A peaceful man waits on a solid rock as attackers gather near a failing wall and empty scales

కీర్తనలు 62

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం
అధ్యాయ సారాంశం
కీర్తన 62 ఒత్తిడికి నిశ్శబ్ద నమ్మకంతో జవాబిస్తుంది. శత్రువులు వాలిపోతున్న గోడలా దాడి చేసి, సమాజం హోదా, దోపిడీ, సంపదపై నమ్మకం ఉంచినా, కీర్తనకారుడు శక్తి, స్థిరమైన ప్రేమ కలిసే నమ్మదగిన బండ అయిన దేవుడు ఒక్కరికే వేచి ఉంటాడు.
నమ్మకంవేచి ఉండటంఆశ్రయంస్థిరమైన ప్రేమ
1నేను దేవునిలోనే విశ్రాంతి పొందుతాను; ఆయన నుండి నాకు రక్షణ కలుగుతుంది.
2ఆయనే నా కొండ నా రక్షణ; ఆయన నా బలమైన దుర్గం, నేను ఎప్పటికీ కదల్చబడను.
3ఎంతకాలం మీరు ఒక్కడి మీద దాడి చేస్తారు? వాలుతున్న గోడను, పడిపోతున్న కంచెను పడద్రోసినట్లు మీరంతా నన్ను పడద్రోస్తారు?
4ఖచ్చితంగా వారు నన్ను నా ఉన్నత స్థానం నుండి పడగొట్టాలని నిర్ణయించారు; వారు అబద్ధాలు చెప్పడంలో ఆనందిస్తారు. వారు నోటితో దీవిస్తారు, కాని వారి హృదయాల్లో శపిస్తారు. సెలా
5అవును, నా ఆత్మ దేవునిలోనే విశ్రాంతి పొందుతుంది; ఆయన వలననే నాకు నిరీక్షణ కలుగుతుంది.
6ఆయన నా కొండ నా రక్షణ; ఆయన నా కోట, నేను కదల్చబడను.
7నా రక్షణ నా ఘనత దేవుని పైనే ఆధారపడి ఉన్నాయి; ఆయన నాకు శక్తివంతమైన కొండ, నా ఆశ్రయము.
8ప్రజలారా, ఎల్లప్పుడూ ఆయనను నమ్మండి; మీ హృదయాలను ఆయన ఎదుట క్రుమ్మరించండి, ఎందుకంటే దేవుడు మనకు ఆశ్రయము. సెలా
9సామాన్య మనుష్యులు ఊపిరిలాంటివారు, ఉన్నత గోత్రం కేవలం మాయ త్రాసులో పెట్టి తూస్తే వారిద్దరు కలిసి ఊపిరి కంటే తేలికగా ఉంటారు.
10బలాత్కారాన్ని నమ్ముకోకండి దోపిడీలు చేసి ధనవంతులై విర్రవీగకండి. ధనం ఎక్కువైనా సరే, దాని మీద మనస్సు పెట్టకండి.
11దేవుడు ఒక్క సంగతి మాట్లాడారు, రెండు సార్లు విన్నాను: “దేవా, శక్తి మీకే చెందుతుంది,
12ప్రభువా, మీరు మారని ప్రేమగలవారు; మీరు మనుష్యులందరికి వారి క్రియలను తగ్గట్టుగా ప్రతిఫలమిస్తారు.”

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం — CC BY-SA 4.0. Where these translations come from.

Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc. Available free at biblica.com and open.bible. Text unchanged, used under CC BY-SA 4.0.