపోబడుతున్న వారిని రక్షించు; మరణం వైపు తూగుతున్న వారిని వెనుకకు లాగు.
12“కాని దీని గురించి మాకు ఏమి తెలియదు” అని నీవంటే, హృదయాలను తూకం వేసేవాడు నీ మాటను గ్రహించడా? నీ ప్రాణాన్ని కాచేవానికి తెలియదా? ప్రతి వ్యక్తికి తన క్రియలకు తగినట్టుగా తిరిగి చెల్లించడా?
13నా కుమారుడా, తేనె తిను, అది మంచిది; తేనెపట్టు నుండి తేనె తిను అది రుచికి తీపిగా ఉంటుంది.
14జ్ఞానం నీకు తేనెలాంటిది అని తెలుసుకో: అది నీకు దొరికితే, నీ భవిష్యత్తుకు నిరీక్షణ ఉంటుంది, నీ నిరీక్షణ తొలిగిపోదు.
15నీతిమంతుల నివాసం దగ్గర దొంగలా పొంచి ఉండవద్దు, వారి నివాస స్థలాన్ని దోచుకోవద్దు;
16ఎందుకంటే నీతిమంతులు ఏడుమారులు పడినను తిరిగి లేస్తారు, కాని విపత్తు సంభవించినప్పుడు దుష్టులు తడబడతారు.
17నీ శత్రువు పడినప్పుడు సంతోషించవద్దు; వాడు తడబడినప్పుడు నీ హృదయాన్ని సంతోషించనీయకు,
18లేదా యెహోవా అది చూసి అయిష్టత కలిగి వారి మీద నుండి తన కోపం చాలించుకుంటారేమో.
19కీడు చేసేవారిని చూసి నీవు చిరాకుపడకు దుష్టుల ఎడల అసూయ పడకు.
20ఎందుకంటే కీడు చేసేవారికి భవిష్యత్ నిరీక్షణ లేదు, దుష్టుల దీపము ఆరిపోతుంది.
21నా కుమారుడా, యెహోవాకు రాజుకు భయపడు, తిరుగుబాటు చేసే అధికారులతో జతకలవకు.
22ఎందుకంటే అవి రెండు వారి మీదికి హఠాత్ నాశనాన్ని పంపుతాయి, అవి ఎలాంటి ఆపదలు తెస్తాయో ఎవరికి తెలుసు?
23ఇవి కూడా జ్ఞానులు చెప్పిన సూక్తులే: న్యాయం తీర్చుటలో పక్షపాతము చూపుట మంచిది కాదు
24“నీవు అమాయకుడవు” అని దోషులతో చెప్పేవారిని, ప్రజలు శపిస్తారు దేశాలు అసహ్యించుకుంటారు.
25న్యాయంగా తీర్పు తీర్చువారికి మేలు కలుగును అధికమైన దీవెన అట్టివారిమీదికి వచ్చును.
26నిజాయితీగల జవాబు పెదవులపై పెట్టే ముద్దు లాంటిది.
27ముందుగా నీ బయటి పని చక్క పెట్టుకో నీ పొలాలను సిద్ధపరచుకో; దాని తర్వాత, నీ ఇల్లు కట్టుకో.
28కారణం లేకుండ నీ పొరుగువానికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పవద్దు; నీ పెదవులతో తప్పుత్రోవ పట్టిస్తావా?
29“వారు నాకు చేసినట్లు నేను వారికి చేస్తాను; వారు చేసిన దానికి వారికి తిరిగి చెల్లిస్తాను” అని అనుకోవద్దు.
30నేను ఒక సోమరివాని చేను దాటి వెళ్లాను, నేను బుద్ధిలేని ఒక వ్యక్తి ద్రాక్షతోటను దాటి వెళ్లాను;
31అంతట ముళ్ళ కంపలు పెరిగాయి, నేలంతా కలుపు మొక్కల చేత కప్పబడి ఉంది, దాని రాతి గోడ శిథిలావస్థలో ఉంది.
32నేను దాన్ని చూసి దాని గురించి యోచన చేసి దాని నుండి నేను ఒక పాఠం నేర్చుకున్నాను.
33ఇంకొంచెం నిద్ర, ఇంకొంచెం కునుకు, ఇంకొంచెం సేపు విశ్రాంతి అంటూ చేతులు ముడుచుకుంటాను.
34పేదరికం నీ మీదికి దొంగలా, లేమి ఆయుధాలు ధరించినవానిలా నీ మీదికి వస్తుంది.
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం — CC BY-SA 4.0. Where these translations come from.
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc. Available free at biblica.com and open.bible. Text unchanged, used under CC BY-SA 4.0.