
కీర్తనలు 96
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం
అధ్యాయ సారాంశం
కొత్త గీతం పాడమని, శక్తిలేని విగ్రహాలను తిరస్కరించమని, అర్పణలు తీసుకురమ్మని, దైవిక తేజస్సును ప్రకటించమని కీర్తన 96 అన్ని ప్రజలను పిలుస్తుంది. మొత్తం లోకం కోసం నీతియుక్త తీర్పు దగ్గరవుతున్నందున సముద్రం, పొలాలు, అడవులు సంతోషంలో చేరతాయి.
స్తుతిజాతులుసృష్టితీర్పు
1యెహోవాను గురించి క్రొత్త పాట పాడండి; సమస్త భూలోకమా, యెహోవాకు పాడండి.
2యెహోవాకు పాడండి, ఆయన నామాన్ని స్తుతించండి; అనుదినం ఆయన రక్షణను ప్రకటించండి.
3దేశాల్లో ఆయన మహిమను, సకల ప్రజల్లో ఆయన అద్భుత కార్యాలను ప్రకటించండి.
4యెహోవా ఎంతో గొప్పవారు స్తుతికి ఎంతో అర్హులు; దేవుళ్ళందరికంటే ఆయన భయపడదగిన వారు.
5ఇతర దేశాల దేవుళ్ళందరు వట్టి విగ్రహాలు, కాని యెహోవా ఆకాశాలను సృజించారు.
6వైభవం, ప్రభావం ఆయన ఎదుట ఉన్నాయి; బలం, మహిమ ఆయన పరిశుద్ధాలయంలో ఉన్నాయి.
7ప్రజల వంశాల్లారా, యెహోవాకు చెల్లించండి, మహిమను బలాన్ని యెహోవాకు చెల్లించండి.
8యెహోవా నామానికి చెందాల్సిన మహిమను ఆయనకే చెల్లించండి. అర్పణను తీసుకుని ఆయన సన్నిధికి రండి.
9తన పవిత్రత యొక్క వైభవంతో యెహోవాను ఆరాధించండి; సమస్త భూలోకమా! ఆయన ఎదుట వణకాలి.
10“యెహోవా పరిపాలిస్తారు” అని జనాంగాలలో ప్రకటించండి, లోకం స్థిరంగా స్థాపించబడింది, అది కదలదు; ఆయన జనాంగాలకు న్యాయంగా తీర్పు తీరుస్తారు.
11ఆకాశాలు ఆనందించాలి, భూమి సంతోషించాలి; సముద్రం, దానిలోని సమస్తం ఘోషించాలి. ఆయన మహిమను ప్రచురించాలి.
12పొలాలు వాటిలోని సమస్తం ఆనంద ధ్వనులు చేయాలి. అడవి చెట్లు ఆనందంతో పాటలు పాడాలి.
13యెహోవా రాబోతున్నారు. భూలోకానికి తీర్పు తీరుస్తారు. నీతిని బట్టి లోకానికి, తన నమ్మకత్వాన్ని బట్టి ప్రజలకు తీర్పు తీరుస్తారు.
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం — CC BY-SA 4.0. Where these translations come from.
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc. Available free at biblica.com and open.bible. Text unchanged, used under CC BY-SA 4.0.