
యోబు 11
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం
అధ్యాయ సారాంశం
జోఫరు దేవుడు మాట్లాడి యోబు దాచిన దోషంగా అతను భావించేదాన్ని బయటపెట్టాలని బిగ్గరగా కోరుకుంటాడు. యోబు దేవుని లోతైన విషయాలను, ఆకాశం కంటే ఎత్తైన, సమాధి కంటే లోతైన వాటిని అర్థం చేసుకోగలడా అని అడిగి, యోబు పాపాన్ని దూరం చేస్తే అతని జీవితం మధ్యాహ్నం కంటే ప్రకాశవంతంగా ఉంటుందని వాగ్దానం చేస్తాడు.
జోఫరుగద్దింపుపశ్చాత్తాపంనిరీక్షణ
1అప్పుడు నయమాతీయుడైన జోఫరు ఇలా జవాబిచ్చాడు:
2“ఈ మాటలన్నిటికి జవాబు చెప్పాలి కదా? ఈ వదరుబోతు నిర్దోషిగా గుర్తించబడాలా?
3నీ వ్యర్థమైన మాటలు విని ఇతరులు మౌనంగా ఉండాలా? నీవు ఎగతాళి చేసినప్పుడు నిన్నెవరు మందలించరా?
4నీవు దేవునితో, ‘నా నమ్మకాలు నిర్దోషమైనవి, మీ దృష్టికి నేను పవిత్రుడను’ అని చెప్తున్నావు.
5అయితే దేవుడు నీతో మాట్లాడాలని, ఆయన నీతో వాదించాలని,
6జ్ఞాన రహస్యాలు ఆయనే నీకు తెలియజేయాలని నేను ఎంతో కోరుతున్నాను, ఎందుకంటే, నిజమైన జ్ఞానం నీ ఆలోచనకు మించింది. నీ పాపాల్లో కొన్నిటిని దేవుడు మరచిపోయారని తెలుసుకో.
7“దేవుని రహస్యాలను నీవు గ్రహించగలవా? సర్వశక్తిమంతుడైన దేవుని గురించి పూర్తిగా తెలుసుకోగలవా?
8అవి పైనున్న ఆకాశాలకన్నా ఉన్నతమైనవి, నీవు ఏమి చేయగలవు? అవి పాతాళం కంటే లోతైనవి, నీవు ఏమి తెలుసుకోగలవు?
9అవి భూమి కంటే పొడవైనవి, సముద్రం కంటే విశాలమైనవి.
10“ఆయన వచ్చి, నిన్ను చెరసాలలో బంధిస్తే న్యాయసభను ఏర్పాటుచేస్తే, ఆయనను ఎవరు అడ్డగించగలరు?
11మోసగాళ్లు ఎవరో ఆయనకు తెలుసు; చెడుతనాన్ని చూసిప్పుడు, ఆయన దానిని గమనించడా?
12అడవి గాడిదపిల్ల మనిషిగా పుడుతుందేమో కాని, తెలివిలేనివాడు తెలివైనవానిగా మారడం కష్టము.
13“నీవు నీ హృదయాన్ని సమర్పించుకొని, నీ చేతులు ఆయన వైపు చాపితే,
14నీ చేతిలో ఉన్న పాపాన్ని నీవు విడిచిపెడితే నీ గుడారంలో చెడుకు చోటివ్వకపోతే,
15అప్పుడు నిర్దోషిగా నీ ముఖాన్ని పైకెత్తుతావు; భయం లేకుండా స్థిరంగా నిలబడతావు.
16నీ కష్టాన్ని తప్పకుండా నీవు మరచిపోతావు. పారుతూ దాటిపోయిన నీటిలా మాత్రమే నీవు దాన్ని గుర్తుచేసుకుంటావు.
17అప్పుడు నీ బ్రతుకు మధ్యాహ్నకాల ప్రకాశం కన్నా ఎక్కువ ప్రకాశిస్తుంది. చీకటి ఉన్నా అది ఉదయపు వెలుగులా ఉంటుంది.
18అప్పుడు నిరీక్షణ ఉంటుంది కాబట్టి నీవు భద్రత కలిగి ఉంటావు. నీ ఇంటిని పరిశోధించి సురక్షితంగా పడుకుంటావు.
19ఎవరి భయం లేకుండా నీవు విశ్రమిస్తావు. చాలామంది నీ సహాయాన్ని కోరుకుంటారు.
20కాని దుర్మార్గుల చూపు మందగిస్తుంది. తప్పించుకొనే చోటు వారికి దొరకదు; ప్రాణం ఎప్పుడు పోతుందా అని ఎదురుచూస్తారు.”
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం — CC BY-SA 4.0. Where these translations come from.
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc. Available free at biblica.com and open.bible. Text unchanged, used under CC BY-SA 4.0.