An exile and thirsty deer stand by turbulent water looking toward distant Jerusalem worship

కీర్తనలు 42

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం
అధ్యాయ సారాంశం
కీర్తన 42 ఆధ్యాత్మిక ఆరాటాన్ని పొడి భూమిలో జింక దాహంతో పోలుస్తుంది. కన్నీళ్లు, ఎగతాళి, గుర్తుచేసుకున్న పండుగలు, గర్జించే జలపాతాలు, అంతర్గత క్షోభ పదే పదే ఆత్మ నిరీక్షణ, మళ్లీ స్తుతి పిలుపుతో జవాబు పొందుతాయి.
ఆరాటంప్రవాసంవిలాపంనిరీక్షణ
1నీటి వాగుల కోసం దుప్పి ఆశపడునట్లు, నా దేవా, మీ కోసం నా ప్రాణం ఆశపడుతుంది.
2నా ప్రాణం దేవుని కోసం సజీవుడైన దేవుని కోసం దప్పికతో ఉన్నది. నేనెప్పుడు ఆయన సన్నిధికి వెళ్లి ఆయనను కలుస్తాను?
3“మీ దేవుడు ఎక్కడున్నాడు?” అని నా శత్రువులు నాతో అంటూ ఉంటే రాత్రింబగళ్ళు, నా కన్నీరే నాకు ఆహారం అవుతున్నాయి.
4ఒకప్పుడు జనసమూహంతో కలిసి పెద్ద ఊరేగింపుగా, ఆనందోత్సాహాలతో స్తుతులు చెల్లిస్తూ దేవుని మందిరానికి ఎలా వెళ్లేవాడినో జ్ఞాపకం చేసుకుని నా ప్రాణం నాలో క్రుంగిపోతుంది.
5నా ప్రాణమా, ఎందుకిలా క్రుంగిపోతున్నావు? నాలో నీవెందుకిలా కంగారు పడుతున్నావు? దేవుని మీద నిరీక్షణ ఉంచు, ఆయనే నా రక్షకుడు నా దేవుడు, నేను ఆయనను స్తుతిస్తూనే ఉంటాను.
6నా దేవా, ఈ బరువు మోయలేక నా మనస్సు క్రుంగిపోయింది; యొర్దాను ప్రాంతం నుండి హెర్మోను పర్వత శిఖరాల నుండి మిసారు గుట్టలపై నుండి నేను మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాను.
7మీ ప్రవాహాల గర్జనతో అగాధం అగాధాన్ని పిలుస్తుంది; మీ తరంగాలు అలలు నా మీదుగా పొర్లి పారుతున్నాయి.
8పగటివేళ యెహోవా తన మారని ప్రేమ కుమ్మరిస్తారు, రాత్రివేళ ఆయన పాట నాకు తోడై ఉండి నా జీవదాతయైన దేవునికి ఒక ప్రార్థనగా ధ్వనిస్తుంది.
9నా కొండ అయిన దేవునితో, “మీరు నన్నెందుకు మరచిపోయారు? శత్రువులు నన్ను అణగద్రొక్కుతుంటే శోకంతో నేనెందుకిలా వెళ్లాలి?” అని మొరపెట్టాను.
10రోజుంతా అదే పనిగా నా విరోధులు, “మీ దేవుడెక్కడ?” అని అంటూ నన్ను గేలి చేస్తూ ఉంటే నా ఎముకలు మరణ బాధ అనుభవిస్తున్నాయి.
11నా ప్రాణమా, ఎందుకిలా క్రుంగిపోతున్నావు? నాలో నీవెందుకిలా కంగారు పడుతున్నావు? దేవుని మీద నిరీక్షణ ఉంచు, ఆయనే నా రక్షకుడు నా దేవుడు నేను ఆయనను స్తుతిస్తూనే ఉంటాను.

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం — CC BY-SA 4.0. Where these translations come from.

Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc. Available free at biblica.com and open.bible. Text unchanged, used under CC BY-SA 4.0.