Bildad speaking beside an imagined landscape of traps and darkness

యోబు 18

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం
అధ్యాయ సారాంశం
బిల్దదు యోబు తమను మూర్ఖ పశువులుగా చూస్తున్నాడని ఫిర్యాదు చేసి, దుష్టుని ముగింపును స్పష్టమైన వర్ణనలతో చిత్రిస్తాడు. అతని దీపం ఆరిపోతుంది, ప్రతి అడుగులో ఉరులు వేచి ఉంటాయి, భయం వెనుక నుండి వేటాడుతుంది, వ్యాధి చర్మాన్ని తినేస్తుంది, అగ్ని గుడారంపై స్థిరపడుతుంది, అతని పేరు కొనసాగించడానికి సంతానం మిగలదు.
బిల్దదుదుష్టుడుతీర్పుభయం
1అప్పుడు షూహీయుడైన బిల్దదు ఇలా జవాబిచ్చాడు:
2“నీవు ఈ మాటలు మాట్లాడడం ఎప్పుడు మానేస్తావు? కొంచెం ఆలోచించు, అప్పుడు మేము మాట్లాడతాము.
3నీ దృష్టికి మేము ఎందుకు పశువులుగా తెలివితక్కువ వారిగా కనబడుతున్నాము?
4కోపంలో నిన్ను నీవే ముక్కలు చేసుకున్నవాడవు, నీకోసం భూమంతా విడిచిపెట్టబడాలా? నీకోసం కొండలు వాటి స్థానం తప్పాలా?
5“దుర్మార్గుల దీపం ఆర్పివేయబడుతుంది; వారి అగ్నిజ్వాలలు మండవు.
6వారి గుడారంలో వెలుగు చీకటిగా అవుతుంది; వారి దగ్గర ఉన్న దీపం ఆరిపోతుంది.
7వారి బలమైన అడుగులు బలహీనపడతాయి; వారి సొంత ఆలోచనలే వారిని పడగొడతాయి.
8వారి కాళ్లు వారిని వలలోనికి నడిపిస్తాయి; వారు వలలో పడతారు.
9బోను వారి మడమను పట్టుకుంటుంది; ఉచ్చు వారిని గట్టిగా పట్టుకుంటుంది.
10వారి కోసం నేల మీద ఉరి అమర్చబడింది; వారి దారిలో ఉచ్చు ఉంది.
11భయాలు ప్రతి దిక్కునుండి వారిని ఆవరిస్తాయి, అడుగడుగునా వారిని వెంటాడతాయి.
12విపత్తు వారి కోసం ఆకలితో ఉంది; వారు పడిపోతే ఆపద వారి కోసం సిద్ధంగా ఉంది.
13అది వారి చర్మ భాగాలను తినివేస్తుంది; మరణం యొక్క మొదటి సంతానం వారి అవయవాలను మ్రింగివేస్తుంది.
14వారి గుడారంలో ఉన్న భద్రత నుండి వారు పెరికివేయబడ్డారు. భయం కలిగించే రాజు దగ్గరకు కొనిపోబడతారు.
15అగ్ని వారి గుడారంలో నివసిస్తుంది. వారి నివాసం మీద మండే గంధకం చెదిరిపోతుంది.
16క్రింద వారి వేర్లు ఎండిపోతాయి పైన వారి కొమ్మలు వాడిపోతాయి.
17భూమి మీద వారి జ్ఞాపకం నశించిపోతుంది; నేలమీద వారి పేరే ఉండదు.
18వెలుగులో నుండి చీకటిలోకి వారు నడిపించబడతారు లోకం నుండి వారు తరిమివేయబడతారు.
19తమ ప్రజల్లో వారికి సంతానం గాని వారసులు గాని ఉండరు, ఒకప్పుడు వారు నివాసమున్న స్థలాల్లో బ్రతికి ఉన్నవారు ఎవరు లేరు.
20వారి దుస్థితిని చూసిన పశ్చిమ ప్రజలు ఆందోళన చెందుతారు; తూర్పున ఉన్నవారు భయంతో నిండి ఉంటారు.
21ఖచ్చితంగా దుర్మార్గుల నివాసం ఇలాగే ఉంటుంది; దేవుని ఎరుగనివారి స్థలం కూడా ఇలానే ఉంటుంది.”

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం — CC BY-SA 4.0. Where these translations come from.

Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc. Available free at biblica.com and open.bible. Text unchanged, used under CC BY-SA 4.0.