Priests sound ram's horns over harvest baskets while worshipers gather and a distant idol stands abandoned

కీర్తనలు 81

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం
అధ్యాయ సారాంశం
కీర్తన 81 పండుగ సంగీతాన్ని ఒడంబడిక హెచ్చరికతో కలుపుతుంది. అణచివేసే భారాలను తొలగించిన విమోచకుడు ప్రజలు వినాలని, విదేశీ దేవుళ్లను తిరస్కరించాలని, విశ్వసనీయంగా నడవాలని, ఉదార సదుపాయం నుండి తృప్తికరమైన సమృద్ధిని పొందాలని ఆరాటపడతాడు.
పండుగవిధేయతవిడుదలఏర్పాటు
1మనకు బలంగా ఉన్న దేవునికి ఆనంద గానం చేయండి; యాకోబు దేవునికి బిగ్గరగా కేకలు వేయండి!
2సంగీతం మొదలుపెట్టండి, కంజర వాయించండి. మధురంగా సితారా వీణ మీటండి.
3అమావాస్య దినాన కొమ్ము ఊదండి, పౌర్ణమి పండుగ దినాన కొమ్ము ఊదండి;
4ఇశ్రాయేలీయులకు ఇది శాసనం; ఇది యాకోబు దేవుడు ఇచ్చిన నియమము.
5దేవుడు ఈజిప్టు మీదికి దండెత్తినప్పుడు, ఆయన దానిని యోసేపుకు శాసనంలా స్థాపించారు. తెలియని స్వరం ఇలా చెప్పడం నేను విన్నాను:
6“నేను వారి భుజాల మీది నుండి భారం తొలగించాను; వారి చేతులు గంపలెత్తుట నుండి విడిపించబడ్డాయి.
7మీ బాధలో మీరు మొరపెట్టగా నేను మిమ్మల్ని రక్షించాను, ఉరుములతో కూడిన మేఘంలో నుండి నేను మీకు జవాబు ఇచ్చాను; మెరీబా జలాల దగ్గర నేను మిమ్మల్ని పరీక్షించాను. సెలా
8నా ప్రజలారా, నా మాట వినండి, నేను మిమ్మల్ని హెచ్చరిస్తాను ఇశ్రాయేలీయులారా, మీరు నా మాట మాత్రం వింటే ఎంత మేలు!
9మీ మధ్య ఇతర దేవుడు ఉండకూడదు; మీరు నన్ను తప్ప వేరే ఏ దేవున్ని పూజించకూడదు.
10నేను మీ దేవుడనైన యెహోవాను, మిమ్మల్ని ఈజిప్టు నుండి బయటకు తెచ్చిన వాడను. మీ నోరు బాగా తెరవండి నేను దాన్ని నింపుతాను.
11“కాని నా ప్రజలు నా మాట వినలేదు; ఇశ్రాయేలు నాకు లోబడలేదు.
12కాబట్టి వారి సొంత ఉపాయాలను అనుసరిస్తే ఎంత మేలు! నేను వారి మొండి హృదయాలకు వారిని అప్పగించాను.
13“నా ప్రజలు నా మాట మాత్రమే వింటే, ఇశ్రాయేలు నా మార్గాలను మాత్రమే అనుసరిస్తే,
14అప్పుడు నేను త్వరగా వారి శత్రువులను అణిచివేసేవాన్ని, వారి శత్రువులపై నా చేయి ఎత్తేవాన్ని!
15యెహోవాను ద్వేషించేవారు ఆయన ఎదుట భయంతో దాక్కుంటారు, వారి శిక్ష శాశ్వతంగా ఉంటుంది.
16కానీ మిమ్మల్ని నేను శ్రేష్ఠమైన గోధుమలతో పోషిస్తాను; బండ నుండి తీసిన తేనెతో నేను మిమ్మల్ని తృప్తిపరుస్తాను.”

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం — CC BY-SA 4.0. Where these translations come from.

Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc. Available free at biblica.com and open.bible. Text unchanged, used under CC BY-SA 4.0.