Job surrounded by arguing friends while looking toward a clear light

యోబు 16

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం
అధ్యాయ సారాంశం
యోబు తన స్నేహితులను దౌర్భాగ్య ఓదార్పరులు అని పిలిచి, వారి స్థానాలు మారినట్లయితే తాను కూడా వారిలా మాట్లాడగలనని చెబుతాడు. అతను శత్రువుచే వలె అలసిపోతున్నట్లు వర్ణిస్తాడు, అయినా ఏడ్చి ముఖం ఎర్రబడినా తన చేతులు శుభ్రంగా ఉన్నాయని, పరలోకంలో తన వాదనను వాదించే సాక్షి ఉన్నాడని పట్టుబడతాడు.
బాధతప్పుడు ఓదార్పుసాక్షివిజ్ఞప్తి
1అప్పుడు యోబు ఇచ్చిన జవాబు:
2నేను ఇలాంటి విషయాలెన్నో విన్నాను; మీరందరు నీచంగా ఓదార్చేవారు.
3మీ గాలిమాటలకు అంతం లేదా? మీరు ఇలాంటి సమాధానం ఇచ్చేలా ఏది మిమ్మల్ని బలవంతం చేస్తుంది?
4నేనున్న స్థానంలో మీరు ఉంటే, నేనూ మీలాగే మాట్లాడగలను; మీకు వ్యతిరేకంగా ఎన్నో మాటలు మాట్లాడి మిమ్మల్ని చూసి తల ఊపుతూ ఎగతాళి చేయగలను.
5కాని నా నోటి మాట మిమ్మల్ని బలపరుస్తుంది; నా పెదవుల నుండి వచ్చే ఆదరణ మీకు ఉపశమనం కలిగిస్తుంది.
6అయితే నేను మాట్లాడినప్పటికి నా బాధకు ఉపశమనం లేదు; మౌనంగా ఉన్నా నా బాధ తీరదు.
7దేవా, నాకు అలసట కలిగించారు; నా కుటుంబమంతటిని వినాశనం చేశారు.
8మీరు నన్ను అస్థిపంజరంలా చేశారు అది నాకు వ్యతిరేకంగా సాక్ష్యమిస్తుంది; బక్కచిక్కిన నా దేహం నాకు వ్యతిరేకంగా సాక్ష్యమిస్తుంది.
9దేవుడు తన కోపంలో నా మీద దాడి చేసి నన్ను చీల్చివేశారు; ఆయన నా వైపు చూస్తూ పళ్ళు కొరుకుతున్నారు; నాకు శత్రువై నాపై కన్నెర్ర చేసి నావైపు కోపంగా చూస్తున్నారు.
10ప్రజలు నన్ను ఎత్తిపొడవడానికి వారి నోళ్ళు తెరిచారు; నన్ను తిట్టి చెంపదెబ్బలు కొడుతున్నారు. నాకు వ్యతిరేకంగా వారంతా ఒక్కటైయ్యారు.
11దేవుడు నన్ను భక్తిహీనులకు అప్పగించారు. దుర్మార్గుల చేతుల్లో నన్ను పడవేశారు.
12నేను నెమ్మది కలిగి ఉండేవాన్ని, కాని ఆయన నన్ను ముక్కలుగా చేశారు; నా మెడ పట్టుకుని విదిలించి నన్ను నలిపేశారు. ఆయన నన్ను తన గురిగా పెట్టుకున్నారు;
13ఆయన బాణాలు నన్ను చుట్టుకున్నాయి జాలి లేకుండ ఆయన నా మూత్రపిండాల గుండా గుచ్చారు నా పైత్యరసాన్ని నేలపై పారబోశారు.
14పదే పదే ఆయన నన్ను విరుచుకుపడ్డారు; శూరునిలా పరుగున నా మీద పడ్డారు.
15నా చర్మం మీద గోనెపట్ట కుట్టుకున్నాను నా నుదిటిని దుమ్ములో ఉంచాను.
16ఏడ్పుచేత నా ముఖం ఎరుపెక్కింది నా కనురెప్పల మీద చీకటి నీడలు ఉన్నాయి;
17అయినా నా చేతులు దౌర్జన్యానికి దూరంగా ఉన్నాయి, నా ప్రార్థనలు యథార్థంగా ఉన్నాయి.
18భూమీ, నా రక్తాన్ని కప్పివేయకు; నా మొర ఎప్పుడూ వినిపిస్తూనే ఉండాలి.
19ఇప్పుడు కూడా నా సాక్షి పరలోకంలో ఉన్నాడు; నా న్యాయవాది పైన ఉన్నాడు.
20నా కళ్లు దేవుని సన్నిధిలో కన్నీరు కారుస్తుండగా నా మధ్యవర్తి నా స్నేహితుడు
21ఒకడు స్నేహితుని కోసం వేడుకున్నట్లు అతడు నరుని పక్షాన దేవున్ని వేడుకుంటాడు.
22ముందున్నవి ఇంకా కొన్ని సంవత్సరాలే తర్వాత నేను తిరిగి రాలేని మార్గంలో వెళ్తాను.

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం — CC BY-SA 4.0. Where these translations come from.

Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc. Available free at biblica.com and open.bible. Text unchanged, used under CC BY-SA 4.0.