
సామెతలు 2
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం
అధ్యాయ సారాంశం
నేర్చుకునేవాడు దాచిన సంపదను వెతికినంత శ్రద్ధగా జ్ఞానాన్ని వెతకాలి. కర్త్త నీతియుక్త మార్గాలను కాపాడే, అవినీతి మాట, వినాశకర శోధన నుండి రక్షించే అవగాహనను ఇస్తాడు, విశ్వసనీయ ప్రజలను భూమిలో నిలకడైన జీవితం వైపు నడిపిస్తాడు.
జ్ఞానం వెతకడంవివేచనరక్షణనీతి మార్గాలు
1నా కుమారుడా, నీవు నా మాటలను విని నా ఆజ్ఞలను నీలో దాచుకొంటే,
2జ్ఞానం వైపు నీవు చెవిపెట్టి, హృదయపూర్వకంగా అవగాహన చేసుకోవాలి.
3నీవు అంతరార్థం కోసం మొరపెడితే, వివేచనకై బిగ్గరగా మనవి చేస్తే,
4వెండిని వెదికినట్లు దానిని వెదికితే, దాచబడిన నిధులను వెదికినట్లు దానిని వెదికితే,
5యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండడం గురించి నీవు తెలుసుకుంటావు, దేవుని తెలివిని కనుగొంటావు.
6ఎందుకంటే యెహోవాయే జ్ఞానాన్ని ప్రసాదించేవాడు; తెలివి వివేచన ఆయన నోట నుండే వస్తాయి.
7యథార్థవంతులకు విజయం దాచి ఉంచేది ఆయనే, నిందారహితులుగా నడుచుకొనే వారికి ఆయనే డాలు.
8ఎందుకంటే న్యాయం యొక్క కాలగతులు కాపాడేది ఆయనే, తన నమ్మకమైన వారిని కాపాడేది ఆయనే.
9అప్పుడు నీవు నీతిన్యాయాలను యథార్థతను, ప్రతి మంచి మార్గాన్ని గ్రహిస్తావు.
10జ్ఞానం నీ హృదయంలోకి వస్తుంది, తెలివి నీ ప్రాణానికి సంతోషాన్ని కలిగిస్తుంది.
11బుద్ధి నిన్ను కాపాడుతుంది, వివేకం నీకు కావలి కాస్తుంది.
12దుష్టుల చెడు మార్గాల నుండి, మూర్ఖంగా మాట్లాడేవారి నుండి జ్ఞానం నిన్ను కాపాడుతుంది.
13అలాంటివారు చీకటిదారిలో నడవడానికి, తిన్నని మార్గాలను విడిచిపెడతారు.
14చెడు చేయడంలో సంతోషిస్తారు, దుర్మార్గుల మూర్ఖత్వాన్ని బట్టి ఆనందిస్తారు.
15వారి త్రోవలు సరియైనవి కావు వారు వంచనతో ఆలోచిస్తారు.
16జ్ఞానం నిన్ను వ్యభిచార స్త్రీ నుండి, మోహపు మాట్లాడే దారితప్పిన స్త్రీ నుండి కాపాడుతుంది.
17అలాంటి స్త్రీ తన యవ్వన కాలపు భర్తను విడిచిపెట్టి దేవుని ఎదుట తాను చేసిన ప్రమాణాన్ని నిర్లక్ష్యం చేస్తుంది.
18ఖచ్చితంగా దాని ఇల్లు మరణం దగ్గరకు నడిపిస్తుంది, దాని త్రోవలు చనిపోయినవారి దగ్గరకు దారితీస్తాయి.
19ఆ స్త్రీ దగ్గరకు వెళ్లిన ఎవరూ తిరిగి రారు జీవమార్గాలను వారు చేరుకోలేరు.
20కాబట్టి నీవు మంచి మార్గాల్లో నడుచుకోవాలి, నీతిమంతుల ప్రవర్తనను అనుసరించాలి.
21యథార్థవంతులు దేశంలో నివసిస్తారు, ఏ తప్పుచేయని వారే దానిలో నిలిచి ఉంటారు.
22కాని దుర్మార్గులు దేశం నుండి తొలగించబడతారు ద్రోహులు దాని నుండి నిర్మూలం చేయబడతారు.
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం — CC BY-SA 4.0. Where these translations come from.
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc. Available free at biblica.com and open.bible. Text unchanged, used under CC BY-SA 4.0.