
యోబు 7
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం
అధ్యాయ సారాంశం
యోబు మానవ జీవితాన్ని బలవంతపు శ్రమతో, సాయంత్రం కోసం ఎదురుచూసే కూలీతో, గడిచిపోయే ఊపిరితో పోలుస్తాడు. నిద్రలేకుండా, పుండ్లతో కప్పబడి, దొర్లే రాత్రుల వల్ల అలసిపోయి, అతను దేవుడిని తన నుండి దృష్టి మరల్చమని అడిగి, ఇంత క్షణికమైన జీవి ఎందుకు ఇంత దగ్గరగా గమనించబడాలని ప్రశ్నిస్తాడు.
మర్త్యత్వంనిద్రలేమిఫిర్యాదుమానవ బలహీనత
1“భూమి మీద మానవులకు ఉండేది కఠినమైన సేవ కాదా? వారి రోజులన్నీ కూలివారి రోజులవంటివి కావా?
2చల్లనినీడ కోసం ఎంతో ఆశపడే దాసునిలా, కూలిడబ్బుల కోసం ఎదురు చూసే కూలివానిలా,
3నిరర్థకమైన నెలలు నాకు కేటాయించబడ్డాయి, దుఃఖంతో నిండిన రాత్రులు నాకు నియమించబడ్డాయి.
4నేను పడుకున్నప్పుడు ‘నేను ఎప్పుడు లేస్తాను రాత్రి ఎప్పుడు ముగుస్తుంది?’ అని ఆలోచిస్తాను తెల్లవారే వరకు నేను అటూ ఇటూ దొర్లుతూ ఉంటాను.
5నా శరీరం పురుగులతో కురుపులతో కప్పబడింది, నా చర్మం పగిలి చీము పట్టింది.
6“నేతగాని మగ్గం కంటే వేగంగా నా రోజులు గడుస్తున్నాయి, నిరీక్షణ లేకుండానే అవి ముగిసిపోతున్నాయి.
7దేవా! నా జీవం వట్టి ఊపిరి వంటిదేనని జ్ఞాపకం చేసుకోండి; నా కళ్లు మంచిని మరలా చూడలేవు.
8ఇప్పుడు నన్ను చూస్తున్నవారి కన్ను ఇకమీదట నన్ను చూడదు; మీరు నా కోసం చూసినా నేను ఇక ఉండను.
9మేఘం విడిపోయి మాయమైపోయిట్లు, సమాధిలోనికి దిగిపోయినవాడు మరలా తిరిగి రాడు.
10అతడు తన ఇంటికి మరలా తిరిగి రాడు; అతని స్వస్థలం అతన్ని మరచిపోతుంది.
11“కాబట్టి నేను మౌనంగా ఉండను; నా ఆత్మలోని వేదన బట్టి మాట్లాడతాను. నా మనస్సులోని బాధను బట్టి నేను ఫిర్యాదు చేస్తాను.
12మీరు నాకు కాపలా పెట్టడానికి నేనేమైనా సముద్రాన్నా లేదా సముద్రపు క్రూరజంతువునా?
13నా పడక నాకు ఆదరణ ఇస్తుందని నా మంచం నా బాధను తగ్గిస్తుందని నేను అనుకుంటే,
14అప్పుడు కూడా కలలతో మీరు నన్ను బెదిరిస్తున్నారు. దర్శనాలతో నన్ను భయపెడుతున్నారు.
15ఈ శరీరంతో ఇలా జీవించడం కంటే ఊపిరాడకుండా చనిపోవడాన్నే నేను కోరుకుంటాను.
16నా జీవితాన్ని తృణీకరిస్తున్నాను; నేను ఎల్లకాలం బ్రతకను. నన్ను ఒంటరిగా విడిచిపెట్టండి; నా దినాలు అర్థం లేకుండా ఉన్నాయి.
17“మీరు మానవులను ఘనపరచడానికి, వారిపై మీరు అంతగా శ్రద్ధ చూపించడానికి,
18ప్రతి ఉదయం వారిని దర్శించడానికి, అనుక్షణం వారిని పరీక్షించడానికి వారెంతటివారు?
19ఎంతకాలం మీరు నన్ను చూడడం మానకుండ ఉంటారు? నా ఉమ్మిని మ్రింగేంత వరకు కూడ నన్ను విడిచిపెట్టరా?
20మనుష్యులను గమనించేవాడా, నేను పాపం చేస్తే, మీకు నేను ఏమి చేశాను? మీరెందుకు నన్ను లక్ష్యంగా చేసుకున్నారు? మీకు నేనే భారమైపోయానా?
21ఎందుకు మీరు నా అపరాధాలను క్షమించరు? ఎందుకు నా పాపాలను తీసివేయరు? త్వరలోనే నేను మట్టిలో కలిసిపోతాను, మీరు నా కోసం వెదికినా నేనిక ఉండను.”
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం — CC BY-SA 4.0. Where these translations come from.
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc. Available free at biblica.com and open.bible. Text unchanged, used under CC BY-SA 4.0.