Parents counsel a young man while a wise woman calls out near a group plotting violence

సామెతలు 1

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం
అధ్యాయ సారాంశం
సామెతలు కర్త్తపట్ల భయం జ్ఞానానికి ప్రారంభమని పేర్కొంటూ ప్రారంభమవుతుంది. తల్లిదండ్రుల బోధన హింసాత్మక సహచరులతో చేరవద్దని హెచ్చరిస్తుంది, తిరస్కరించబడిన సలహా విపత్తుగా మారకముందు జ్ఞానం స్పందించని వారిని బహిరంగంగా పిలుస్తుంది.
జ్ఞానందేవుని భయంతల్లిదండ్రుల బోధనహెచ్చరిక
1దావీదు కుమారుడును ఇశ్రాయేలీయులకు రాజునైన, సొలొమోను యొక్క సామెతలు:
2జ్ఞానాన్ని ఉపదేశాన్ని పొందడం కోసం; అంతరార్థంతో కూడిన పదాలను గ్రహించడం కోసం;
3వివేకంతో కూడిన ప్రవర్తన కోసం, సరియైనది, న్యాయమైనది చేయడానికి ఉపదేశం పొందడం కోసం;
4సామాన్యులకు బుద్ధి కలిగించడం కోసం, యవ్వనస్థులకు తెలివి వివేకం కలిగించడం కోసం,
5జ్ఞానులు ఈ సామెతలు వింటారు, మరింత తెలివైనవారవుతారు, వివేకంగలవారు ఉపదేశం పొందుకుంటారు.
6వారు సామెతలు, నీతికథలు, జ్ఞానుల సూక్తులు, చిక్కుప్రశ్నలను గ్రహిస్తారు.
7యెహోవాయందు భయం తెలివికి మూలం, అయితే మూర్ఖులు జ్ఞానాన్ని ఉపదేశాన్ని తృణీకరిస్తారు.
8నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశాన్ని విను నీ తల్లి బోధను త్రోసివేయవద్దు.
9అవి నీ తలకు చుట్టిన అందమైన మాలగా నీ మెడను అలంకరించే హారంగా ఉంటాయి.
10నా కుమారుడా, పాపిష్ఠి మనుష్యులు నిన్ను ప్రలోభపెడితే, నీవు వారికి లొంగిపోవద్దు.
11ఒకవేళ వారు, “మాతో కూడా రా; నిర్దోషుల రక్తాన్ని చిందించడానికి దాగి ఉందాం; హాని చేయని ప్రాణం మీద ఆకస్మిక దాడి చేద్దాం;
12పాతాళం వలె మనుష్యులు జీవించి ఉండగానే వారిని పూర్తిగా మ్రింగివేద్దాం, సమాధిలోనికి దిగువారి వలె పూర్ణబలంతో ఉండగానే వారిని మ్రింగివేద్దాం;
13అన్ని రకాల విలువైన వస్తువులు మనం తెచ్చి మన ఇళ్ళను దోపుడు సొమ్ముతో నింపుకొందాం;
14మాతో చీట్లు వేయండి; మనం దొంగిలించిన దానిని మనమందరం పంచుకుందాము.”
15నా పిల్లలారా, వారితో కలిసి వెళ్లకండి, వారి దారుల్లో నీ పాదాలు పెట్టకు;
16కీడు చేయడానికి వారి పాదాలు పరుగెత్తుతాయి, మనుష్యులను చంపడానికి త్వరపడతారు.
17రెక్కలు గల పక్షులు చూస్తుండగా వల వేయడం నిష్ప్రయోజనం!
18అయితే ఈ మనుష్యులు తమ నాశనానికే పొంచి ఉంటారు; తమ ప్రాణాన్ని తామే తీసుకోవడానికి వారు దాక్కొని ఉంటారు!
19అక్రమ సంపాదన వెంటపడే వారందరి దారులు అలాంటివే; అది దానిని సొంతం చేసుకున్న వారి ప్రాణాలు తీస్తుంది.
20జ్ఞానం వీధుల్లో కేకలు వేస్తున్నది, అది బహిరంగ స్థలాల్లో తన గొంతు గట్టిగా వినిపిస్తుంది;
21అధిక రద్దీ ఉండే వీధి చివర్లలో అది కేక వేస్తుంది, పట్టణ ద్వారాల దగ్గర ఆమె తన ప్రసంగం చేస్తుంది:
22“బుద్ధిహీనులారా మీరు ఎన్నాళ్ళు బుద్ధిహీనుని మార్గాలను ప్రేమిస్తారు? ఎగతాళి చేసేవారు ఎన్నాళ్ళు ఎగతాళి చేస్తూ ఆనందిస్తారు? బుద్ధిహీనులు ఎన్నాళ్ళు తెలివిని అసహ్యించుకుంటారు?
23నా గద్దింపును విని పశ్చాత్తాపపడండి! అప్పుడు నా ఆత్మను మీమీద కుమ్మరిస్తాను, నా ఉపదేశాలను మీకు తెలియజేస్తాను.
24కానీ నేను పిలిచినప్పుడు మీరు వినడానికి నిరాకరించినందున నేను నా చేయి చాచినప్పుడు ఎవరూ పట్టించుకోనందున,
25మీరు నా సలహాను లెక్కచేయనందున నా గద్దింపును అంగీకరించనందున,
26ఆపద మిమ్మల్ని తాకినప్పుడు నేను నవ్వుతాను; విపత్తు మిమ్మల్ని అధిగమించినప్పుడు నేను ఎగతాళి చేస్తాను,
27విపత్తు తుఫానులా మిమ్మల్ని అధిగమించినప్పుడు, ఆపద మిమ్మల్ని తుఫానులా ముంచినప్పుడు, మీకు బాధ ఇబ్బంది కలిగినప్పుడు నేను ఎగతాళి చేస్తాను.
28“అప్పుడు వారు నాకు మొరపెడతారు కాని నేను జవాబు ఇవ్వను; నా కోసం ఆతురతగా వెదకుతారు కాని నేను కనబడను,
29వారు జ్ఞానాన్ని అసహ్యించుకున్నారు, యెహోవాకు భయపడాలని వారు కోరలేదు కాబట్టి.
30వారు నా సలహాను అంగీకరించలేదు నా గద్దింపును కూడా త్రోసివేశారు కాబట్టి,
31వారు తమ క్రియలకు తగిన ఫలాన్ని అనుభవిస్తారు వారి ఆలోచనల ఫలితాలకు వారే విసుగుచెందుతారు.
32మూర్ఖులు దారితప్పడం వల్ల నశిస్తారు, బుద్ధిహీనుల నిర్లక్ష్యం వారిని నాశనం చేస్తుంది;
33నా మాటలను వినేవారు క్షేమంగా నివసిస్తారు; కీడు కలుగుతుందనే భయం లేకుండా నెమ్మదిగా ఉంటారు.”

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం — CC BY-SA 4.0. Where these translations come from.

Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc. Available free at biblica.com and open.bible. Text unchanged, used under CC BY-SA 4.0.