Job sitting at dusk beside extinguished lamps and broken tent cords

యోబు 17

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం
అధ్యాయ సారాంశం
యోబు తన ఆత్మ విరిగిపోయిందని, తన రోజులు తెగిపోయాయని, సమాధి తన కోసం సిద్ధంగా ఉందని చెబుతాడు. అపహాస్యం చేసేవారితో, పరీక్షలో విఫలమైన స్నేహితులతో చుట్టుముట్టబడి, అతను తన తరపున ఎవరు హామీ ఇస్తారని అడిగి, తన మిగిలిన ఏకైక నిరీక్షణ చీకటిలో వెతకవలసి ఉంటుందని కనుగొంటాడు.
నిరాశఅపహాస్యంనిరీక్షణమరణం
1“నా ప్రాణం క్రుంగిపోయింది, నా రోజులు కుదించబడ్డాయి. సమాధి నా కోసం ఎదురుచూస్తుంది.
2ఎగతాళి చేసేవారు నన్ను చుట్టుముట్టారు; నేను చూస్తూ ఉండగానే వారు వివాదం రేపుతున్నారు.
3“దేవా, మీరే నా కోసం జామీనుగా నిలవండి. ఇంకెవరు నాకు భద్రత ఇవ్వగలరు?
4గ్రహించకుండా మీరు వారి హృదయాలను మూసివేశారు. కాబట్టి మీరు వారిని విజయం పొందనివ్వరు.
5స్వలాభం కోసం తమ స్నేహితులను ఎవరైనా మోసం చేస్తే వారి పిల్లల కళ్లు మసకబారతాయి.
6“దేవుడు నన్ను ప్రజలందరికి ఒక సామెతగా చేశారు, నా ముఖం మీద ప్రజలు ఉమ్మివేస్తారు.
7దుఃఖంతో నా చూపు మందగించింది. నా అవయవాలు నీడలా మారాయి.
8యథార్థవంతులు దీనినిచూసి ఆశ్చర్యపడతారు; నిర్దోషులు భక్తిహీనులను చూసి ఆందోళన చెందుతారు.
9అయితే నీతిమంతులు తమ మార్గాలను విడిచిపెట్టరు, నిరపరాధులు బలాన్ని పొందుకుంటారు.
10“మీరందరు మరోసారి రండి, మరలా ప్రయత్నించండి! నాకు మీలో జ్ఞానవంతుడు ఒక్కడు కూడా కనిపించలేదు.
11నా రోజులు గతించిపోయాయి, నా ఆలోచనలు వ్యర్థమయ్యాయి. నా హృదయ వాంఛలు భంగమయ్యాయి.
12ఈ మనుష్యులు రాత్రిని పగలని, చీకటి కమ్ముకున్నప్పుడు వెలుగు వచ్చిందని వాదిస్తారు.
13నాకున్న ఆశ ఏంటంటే సమాధి నాకు ఇల్లు అవ్వాలి, చీకటిలో నా పరుపు పరచుకోవాలి.
14నేను అవినీతితో, ‘నీవే నా తండ్రివి’ అని, పురుగుతో, ‘నా తల్లివి’ లేదా ‘నా సోదరివి’ అని అంటే,
15అప్పుడు నా నిరీక్షణ ఎక్కడున్నట్టు! నా గురించి ఎవరికైనా నిరీక్షణ ఉంటుందా?
16అది మరణపు తలుపుల దగ్గరకు దిగిపోతుందా? నాతో పాటు మట్టిలో కలిసిపోదా?”

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం — CC BY-SA 4.0. Where these translations come from.

Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc. Available free at biblica.com and open.bible. Text unchanged, used under CC BY-SA 4.0.