Bildad addressing Job beside withered reeds and a fragile shelter

యోబు 8

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం
అధ్యాయ సారాంశం
బిల్దదు దేవుడు న్యాయాన్ని వక్రీకరించడని పట్టుబట్టి యోబు పిల్లలు తమ సొంత పాపం కోసం చనిపోయారని సూచిస్తాడు. పూర్వ తరాల జ్ఞానానికి విజ్ఞప్తి చేస్తూ, అతను దేవుడిలేని వారిని నీరు లేకుండా వాడిపోయే పాపిరసుతో పోలుస్తాడు, యోబు శుద్ధుడైతే దేవుడు ఇంకా అతని నోటిని నవ్వుతో నింపుతాడని హామీ ఇస్తాడు.
బిల్దదుసంప్రదాయంన్యాయంప్రతిఫలం
1అప్పుడు షూహీయుడైన బిల్దదు ఇలా అన్నాడు:
2“ఎంతకాలం నీవు ఇలాంటి మాటలు మాట్లాడతావు? నీ మాటలు సుడిగాలిలా ఉన్నాయి.
3దేవుడు న్యాయాన్ని తలక్రిందులు చేస్తారా? సర్వశక్తిమంతుడు ధర్మాన్ని వక్రీకరిస్తారా?
4నీ పిల్లలు ఆయనకు విరోధంగా పాపం చేసి ఉండవచ్చు, అందుకే ఆయన వారి పాపానికి తగ్గ శిక్షకు వారిని అప్పగించారు.
5కాని నీవు జాగ్రత్తగా దేవుని వెదికితే, సర్వశక్తిమంతుడైన దేవుని వేడుకుంటే,
6నీవు పవిత్రంగా యథార్థంగా ఉంటే, ఇప్పుడే ఆయన నీ పక్షాన లేస్తారు, నీ సంపన్న స్థితిని తిరిగి ఇస్తారు.
7నీ స్థితి మొదట మామూలుగా ఉన్నా, చివరకు అది ఎంతో అభివృద్ధి చెందుతుంది.
8“గత తరం వారిని అడుగు, వారి పూర్వికులు చేసిన శోధనను గమనించు,
9ఎందుకంటే మనం నిన్న పుట్టినవారం, మనకు ఏమి తెలియదు, భూమిపై మన రోజులు నీడ వంటివి.
10వారు నీకు బోధించి చెప్పరా? వారు తమ అనుభవంతో మాట్లాడరా?
11బురద లేకుండ జమ్ము పెరుగుతుందా? నీళ్లు లేకుండ రెల్లు ఎదుగుతుందా?
12అవి కోయకముందు పచ్చగా ఉంటాయి గడ్డి కంటే త్వరగా వాడిపోతాయి.
13దేవుడిని మరచిపోయే వారందరి గతి ఇలాగే ఉంటుంది; భక్తిహీనుల ఆశ అడుగంటిపోతుంది.
14వారు నమ్మేది పెళుసుగా ఉంటుంది. వారి ఆశ్రయం సాలెగూడు వంటిది.
15వారు సాలెగూడును ఆశ్రయిస్తారు కాని అది నిలబడదు, వారు దానిని అంటిపెట్టుకుంటారు కాని అది విడిపోతుంది.
16వారు సూర్యరశ్మిలో సమృద్ధి నీరు కలిగిన వాటిలా పచ్చగా ఉంటూ, వాటి తీగలు వారి తోటమీద అల్లుకుంటూ విస్తరిస్తారు.
17దాని వేర్లు రాళ్ల చుట్టూ చుట్టుకొని, రాళ్ల మధ్యకు చొచ్చుకుపోవాలని చూస్తుంది.
18ఆ చోటు నుండి అది తెంచివేయబడినప్పుడు, ఆ చోటు ‘నేను నిన్నెప్పుడు చూడలేదు’ అంటూ దానిని నిరాకరిస్తుంది.
19ఖచ్చితంగా అది వాడిపోతుంది, భూమిలో నుండి వేరే మొక్కలు మొలుస్తాయి.
20“దేవుడు నిర్దోషిని త్రోసివేయరు దుర్మార్గుల చేతులను బలపరచరు.
21ఆయన నీ నోటిని నవ్వుతో, నీ పెదవులను ఆనంద ధ్వనులతో నింపుతారు.
22నీ శత్రువులు అవమానాన్ని ధరిస్తారు, దుర్మార్గుల గుడారాలు ఇక ఉండవు.”

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం — CC BY-SA 4.0. Where these translations come from.

Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc. Available free at biblica.com and open.bible. Text unchanged, used under CC BY-SA 4.0.