
సామెతలు 23
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం
అధ్యాయ సారాంశం
సూక్తులు రాజు రుచికరమైన భోజనాన్ని ఆశించడం, సంపద కోసం అలసిపోవడం, పాపులను అసూయపడటం, తాగుడు అతిగా లొంగిపోవడం గురించి హెచ్చరిస్తాయి. నేర్చుకునేవారు సరిదిద్దడాన్ని స్వీకరించి, తల్లిదండ్రులను గౌరవించి, సత్యాన్ని వెతికి, కోరికను నిలకడైన జ్ఞానం వైపు నిర్దేశించాలి.
ఆత్మనియంత్రణబోధనతల్లిదండ్రుల సంతోషంసత్యం
1మీరు ఒక పాలకుడితో భోజనం చేయడానికి కూర్చున్నప్పుడు, మీ ముందు ఉన్న దాన్ని బాగా గమనించండి.
2నీవు తిండిబోతువైన ఎడల నీ గొంతుకు కత్తి పెట్టుకో.
3అతని రుచిగల పదార్థాలకు ఆశపడకు, అవి మోసగించే ఆహారపదార్థాలు.
4సంపదను పొందడానికి ప్రయాసపడకండి; నీ స్వంత తెలివిని నమ్ముకోవద్దు.
5కనురెప్పపాటులో ధనం కనుమరుగవుతుంది, ఎందుకంటే అది రెక్కలు ధరించి గ్రద్దలా ఆకాశానికి ఎగిరిపోతుంది.
6ఎదుటివాని అభివృద్ధి చూసి పిసినారి వానితో కలిసి భోజనము చేయకండి, అతని రుచిగల పదార్థాలకు ఆశపడవద్దు,
7ఎందుకంటే అట్టి వాడు తన హృదయంలో ఎప్పుడూ ఖరీదు గురించి ఆలోచిస్తాడు. “తినండి త్రాగండి” అని అతడు నీతో చెప్తాడు, కాని అది అతని హృదయంలోనుండి వచ్చుమాట కాదు.
8నీవు తినిన కొంచెము కక్కివేస్తావు నీవు పలికిన అభినందనలు వృధా అవుతాయి.
9బుద్ధిహీనులతో మాట్లాడకండి, ఎందుకంటే వారు మీ వివేకవంతమైన మాటలను ఎగతాళి చేస్తారు.
10పురాతన సరిహద్దు రాయిని కదిలించవద్దు తండ్రిలేనివారి పొలములోనికి చొరబడవద్దు,
11ఎందుకంటే వారిని కాపాడేవాడు బలవంతుడు; నీకు వ్యతిరేకంగా ఆయన వారి పక్షంగా నీతో పోరాడతారు.
12ఉపదేశానికి నీ హృదయాన్ని తెలివిగల మాటలకు నీ చెవులను అప్పగించు.
13నీ పిల్లలకు క్రమశిక్షణ నేర్పడం మానకుము; ఒకవేళ బెత్తముతో వాని కొట్టినా వారు చావరు.
14బెత్తముతో వాని శిక్షించి చావు నుండి వారిని కాపాడండి.
15నా కుమారుడా, నీ హృదయం జ్ఞానం కలిగి ఉంటే, అప్పుడు నా హృదయం సంతోషిస్తుంది;
16నీ పెదవులు సరియైనది మాట్లాడినప్పుడు, నా అంతరింద్రియం సంతోషిస్తుంది.
17పాపులను చూసి నీ హృదయాన్ని అసూయపడనీయకు, కాని ఎల్లప్పుడు యెహోవాయందలి భయం పట్ల ఆసక్తి కలిగి ఉండు.
18నిజంగా నీకు భవిష్యత్ నిరీక్షణ ఉన్నది, నీ నిరీక్షణ తొలగించబడదు.
19నా కుమారుడా, ఆలకించి జ్ఞానిగా ఉండు నీ హృదయాన్ని సరియైన మార్గంలో నిలుపుకో.
20అతిగా ద్రాక్షరసం త్రాగువారితోనైను, మాంసం ఎక్కువగా తినే వారితోనైను స్నేహము చేయవద్దు.
21ఎందుకంటే త్రాగుబోతులు తిండిబోతులు దరిద్రులౌతారు, మగత వారిని దుప్పట్లలో వస్త్రాల్లా ధరిస్తుంది.
22నీకు జీవితాన్నిచ్చిన, నీ తండ్రి మాటను ఆలకించు, నీ తల్లి ముసలితనంలో ఆమెను నిర్లక్ష్యం చేయకు.
23సత్యాన్ని కొనుక్కో దాన్ని అమ్మకు జ్ఞానాన్ని, బోధను, అంతరార్థాన్ని కూడా కొని ఉంచుకో.
24నీతిమంతులైన పిల్లల తండ్రికి గొప్ప ఆనందం; జ్ఞానం గలవానికి తండ్రిగా ఉన్నవాడు వాని వలన సంతోషిస్తాడు.
25నీ తల్లిదండ్రులు సంతోషించుదురు గాక; నిన్ను కనిన తల్లి ఆనందంగా ఉండును గాక!
26నా కుమారుడా, నీ హృదయాన్ని నాకివ్వు నీ కళ్లు నా మార్గాలను అనుసరించుట యందు ఆనందించును గాక,
27ఎందుకంటే ఒక వ్యభిచార స్త్రీ ఒక లోతైన గుంట, దారితప్పిన భార్య ఇరుకైన బావి.
28బందిపోటులా అది పొంచి ఉంటుంది అది అనేకమంది మనుష్యులను నమ్మకద్రోహులుగా చేస్తుంది.
29ఎవరికి శ్రమ ఉంది? ఎవరికి దుఃఖం ఉంది? ఎవరికి కలహాలు ఉన్నాయి? ఎవరికి ఫిర్యాదులు ఉన్నాయి? ఎవరికి అవసరంలేని గాయాలు? ఎవరి కళ్లు ఎర్రబడి ఉన్నాయి?
30మద్యంతో ప్రొద్దుపుచ్చేవారు, నమూనా మద్యమాల మిశ్రమాలను రుచిచూడడానికి వెళ్లేవారు.
31మద్యం ఎర్రగా ఉన్నప్పుడు, గిన్నెలో తళతళలాడుతూ, గొంతులో పడగానే మంచిగా అనిపిస్తుందేమో అయినా దానివైపు చూడవద్దు!
32అంతంలో అది పాములా కరుస్తుంది కట్లపాములా విషం చిమ్ముతుంది.
33నీ కళ్లు వింత దృశ్యాలను చూస్తాయి, నీ మనస్సు గందరగోళమైన వాటిని ఊహిస్తుంది.
34నీవు నడిసముద్రంలో పడుకునేవానిలా ఉంటావు. స్తంభాన్ని పట్టుకుని ఉన్నావు.
35“వారు నన్ను కొట్టారు, కాని గాయం కాలేదు! వారు నన్ను కొట్టారు, కాని నాకు తెలియలేదు! మరి కాస్త మద్యం త్రాగడానికి నేనెప్పుడు నిద్ర లేస్తాను?”
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం — CC BY-SA 4.0. Where these translations come from.
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc. Available free at biblica.com and open.bible. Text unchanged, used under CC BY-SA 4.0.