A humble adviser waits before a king while a messenger brings water and citizens repair a city wall

సామెతలు 25

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం
అధ్యాయ సారాంశం
హిజ్కియా సంకలనం దాగిన విషయాలు, శుద్ధి చేయబడిన నాయకత్వం, పాలకుల ముందు వినయాన్ని పరిశీలిస్తుంది. సకాల మాటలు అమూల్యమైనవి, నమ్మకమైన దూతలు పునరుత్తేజపరుస్తారు, దయ శత్రువులకు జవాబిస్తుంది, ఆత్మనియంత్రణ చెక్కుచెదరని నగర గోడల్లా వ్యక్తిని రక్షిస్తుంది.
వినయంసకాల మాటవిశ్వసనీయతఆత్మనియంత్రణ
1ఇవి కూడా సొలొమోను యొక్క సామెతలు, యూదా రాజైన హిజ్కియా సేవకులు వీటిని పోగుచేశారు.
2ఒక విషయాన్ని దాచిపెట్టడం దేవుని గొప్పతనం; ఒక విషయాన్ని బయటకు లాగడం రాజుల గొప్పతనము.
3ఆకాశాల ఎత్తు భూమి లోతు ఎలా కనుగొనలేమో, అలాగే రాజుల హృదయాలు కూడా శోధించలేనివి.
4వెండిలోని లోహపు మడ్డిని తీసివేసి, కంసాలివాడు ఒక పాత్రను తయారుచేయగలడు;
5రాజు ఎదుట నుండి చెడ్డ అధికారులను తొలగించండి, నీతి ద్వారా ఆయన సింహాసనం స్థాపించబడుతుంది.
6రాజు ఎదుట నిన్ను నీవు హెచ్చించుకోవద్దు, ఆయన దగ్గర ఉండే గొప్పవారి మధ్య చోటు కావాలని కోరవద్దు.
7సంస్థానాధిపతుల ముందు రాజు నిన్ను అవమానించడం కంటే, “ఇక్కడకు రండి” అని ఆయన నీతో చెప్పడం బాగుంటుంది కదా. మీరు ఏదో చూసిన దానిని బట్టి,
8తొందరపడి న్యాయస్థానానికి వెళ్లకండి, ఎందుకంటే ఒకవేళ నీ పొరుగువాడు నిన్ను అవమానపరిస్తే తర్వాత నీవేమి చేస్తావు?
9ఒకవేళ నీవు నీ పొరుగువాన్ని న్యాయస్థానానికి తీసుకెళ్లినా, ఇంకొకరి గుట్టు బయట పెట్టకు.
10అది వినినవాడు నిన్ను అవమానపరచవచ్చు, అప్పుడు నీకు కలిగిన అపకీర్తి ఎన్నటికి తొలిగిపోదు.
11సకాలంలో మాట్లాడిన మాట, చిత్రమైన వెండి పళ్ళాల్లో ఉంచబడిన బంగారు ఆపిల్ పళ్ళలాంటిది.
12బంగారు చెవి పోగు ఎలా ఉంటుందో లేదా మేలిమి బంగారు ఆభరణం ఎలా ఉంటుందో వినే చెవికి జ్ఞానియైన న్యాయమూర్తి యొక్క గద్దింపు అలా ఉంటుంది.
13నమ్మకమైన పనివాడు తనను పంపువారికి కోతకాలంలో మంచు చల్లదనము వంటివాడు; వాడు తన యజమానుల హృదయాలను తెప్పరిల్లజేస్తాడు.
14బహుమతి ఇస్తానని వాగ్దానం చేసి ఇవ్వని వ్యక్తి వర్షము కురిపించని మబ్బు గాలి లాంటివాడు.
15సహనం ద్వారా ఒక పాలకుడిని ఒప్పించవచ్చు, మృదువైన నాలుక ఎముకను విరుగ గొట్ట గలదు.
16నీకు తేనె దొరికితే సరిపడగా తిను ఎక్కువ తింటే కక్కివేస్తావు.
17నీ పొరుగువారింటికి మాటిమాటికి వెళ్లకు, వారు నీ వలన విసిగిపోయి నిన్ను ద్వేషించవచ్చు.
18తన పొరుగువాని మీద అబద్ధసాక్ష్యం చెప్పేవాడు సమ్మెట ఖడ్గము లేదా వాడిగల బాణాన్ని పోలినవాడు.
19కష్ట సమయంలో నమ్మకద్రోహిని ఆశ్రయించడమంటే విరిగిన పళ్లు లేదా కుంటి పాదం లాంటిది.
20బాధలోనున్న వానికి పాటలు వినిపించేవాడు, బాగా చలిగా ఉన్నపుడు పై బట్టతీసివేయు వానితోను, పచ్చిపుండు మీద పుల్లని ద్రాక్షరసం పోసేవానితోను సమానము.
21నీ శత్రువు ఆకలితో ఉంటే, తినడానికి భోజనము పెట్టు; అతడు దాహంతో ఉంటే, త్రాగడానికి నీళ్లు ఇవ్వు.
22ఇలా చేయడం ద్వారా అతని తలపై మండుతున్న నిప్పులు కుప్పగా పోస్తావు, యెహోవా అందుకు నీకు ప్రతిఫలమిస్తారు.
23ఊహించని వర్షాన్ని తెచ్చే ఉత్తర గాలిలా కపటమైన నాలుక భయానకంగా కనిపించేలా చేస్తుంది.
24గయ్యాళియైన భార్యతో పెద్ద ఇంట్లో ఉండడం కంటే మిద్దెమీద ఒక మూలను నివసించడం మేలు.
25అలసిన ప్రాణానికి చల్లటి నీరు ఎలా ఉంటుందో దూరదేశము నుండి వచ్చిన మంచి వార్త అలా ఉంటుంది.
26నీతిమంతుడు దుష్టునికి మార్గం ఇవ్వడం ఊటను బురదమయం లేదా బావిని కలుషితం చేయడం లాంటిది.
27తేనె ఎక్కువగా తినడం మంచిది కాదు, ప్రజలు తమ సొంత కీర్తిని కోరుకోవడం గౌరవప్రదం కాదు.
28మనస్సు అదుపు చేసుకోలేని వ్యక్తి ప్రాకారాలు కూలిన పట్టణం లాంటివాడు.

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం — CC BY-SA 4.0. Where these translations come from.

Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc. Available free at biblica.com and open.bible. Text unchanged, used under CC BY-SA 4.0.