
యోబు 14
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం
అధ్యాయ సారాంశం
యోబు నరికిన చెట్టును, నీటి వాసనకు మళ్లీ మొలకెత్తగలదని, పడుకుని లేవని మనిషితో పోలుస్తాడు. చనిపోయినవారు మళ్లీ జీవించగలరా అని అడిగి, నియమిత సమయం వరకు వేచి ఉండి దేవుడు పిలిచినప్పుడు తాను జవాబిస్తానని ఊహించుకుంటాడు, తరువాత నిరీక్షణను క్షీణింపజేసే కోతలోకి తిరిగి వస్తాడు.
మర్త్యత్వంనిరీక్షణనూతనీకరణమానవ బలహీనత
1“స్త్రీకి పుట్టిన మనుష్యులు, ఉండేది కొంతకాలమే అయినా ఎన్నో శ్రమలు పొందుతారు.
2వారు పువ్వులా వికసించి వాడిపోతారు; నిలకడలేని నీడలా వారు స్థిరంగా ఉండరు.
3అలాంటివారి మీద మీ దృష్టిని నిలిపారా? తీర్పు తీర్చడానికి వారిని మీ ఎదుటికి తీసుకువస్తారా?
4అపవిత్రమైన దాని నుండి పవిత్రమైన దానిని ఎవరు తీసుకురాగలరు? ఎవరు తీసుకురాలేరు!
5మనుష్యులు బ్రతికే రోజులు నిశ్చయించబడ్డాయి; వారు ఎన్ని నెలలు బ్రతుకుతారో మీరు శాసించారు వారు దాటలేని పరిధిని మీరు నియమించారు.
6కూలివారిలా వారు తమ పని ముగించే వరకు మీరు వారివైపు చూడకండి, వారిని అలా వదిలేయండి.
7“కనీసం చెట్టుకైనా నిరీక్షణ ఉంది: దాన్ని నరికివేసినా అది మరలా చిగురిస్తుంది, దానికి లేత కొమ్మలు ఖచ్చితంగా వస్తాయి.
8దాని వేర్లు భూమిలో ఎండిపోయినా దాని మోడు మట్టిలో చనిపోయినా,
9నీటి వాసన తగిలితే చాలు అది చిగురిస్తుంది. లేత మొక్కలా కొమ్మలు వేస్తుంది.
10కాని నరులు చనిపోయి కదలకుండ పడి ఉంటారు; చివరి శ్వాస విడిచిన తర్వాత వారు ఇక ఉండరు.
11సముద్రంలోని నీరు ఆవిరైపోయినట్లుగా, నదీ తీరం హరించి ఎండిపోయినట్లుగా,
12మానవులు నిద్రిస్తారు, తిరిగి లేవరు; ఆకాశం గతించేవరకు వారు మేలుకోరు వారి నిద్ర నుండి తిరిగి లేవరు.
13“మీరు నన్ను సమాధిలో దాచిపెడితే, మీ కోపాగ్ని చల్లారే వరకు నన్ను దాచి ఉంచితే ఎంత బాగుండేది! మీరు నాకు కొంతకాలం నియమించి ఆ తర్వాత నన్ను జ్ఞాపకం చేసుకుంటే బాగుండేది!
14ఎవరైనా చనిపోతే వారు మరలా బ్రతుకుతారా? అలా అయితే నేను కష్టపడి పనిచేసే రోజులన్నీ నా విడుదల కోసం నేను ఎదురుచూస్తాను.
15అప్పుడు మీరు పిలుస్తారు నేను జవాబిస్తాను; మీ చేతులు చేసిన వాటిని మీరు ఇష్టపడతారు.
16అప్పుడు ఖచ్చితంగా మీరు నా అడుగులను లెక్కిస్తారు కాని నా పాపాలను గుర్తించరు.
17నా అతిక్రమాలు సంచిలో మూసివేయబడతాయి; మీరు నా పాపాన్ని కప్పివేస్తారు.
18“పర్వతాలు క్షీణించి ముక్కలైనట్లుగా కొండలు వాటి స్థానం తప్పునట్లుగా,
19నీళ్లు రాళ్లను అరగదీసినట్లుగా ప్రవాహాలు మట్టిని కడిగివేసినట్లు, మీరు మనిషి యొక్క నిరీక్షణను నాశనం చేస్తారు.
20మీరు వారిని ఒకేసారి జయిస్తారు, వారు గతించిపోతారు; మీరు వారి ముఖం తీరు మార్చివేసి వారిని వెళ్లగొడతారు.
21ఒకవేళ వారి పిల్లలు గౌరవించబడినా అది వారికి తెలియదు; వారి సంతానం అణచివేయబడినా వారు గ్రహించలేరు.
22వారు తమ శరీరంలోని బాధను మాత్రమే అనుభవిస్తారు తమ కోసం మాత్రమే దుఃఖపడతారు.”
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం — CC BY-SA 4.0. Where these translations come from.
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc. Available free at biblica.com and open.bible. Text unchanged, used under CC BY-SA 4.0.