A falsely accused fugitive watches elders weigh testimony beside an abandoned bow and pit

కీర్తనలు 7

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం
అధ్యాయ సారాంశం
కీర్తన 7 వెంబడింపు నుండి రక్షణ కోసం అడుగుతూ నిజాయితీ గల ఆత్మపరిశీలనను కూడా ఆహ్వానిస్తుంది. న్యాయం దాని సృష్టికర్తపైకి తిరిగి వచ్చే హింసను బయటపెడుతుంది, నిర్దోషులకు సురక్షిత ఆశ్రయం, కృతజ్ఞతా స్తుతికి కారణం ఇస్తుంది.
న్యాయంఆశ్రయంనిర్దోషిత్వంఆత్మపరిశీలన
1యెహోవా నా దేవా, నేను మిమ్మల్ని ఆశ్రయించాను; నన్ను వెంటాడే వారందరి నుండి నన్ను రక్షించి విడిపించండి,
2లేకపోతే వారు సింహంలా చీల్చివేస్తారు ఎవరు విడిపించలేనంతగా నన్ను ముక్కలు చేస్తారు.
3యెహోవా నా దేవా, ఒకవేళ నేను అన్యాయమైన చర్యలకు పాల్పడితే
4నాతో సమాధానంగా ఉన్నవానికి కీడు చేస్తే కారణం లేకుండ నా శత్రువును నేను దోచుకుంటే
5అప్పుడు నా శత్రువు నన్ను వెంటాడి పట్టుకొనును గాక; నా ప్రాణాన్ని నేల మీద అణగద్రొక్కి నా ప్రతిష్ఠను మట్టిపాలు చేయును గాక. సెలా
6యెహోవా, కోపంతో లేవండి; నా శత్రువుల ఆగ్రహానికి వ్యతిరేకంగా లేవండి. నా దేవా, మేల్కొనండి; న్యాయాన్ని శాసించండి.
7మీరు వారికి పైగా ఉన్నత సింహాసనంపై ఆసీనులై ఉండగా, ఆయా జాతుల ప్రజలు మీ చుట్టూ గుమికూడనివ్వండి.
8యెహోవా జనులకు తీర్పు తీర్చును గాక. యెహోవా, నా నీతిని బట్టి, ఓ మహోన్నతుడా, నా యథార్థతను బట్టి నాకు శిక్షావిముక్తి చేయండి.
9మనస్సులను హృదయాలను పరిశీలించే, నీతిమంతుడవైన దేవా, దుష్టుల దుర్మార్గాన్ని అంతం చేసి, నీతిమంతులను భద్రపరచండి.
10యథార్థ హృదయులను కాపాడే సర్వోన్నతుడైన దేవుడే నాకు డాలు.
11దేవుడు నీతిగల న్యాయమూర్తి, ఆయన దుష్టులపై ప్రతిరోజు తన ఉగ్రతను చూపిస్తారు.
12ఒకవేళ ఎవరైనా పశ్చాత్తాపపడకపోతే, దేవుడు తన ఖడ్గాన్ని పదునుపెడతారు; ఆయన తన విల్లు ఎక్కుపెట్టి బాణం సిద్ధపరుస్తారు.
13ఆయన తన మారణాయుధాలు సిద్ధం చేసుకుంటారు; ఆయన తన అగ్ని బాణాలు సిద్ధం చేసుకుంటారు.
14దుష్టులు చెడును గర్భం దాలుస్తారు, కీడును గర్భంలో మోసి అబద్ధాలకు జన్మనిస్తారు.
15ఇతరుల కోసం గుంటను త్రవ్వుతారు తాము త్రవ్విన గుంటలో వారే పడతారు.
16వారు చేసిన కీడు వారికే చుట్టుకుంటుంది; వారు చేసిన హింస వారి తల మీదికే వస్తుంది.
17యెహోవా నీతిని బట్టి నేను ఆయనకు కృతజ్ఞతలు చెల్లిస్తాను; మహోన్నతుడైన యెహోవా నామానికి నేను స్తుతులు పాడతాను.

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం — CC BY-SA 4.0. Where these translations come from.

Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc. Available free at biblica.com and open.bible. Text unchanged, used under CC BY-SA 4.0.