
యోబు 1
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం
అధ్యాయ సారాంశం
యోబు నిర్దోషిగా, యథార్థంగా, మందలు, పిల్లలలో సంపన్నుడిగా, కుటుంబం పాపం చేస్తే బలులు అర్పించడంలో జాగ్రత్తగా పరిచయం చేయబడతాడు. పరలోక సభలో అతని ఉద్దేశాలు ప్రశ్నించబడతాయి, అతని ఆస్తులు హాని అందుబాటులో ఉంచబడతాయి. నలుగురు దూతలు వరుసగా పూర్తి నష్టం వార్తతో వస్తారు, అయినా యోబు ఆరాధిస్తాడు, దేవుడిని తప్పుగా నిందించడు.
నిజాయితీనష్టంఆరాధనబాధ
1ఊజు దేశంలో యోబు అనే వ్యక్తి ఉండేవాడు. అతడు నిర్దోషమైనవాడు, యథార్థవంతుడు; దేవుడంటే భయం కలిగి చెడుకు దూరంగా ఉండేవాడు.
2అతనికి ఏడుగురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు,
3అతనికి ఏడువేల గొర్రెలు, మూడువేల ఒంటెలు, అయిదువందల జతల ఎద్దులు, అయిదువందల ఆడగాడిదలు ఉన్నాయి, అతనికి ఎందరో సేవకులు ఉన్నారు. తూర్పున ఉన్నవారందరిలో యోబు చాలా గొప్పవాడు.
4అతని కుమారులు తమ ఇళ్ళలో ప్రత్యేక సందర్భాలలో విందులు చేసుకునేవారు తమతో కలిసి తిని త్రాగడానికి తమ ముగ్గురు అక్కచెల్లెళ్లను కూడా పిలిచేవారు.
5విందులు ముగిసిన వెంటనే యోబు, “నా పిల్లలు పాపం చేసి తమ హృదయాల్లో దేవుని శపించారేమో” అని అనుకుని వారందరిని పిలిపించి పవిత్రపరచడానికి ఏర్పాట్లు చేసేవాడు. తెల్లవారుజామునే తన పిల్లల్లో ఒక్కొక్కరి కోసం దహనబలి అర్పించేవాడు. యోబు నిత్యం అలా చేస్తూ ఉండేవాడు.
6ఒక రోజు దేవదూతలు యెహోవా సన్నిధిలో సమకూడారు, సాతాను కూడా వారితో కలిసి వచ్చాడు.
7యెహోవా, “నీవెక్కడ నుండి వస్తున్నావు?” అని సాతానును అడిగారు. సాతాను, “భూమి మీద అటూ ఇటూ తిరుగుతూ భూమంతా తిరిగి వస్తున్నాను” అని జవాబిచ్చాడు.
8అప్పుడు యెహోవా, “నా సేవకుడైన యోబును నీవు గమనించావా? అతనిలాంటి వ్యక్తి భూమిమీద లేడు; అతడు నిందలేనివాడు, యథార్థవంతుడు, దేవుని భయం కలిగి చెడుకు దూరంగా ఉంటాడు” అన్నారు.
9సాతాను, “యోబు ఏమి లేకుండానే దేవుని పట్ల భయం కలిగి ఉన్నాడా?
10అతని చుట్టూ అతని కుటుంబం చుట్టూ, అతడు కలిగి ఉన్న దానంతటి చుట్టూ మీరు కంచె వేయలేదా? అతని చేతి పనులను మీరు దీవించడం వలన అతని పశువులు, మందలు దేశమంతా విస్తరించాయి.
11అయితే ఇప్పుడు చేయి చాపి అతని సర్వస్వాన్ని మొత్తి చూడండి, తప్పకుండా మిమ్మల్ని మీ ముఖంపై శపిస్తాడు” అని జవాబిచ్చాడు.
12అందుకు యెహోవా, “మంచిది, అతనికున్నదంతటి మీద నీకు అనుమతి ఉంది. అతనికి మాత్రం హాని చేయకు” అని అన్నారు. అప్పుడు సాతాను యెహోవా సన్నిధిలో నుండి వెళ్లిపోయాడు.
13ఒక రోజు యోబు పెద్ద కుమారుడి ఇంట్లో అతని కుమారులు కుమార్తెలు కలిసి భోజనం చేస్తూ ద్రాక్షరసం త్రాగుతూ ఉండగా,
14ఒక దూత యోబు దగ్గరకు వచ్చి, “ఎద్దులు పొలం దున్నుతుండగా గాడిదలు వాటికి దగ్గరలోనే మేస్తుండగా,
15షెబాయీయులు దాడిచేసి పశువులన్నిటిని పట్టుకుపోయారు. ఖడ్గంతో సేవకులను చంపేశారు; ఈ సంగతి చెప్పడానికి నేనొక్కడినే తప్పించుకుని వచ్చాను” అని అన్నాడు.
16అతడు ఇంకా మాట్లాడుతుండగానే మరొకడు వచ్చి, “దేవుని అగ్ని ఆకాశం నుండి పడి గొర్రెలను సేవకులను కాల్చివేసింది. ఈ సంగతి చెప్పడానికి నేనొక్కడినే తప్పించుకుని వచ్చాను” అని అన్నాడు.
17అతడు ఇంకా మాట్లాడుతుండగానే మరొకడు వచ్చి, “కల్దీయులు మూడు గుంపులుగా వచ్చి మీ ఒంటెలను దోచుకుపోయారు. ఖడ్గంతో సేవకులను చంపేశారు. ఈ సంగతి చెప్పడానికి నేనొక్కడినే తప్పించుకుని వచ్చాను” అని అన్నాడు.
18అతడు ఇంకా మాట్లాడుతుండగానే మరొకడు వచ్చి, “మీ కుమారులు కుమార్తెలు కలిసి మీ పెద్ద కుమారుని ఇంట్లో భోజనం చేస్తూ ద్రాక్షరసం త్రాగుతుండగా,
19అరణ్యమార్గం నుండి పెద్ద సుడిగాలి వచ్చి ఆ ఇంటి నాలుగు మూలలను కొట్టగానే అది వారి మీద కూలి వారంతా చనిపోయారు. ఈ సంగతి చెప్పడానికి నేనొక్కడినే తప్పించుకుని వచ్చాను” అని అన్నాడు.
20అప్పుడు యోబు పైకి లేచి తన పైవస్త్రాన్ని చింపుకొని గుండు చేసుకుని అప్పుడు నేలమీద సాష్టాంగపడి ఆరాధిస్తూ,
21ఇలా అన్నాడు: “నేను తల్లి గర్భంలోనుండి దిగంబరిగానే వచ్చాను, దిగంబరిగానే వెళ్తాను. యెహోవాయే ఇచ్చారు యెహోవాయే తీసుకున్నారు; యెహోవా నామం స్తుతింపబడును గాక.”
22జరిగిన ఈ సంఘటనలలో ఏ విషయంలోను యోబు పాపం చేయలేదు, దేవున్ని నిందించలేదు.
‹ ఎస్తేరు 10యోబు 2 ›
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం — CC BY-SA 4.0. Where these translations come from.
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc. Available free at biblica.com and open.bible. Text unchanged, used under CC BY-SA 4.0.