Job answering his friends amid animals, earth, and discarded crowns

యోబు 12

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం
అధ్యాయ సారాంశం
యోబు వ్యంగ్యంగా తన స్నేహితులతో పాటు జ్ఞానం ఖచ్చితంగా మరణిస్తుందని జవాబిస్తాడు, జంతువులు, పక్షులు, చేపలు వారు తెలుసునని చెప్పేదాన్ని బోధించగలవని అంటాడు. తరువాత అతను సలహాదారులను, న్యాయాధిపతులను, యాజకులను, జాతులను వారి స్థానం నుండి తొలగించే దేవుడిని వివరిస్తాడు, ఇది చక్కటి వివరణలను ధృవీకరించడం కంటే వాటిని అస్థిరపరిచే శక్తి.
సృష్టిజ్ఞానంసర్వాధికారంమానవ గర్వం
1అప్పుడు యోబు ఇచ్చిన జవాబు:
2నిస్సందేహంగా లోకంలో మీరే జ్ఞానులు, మీతో పాటే జ్ఞానం అంతరిస్తుంది!
3అయినా మీకున్నట్లే నాకు కూడా గ్రహించే మనస్సు ఉంది, నేను మీకేమి తీసిపోను. ఈ విషయాలు తెలియనివారు ఎవరు?
4నేను దేవునికి ప్రార్థించగా ఆయన సమాధానం ఇచ్చినప్పటికీ, నా స్నేహితుల ముందు నేను నవ్వులపాలయ్యాను, నీతిగా నిందారహితంగా ఉన్న నేను నవ్వులపాలయ్యాను.
5నిశ్చింతగా ఉన్నవారు అభాగ్యులను తిరస్కరిస్తారు, పాదాలు జారిపోతున్న వారి విధిని చూసి ఎగతాళి చేస్తారు.
6బందిపోటు దొంగల గుడారాలు ప్రశాంతంగా ఉంటాయి, దేవునికి కోపం పుట్టించే వారు సురక్షితంగా ఉంటారు, వారి దేవుడు వారి చేతిలోనే ఉన్నాడు.
7కాని జంతువులను అడగండి అవి మీకు బోధిస్తాయి, ఆకాశంలోని పక్షులను అడగండి అవి మీకు చెప్తాయి.
8భూమితో మాట్లాడండి అది మీకు బోధిస్తుంది, సముద్రంలోని చేపలు మీకు తెలియచేస్తాయి.
9వీటన్నిటిని యెహోవా హస్తం చేసిందని తెలుసుకోలేనివారు ఎవరు?
10ఆయన చేతిలో జీవులన్నిటి ప్రాణం మానవులందరి ఊపిరి ఉంది.
11నాలుక ఆహారం రుచిని చూసినట్లు చెవి మాటలను పరిశీలించదా?
12వృద్ధుల దగ్గర జ్ఞానం దొరకదా? దీర్ఘాయువు గ్రహింపును తీసుకురాదా?
13జ్ఞానం శక్తి దేవునికి చెందినవి; ఆలోచన గ్రహింపు ఆయనవే.
14దేవుడు పడగొట్టిన దానిని తిరిగి కట్టలేరు; ఆయన బంధించిన వారిని ఎవరూ విడిపించలేరు.
15ఆయన జలాలను ఆపేస్తే అవి ఎండిపోతాయి; ఆయన వాటిని వదిలేస్తే అవి భూమిని వరదలతో నాశనం చేస్తాయి.
16బలం వివేకం ఆయనకు చెందినవే; మోసపోయేవారు మోసగించేవారు ఆయన వారే.
17ఆయన ఆలోచనకర్తలను దిగంబరులుగా నడిపిస్తారు, న్యాయాధిపతులను బుద్ధిహీనులుగా చేస్తారు.
18ఆయన రాజులు వేసిన సంకెళ్ళు తీసివేస్తారు వారి నడుము చుట్టూ తాడు కడతాడు.
19యాజకులను దిగంబరులుగా చేసి నడిపిస్తారు, స్థిరంగా పాతుకుపోయిన అధికారులను పడగొడతారు.
20నమ్మకమైన సలహాదారుల మాటలను నిరర్థకం చేస్తారు, పెద్దల వివేచనను తీసివేస్తారు.
21ఆయన అధిపతుల మీద అవమానాన్ని కురిపిస్తారు, బలవంతులను నిరాయుధులనుగా చేస్తారు.
22ఆయన చీకటిలోని లోతైన విషయాలను వెల్లడిస్తారు చిమ్మ చీకటిని వెలుగులోకి తెస్తారు.
23ఆయన దేశాలను గొప్ప చేస్తారు వాటిని నాశనం చేస్తారు; దేశాలను విశాలపరుస్తారు వాటిని చెదరగొడతారు.
24ఆయన భూలోక నాయకుల గ్రహింపును తీసివేస్తారు; వారు దారిలేని ఎడారిలో తిరుగులాడేలా చేస్తారు.
25వారు వెలుగు లేదా చీకటిలో తడబడతారు; ఆయన వారిని త్రాగుబోతు తూలినట్లు తూలేలా చేస్తారు.

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం — CC BY-SA 4.0. Where these translations come from.

Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc. Available free at biblica.com and open.bible. Text unchanged, used under CC BY-SA 4.0.