Worshipers pray beside a breached vineyard wall as healthy vines reach toward the sunlit sanctuary

కీర్తనలు 80

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం
అధ్యాయ సారాంశం
మమ్మల్ని పునరుద్ధరించు, నీ ముఖం ప్రకాశించనివ్వు అనే ఒక అత్యవసర ప్రతిధ్వనిని కీర్తన 80 పునరావృతం చేస్తుంది. ఇశ్రాయేలు బహిర్గతమై, దెబ్బతిన్న నాటిన ద్రాక్షతోటలా కనిపిస్తుంది, సమాజం దైవిక కాపరిని పునరుజ్జీవింపజేసి రక్షించమని అడుగుతుంది.
పునరుద్ధరణద్రాక్షతోటప్రార్థనకాపరి
1ఇశ్రాయేలు ప్రజల కాపరీ, యోసేపును మందగా నడిపిస్తున్నవాడా, మమ్మల్ని ఆలకించండి. కెరూబుల మధ్య సింహాసనం మీద ఆసీనుడై ఉన్నవాడా,
2ఎఫ్రాయిం, బెన్యామీను, మనష్షే గోత్రాల ఎదుట ప్రకాశించండి. మీ పరాక్రమాన్ని చూపించండి; వచ్చి మమ్మల్ని రక్షించండి.
3ఓ దేవా, మమ్మల్ని తిరిగి రప్పించండి; మేము రక్షింపబడేలా మీ ముఖం మాపై ప్రకాశింపజేయండి.
4సైన్యాల యెహోవా దేవా, ఎంతకాలం మీ ప్రజల ప్రార్థనలకు వ్యతిరేకంగా మీ కోపం మండుతుంది?
5మీరు వారికి కన్నీటిని ఆహారంగా ఇచ్చారు; మీరు వారిని గిన్నె నిండ కన్నీరు త్రాగేలా చేశారు.
6మమ్మల్ని మా పొరుగువారికి హాస్యాస్పదంగా చేశారు. మా శత్రువులు మమ్మల్ని ఎగతాళి చేస్తున్నారు.
7సైన్యాలకు అధిపతియైన దేవా, మమ్మల్ని పునరుద్ధరించండి; మేము రక్షింపబడేలా మీ ముఖం మాపై ప్రకాశింపజేయండి.
8మీరు ఈజిప్టు నుండి తెచ్చిన ద్రాక్షతీగను నాటారు; మీరు దేశాలను వెళ్లగొట్టి దాన్ని నాటారు.
9మీరు దాని కోసం భూమిని శుభ్రం చేశారు, అది వేళ్ళూనుకొని భూమిని నింపింది.
10దాని నీడ పర్వతాలను కప్పింది, దాని తీగలు దేవదారు చెట్లను కప్పాయి.
11దాని కొమ్మలు సముద్రం వరకు, దాని రెమ్మలు యూఫ్రటీసు నది వరకు వ్యాపించాయి.
12దారిని వెళ్లేవారంతా దాని ద్రాక్షలు తెంపేలా దాని కంచెలను మీరెందుకు పడగొట్టారు?
13అడవి పందులు దానిని నాశనం చేస్తున్నాయి, పొలాల నుండి వచ్చే కీటకాలు దానిని తింటున్నాయి.
14సైన్యాలకు అధిపతియైన దేవా, మా దగ్గరకు తిరిగి రండి! ఆకాశం నుండి ఇటు చూడండి! ఈ ద్రాక్షవల్లిని గమనించండి.
15అది మీ కుడి హస్తం నాటిన వేరు, మీ కోసం మీరు పెంచుకొన్న కుమారుడు.
16మా ద్రాక్షవల్లి నరకబడి అగ్నితో కాల్చబడింది; మీ గద్దింపుకు మీ ప్రజలు నశిస్తారు.
17మీ కుడి వైపున ఉన్న మనుష్యుని మీద, మీ కోసం మీరు పెంచిన మనుష్యకుమారుని మీద మీ హస్తాన్ని ఉంచండి.
18అప్పుడు మేము మీ దగ్గర నుండి వెళ్లము; మమ్మల్ని ఉజ్జీవింపచేయండి, మీ పేరట మేము ప్రార్థిస్తాము.
19సైన్యాల యెహోవా, దేవా, మమ్మల్ని తిరిగి రప్పించండి; మేము రక్షింపబడేలా, మీ ముఖం మాపై ప్రకాశింపజేయండి.

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం — CC BY-SA 4.0. Where these translations come from.

Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc. Available free at biblica.com and open.bible. Text unchanged, used under CC BY-SA 4.0.