
యోబు 6
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం
అధ్యాయ సారాంశం
యోబు తన వేదనను తూచగలిగితే అది సముద్రాల ఇసుకను మించిపోతుందని జవాబిస్తాడు, ఇది అతని మాటలు తొందరపాటుగా ఉండటానికి కారణం చెబుతుంది. అతను తాను ఎక్కడ తప్పు చేశాడో చూపించమని స్నేహితులను అడిగి, దాహం గొన్న ప్రయాణికులు చేరుకున్నప్పుడే ఎండిపోయే కాలానుగుణ ప్రవాహాలతో వారిని పోలుస్తాడు.
దుఃఖంస్నేహంనిరాశనిజాయితీ
1అప్పుడు యోబు ఇలా జవాబిచ్చాడు:
2“కేవలం నా వేదనను తూకం వేసి, నా కష్టాలన్నీ త్రాసులో ఉంచి లెక్కిస్తే,
3సముద్రాల ఇసుక కంటే అవి బరువుగా ఉంటాయి, కాబట్టి నా మాటలు ఉద్వేగభరితంగా ఉండడంలో ఆశ్చర్యం లేదు.
4సర్వశక్తిమంతుడైన దేవుని బాణాలు నాకు గుచ్చుకున్నాయి, నా ఆత్మ వాటికున్న విషం త్రాగింది; దేవుని భయంకరకార్యాలు నాకు వ్యతిరేకంగా మోహరించి ఉన్నాయి.
5గడ్డి దొరికితే అడవి గాడిద అరుస్తుందా, మేత దొరికితే ఎద్దు రంకెవేస్తుందా?
6ఉప్పు లేకుండ రుచిలేని ఆహారం ఎవరైనా తింటారా? గుడ్డులోని తెలుపుకు రుచి ఉంటుందా?
7నేను దాన్ని తాకను, అలాంటి ఆహారం తింటే నా ఆరోగ్యం పాడవుతుంది.
8“నా అభ్యర్థన నెరవేరి, దేవుడే నా కోరికను అనుగ్రహించియుంటే బాగుండేది,
9దేవుడు ఇష్టపూర్వకంగా నన్ను నలిపివేసి, తన చేయి జాడించి నా ప్రాణాన్ని తీసివేస్తే బాగుండేది!
10అప్పుడు నేను ఈ ఆదరణ కలిగి ఉంటాను, భరించలేని బాధలో ఉన్నప్పటికీ, పరిశుద్ధుని మాటలు నేను తిరస్కరించలేదని ఆనందిస్తాను.
11“నేను ఇంకా నిరీక్షణ కలిగి ఉండడానికి నాకున్న బలమెంత? నేను ఓపికగా ఉండడానికి నా అంతం ఏపాటిది?
12రాయికున్నంత బలం నాకుందా? నాదేమైనా ఇత్తడి శరీరమా?
13నాకు నేను సహాయం చేసుకోగల శక్తి నాలో ఏమైన ఉన్నదా? నా శక్తి నన్ను పూర్తిగా విడిచిపెట్టింది.
14“స్నేహితునికి దయ చూపనివాడు సర్వశక్తిమంతుడైన దేవుని భయం విడిచిపెట్టినవాడు.
15కాని నా సహోదరులు నమ్మదగని జలప్రవాహాల్లా ఉన్నారు, ఉప్పొంగే వాగుల్లా ఆధారపడదగనివారుగా ఉన్నారు,
16అవి కరిగిపోతున్న మంచుగడ్డలతో, వాటి మీద కురిసిన మంచుతో అవి నల్లబారాయి.
17కాని వేసవికాలంలో వాటి ప్రవాహం ఆగిపోతుంది, వేడికి వాటి స్థలాల్లోనే అవి ఆవిరైపోతాయి.
18అవి ప్రవహించే మార్గాల నుండి ప్రక్కకు తిరుగుతాయి; అవి బంజరు భూమిలో వెళ్లి నశించిపోతాయి.
19తేమా వర్తకుల గుంపు నీటి కోసం వెదకుతారు, షేబ వ్యాపారులు వాటికోసం ఆశతో చూస్తారు.
20వారు నమ్మకంగా ఉన్నందుకు వారు దుఃఖపడుతున్నారు, అక్కడికి వచ్చి వారు నిరాశ చెందారు.
21ఇప్పుడు మీరు కూడా ఏ సహాయం ఇవ్వలేరని నిరూపించారు; మీరు ఆపదను చూసి భయపడుతున్నారు.
22నేను ఎప్పుడైనా, ‘నాకేమైనా ఇవ్వండి అని అడిగానా? మీ ఆస్తిలో నుండి నాకేమైనా బహుమానం తెమ్మని అడిగానా?
23శత్రువుల చేతిలో నుండి నన్ను విడిపించమని, క్రూరుల బారి నుండి నన్ను తప్పించండి’ అని అడిగానా?
24“నాకు బోధించండి, నేను మౌనంగా ఉంటాను; నా తప్పేంటో నేను గ్రహించేలా నాకు చూపించండి.
25యథార్థమైన మాటలు ఎంతో బాధాకరమైనవి, కాని మీ వాదనలు ఏమి నిరూపిస్తున్నాయి?
26నేను చెప్పే మాటలను సరిచేయాలని చూస్తున్నారా, నిరాశతో కూడిన నా మాటలు గాలివంటివే అని అనుకుంటున్నారా?
27మీరు తండ్రిలేనివారిని కొనడానికి చీట్లు వేస్తారు, మీ స్నేహితుని మీద బేరమాడతారు.
28“అయితే ఇప్పుడు నన్ను దయతో చూడండి, మీ ముఖాలు చూస్తూ అబద్ధం చెప్పగలనా?
29పశ్చాత్తాపపడండి, అన్యాయం చేయకండి; మరలా విచారించండి ఎందుకంటే నాలో ఇంకా యథార్థత ఉంది.
30నా పెదవుల మీద దుష్టత్వం ఉందా? నా నోరు దుర్మార్గాన్ని గ్రహించలేదా?
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం — CC BY-SA 4.0. Where these translations come from.
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc. Available free at biblica.com and open.bible. Text unchanged, used under CC BY-SA 4.0.