
యోబు 13
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం
అధ్యాయ సారాంశం
యోబు తన స్నేహితులను సత్యాన్ని పూత పూసే పనికిరాని వైద్యులుగా, దేవుని తరపున అబద్ధాలు చెప్పేవారిగా తిరస్కరిస్తాడు. తన వాదనను నేరుగా వినిపించాలని నిశ్చయించుకుని, అతను దాని కోసం చంపబడినా తన మార్గాన్ని పట్టుకుంటానని చెప్పి, మాట్లాడగలిగేలా భయాన్ని ఉపసంహరించుకోమని మాత్రమే దేవుడిని అడుగుతాడు.
నిజాయితీతప్పుడు సలహాదైవిక వినికిడిధైర్యం
1నా కళ్లు ఇదంతా చూశాయి, నా చెవులు విని గ్రహించాయి.
2మీకు తెలిసింది నాకు కూడా తెలుసు. మీకు నేనేమి తీసిపోను.
3అయినా, సర్వశక్తిమంతుడైన దేవునితో మాట్లాడాలని దేవునితోనే వాదించాలని కోరుతున్నాను.
4అయితే మీరు అబద్ధాలను పుట్టిస్తారు. మీరంతా ఎందుకు పనికిరాని వైద్యులు!
5మీరందరు మౌనంగా ఉంటే మంచిది, మీకు అదే జ్ఞానము.
6ఇప్పుడు నా వాదన వినండి; నా వాదనలు ఆలకించండి.
7దేవుని పక్షంగా మీరు దుర్మార్గంగా మాట్లాడగలరా? ఆయన కోసం వంచనగా మాట్లాడగలరా?
8ఆయన పట్ల పక్షపాతం చూపిస్తారా? దేవుని పక్షంగా మీరు వాదిస్తారా?
9ఒకవేళ దేవుడు మిమ్మల్ని పరీక్షిస్తే బాగుంటుందా? ఒక మనిషిని మోసం చేసినట్టు మీరు ఆయనను మోసం చేయగలరా?
10మీరు రహస్యంగా పక్షపాతం చూపిస్తే ఆయన ఖచ్చితంగా మిమ్మల్ని గద్దిస్తారు.
11దేవుని వైభవం మిమ్మల్ని భయపెట్టదా? ఆయన భయం మీ మీదికి రాదా?
12మీ నీతిమాటలు బూడిదలాంటి సామెతలు, మీ వాదనలు మట్టి వాదనలు.
13మౌనంగా ఉండండి నన్ను మాట్లాడనివ్వండి; అప్పుడు నా మీదికి ఏది రావాలో అది వస్తుంది.
14నేనెందుకు ప్రమాదంలో పడాలి? నా ప్రాణాన్ని ఎందుకు నా చేతుల్లో పెట్టుకోవాలి?
15ఆయన నన్ను చంపినా సరే ఆయనలోనే నిరీక్షిస్తాను; నా మార్గం గురించి నేరుగా ఆయనతో వాదిస్తాను.
16ఇది నాకు విడుదలలా మారుతుంది, ఎందుకంటే భక్తిహీనులు దేవుని ముందుకు రావడానికి తెగించలేరు!
17నా మాటలను శ్రద్ధగా వినండి. మీ చెవుల్లో నా మాటలు మారుమ్రోగాలి.
18ఇప్పుడు నా వ్యాజ్యెం సిద్ధంగా ఉంది కాబట్టి, నేను నిర్దోషినని రుజువవుతానని నాకు తెలుసు.
19ఎవరైనా నాపై ఆరోపణలు చేయగలరా? ఒకవేళ చేయగలిగితే, నేను మౌనంగా ఉండి చనిపోతాను.
20దేవా! కేవలం రెండింటిని నాకు అనుగ్రహించండి, అప్పుడు మీ నుండి నేను దాగను.
21మీ చేతిని నా మీద నుండి తీసివేయండి, మీ భయంతో నన్ను భయపెట్టకండి.
22అప్పుడు నన్ను పిలిస్తే నేను జవాబిస్తాను. నన్ను మాట్లాడనిచ్చి మీరు జవాబివ్వండి.
23నేను ఎన్ని దోషాలను పాపాలను చేశాను? నా అతిక్రమాన్ని నా పాపాన్ని నాకు చూపించండి.
24ఎందుకు మీ ముఖాన్ని దాచుకుంటున్నారు? ఎందుకు నన్ను శత్రువుగా భావిస్తున్నారు?
25గాలికి ఎగిరే ఆకును మీరు వేధిస్తారా? ఎండిన చెత్తను మీరు తరుముతారా?
26మీరు నాకు కఠిన శిక్ష విధించారు యవ్వనకాలంలో చేసిన పాపాల ప్రతిఫలం అనుభవించేలా చేశారు.
27సంకెళ్ళతో నా కాళ్లు బిగించారు. నా అరికాళ్ల చుట్టూ గీత గీసి, నా ప్రవర్తనంతటిని జాగ్రత్తగా కనిపెడుతున్నారు.
28మురిగి కుళ్ళిపోతున్న దానిలా, చిమ్మెటలు కొట్టిన వస్త్రంలా మనిషి నాశనమవుతాడు.
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం — CC BY-SA 4.0. Where these translations come from.
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc. Available free at biblica.com and open.bible. Text unchanged, used under CC BY-SA 4.0.