Job in a shadowed room beside clay vessels and receding daylight

యోబు 10

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం
అధ్యాయ సారాంశం
తన జీవితాన్ని అసహ్యించుకుంటూ, యోబు స్వేచ్ఛగా మాట్లాడాలని నిర్ణయించుకుని దేవుడిని తనపై ఆరోపణను చెప్పమని అడుగుతాడు. చర్మంతో ధరించబడి, ఎముకలు, నరాలతో అల్లబడినట్లు గుర్తుచేసుకుంటూ, అదే జాగ్రత్తైన సృష్టి ఇప్పుడు వేటాడబడుతున్నట్లు ఎందుకు అనిపిస్తుందని అడిగి, చీకటి భూమికి వెళ్లే ముందు కొంచెం ఉపశమనం కోసం వేడుకుంటాడు.
సృష్టివిలాపంచేదుమర్త్యత్వం
1“నా బ్రతుకును నేను అసహ్యించుకొంటున్నాను; కాబట్టి నేను స్వేచ్ఛగా ఫిర్యాదు చేస్తాను నా మనస్సులోని బాధను బట్టి మాట్లాడతాను.
2నేను దేవునితో ఇలా అంటాను: నన్ను దోషిగా భావించకండి, కాని నా మీద మీకున్న ఆరోపణలు నాకు చెప్పండి.
3నన్ను హింసించడం, మీ చేతిపనిని త్రోసివేయడం, దుర్మార్గుల ప్రణాళికలను చూసి సంతోషించడం మీకు ఇష్టమా?
4మీ కళ్లు మనుష్యుల కళ్లలాంటివా? మనుష్యులు చూసేటట్లు మీరు చూస్తారా?
5మీ రోజులు మానవుల రోజుల వంటివా మీ సంవత్సరాలు బలమైన మనుష్యుల సంవత్సరాల వంటివా?
6నేను దోషిని కానని మీ చేతిలో నుండి నన్ను ఎవరూ విడిపించలేరని మీకు తెలిసినప్పటికీ నా అపరాధాలను మీరు వెదకుతున్నారు? నా పాపాలను మీరు పరిశోధిస్తున్నారు?
8“మీ చేతులు నన్ను రూపొందించి తయారుచేశాయి. ఇప్పుడు మీరు నన్ను తిరిగి నాశనం చేస్తారా?
9బంకమట్టిలా నన్ను రూపొందించారని జ్ఞాపకం చేసుకోండి, ఇప్పుడు నన్ను తిరిగి మట్టిలా మారుస్తారా?
10పాలు పోసినట్లు మీరు నన్ను పోయలేదా, జున్నుగడ్డ పేరబెట్టినట్లు నన్ను చేయలేదా,
11చర్మంతో మాంసంతో నన్ను కప్పి ఎముకలు నరాలతో కలిపి అల్లలేదా?
12మీరు నాకు జీవాన్ని ఇచ్చి దయ చూపించారు, మీ సంరక్షణతో నా ఆత్మను కాపాడారు.
13“అయితే ఇది మీ హృదయంలో దాచుకున్నారు, ఇది మీ మనస్సులో ఉన్నదని నాకు తెలుసు:
14నేను పాపం చేస్తే, మీరు నన్ను చూస్తుంటారు, నా నేరానికి శిక్ష వేయకుండ వదలరు.
15నేను దోషినైతే నాకు శ్రమ! నేను నిర్దోషినైనప్పటికి నా తల పైకెత్తలేను, ఎందుకంటే నేను అవమానంతో నిండుకొని నా బాధలో మునిగి ఉన్నాను.
16నా తలను పైకెత్తితే సింహం వలె మీరు నన్ను వేటాడతారు, నాకు వ్యతిరేకంగా మీ మహాబలాన్ని మరలా ప్రదర్శిస్తారు.
17మీరు నాకు వ్యతిరేకంగా మరలా సాక్షులను తీసుకువస్తారు నా మీద మీకు కోపం పెరిగిపోతుంది; ఒకదాని తర్వాత ఒకటిగా మీ సైన్యాలు నామీదికి వస్తాయి.
18“అసలు గర్భం నుండి నన్నెందుకు బయటకు తీసుకువచ్చారు? ఎవరు నన్ను చూడకముందే నేను చనిపోయి ఉంటే బాగుండేది.
19అప్పుడు నేను ఉండేవాడిని కాదు, గర్భం నుండి నేరుగా సమాధికి వెళ్లేవాన్ని.
20నాకున్న కొన్ని రోజులు దాదాపు ముగియలేదా? నేను సంతోష గడియలు కలిగి ఉండేలా,
21తిరిగి రాలేని స్థలానికి నేను వెళ్లక ముందు, చీకటి, అంధకారం గల దేశానికి వెళ్లక ముందు నన్ను వదిలేయండి.
22అంధకారం గల చిమ్మచీకటి గందరగోళంగా ఉండే స్థలానికి నన్ను వెళ్లనివ్వండి, అక్కడ వెలుగు కూడా చీకటిలా ఉంటుంది.”

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం — CC BY-SA 4.0. Where these translations come from.

Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc. Available free at biblica.com and open.bible. Text unchanged, used under CC BY-SA 4.0.