
కీర్తనలు 41
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం
అధ్యాయ సారాంశం
కీర్తన 41 బలహీనుల పట్ల శ్రద్ధ చూపేవారిని ఆశీర్వదించి, తరువాత అనారోగ్యం, దోషభావం, శత్రు ఊహాగానాలు, సన్నిహిత ద్రోహం నుండి మాట్లాడుతుంది. బాధితుడు నిజాయితీ నిలబెట్టబడుతుందని నమ్ముతూ దయ, పునరుద్ధరణ కోసం అడుగుతాడు.
కరుణఅనారోగ్యంద్రోహంపునరుద్ధరణ
1పేదవారిపై శ్రద్ధచూపువారు ధన్యులు; అలాంటి వారిని యెహోవా కష్ట దినాన విడిపిస్తారు.
2యెహోవా వారిని కాపాడి సజీవంగా ఉంచుతారు, వారు దేశంలో ఆశీర్వదింపబడిన వారుగా పిలువబడతారు. ఆయన వారిని తమ శత్రువుల కోరికకు అప్పగించరు.
3యెహోవా వారి రోగ పడక మీద వారికి స్వస్థత కలిగిస్తారు; వారి అనారోగ్యం నుండి మీరు వారికి స్వస్థత కలుగ చేస్తారు.
4“యెహోవా, నన్ను కరుణించండి; నన్ను స్వస్థపరచండి, మీకు వ్యతిరేకంగా నేను పాపం చేశాను.”
5నా శత్రువులు, “వీడెప్పుడు చస్తాడు, వీని పేరు ఎప్పుడు చెరిగిపోతుంది?” అని నా గురించి చెప్పుకుంటున్నారు.
6నన్ను చూడటానికి వచ్చి అబద్ధాలాడతారు, వారు తమ హృదయంలో దుష్టత్వం నింపుకొని వస్తారు; వారు బయటకు వెళ్లినప్పుడు దానిని చెప్తారు.
7నా శత్రువులంతా ఏకమై నాకు వ్యతిరేకంగా గుసగుసలాడుతున్నారు; నాకు కీడును తలపెడుతున్నారు.
8“దుష్టమైన వ్యాధి అతనికి కలిగింది; కాబట్టి వాడు పడక నుండి మళ్ళీ లేవడు” అంటున్నారు.
9నేను నమ్మిన నా దగ్గరి స్నేహితుడు, నా ఆహారం తిన్నవాడే, నాకు వ్యతిరేకంగా మడిమ ఎత్తాడు.
10యెహోవా, నన్ను కరుణించి; వారి మీద ప్రతీకారం తీర్చుకొనేలా నన్ను పైకి లేవనెత్తండి.
11నా శత్రువు నాపై విజయం సాధించలేదు కాబట్టి, నేనంటే మీకు ఇష్టమని నేను తెలుసుకున్నాను.
12నా నిజాయితీని బట్టి మీరు నన్ను నిలబెట్టారు, మీరు నన్ను నిత్యం మీ సన్నిధిలో స్థిరపరిచారు.
13ఇశ్రాయేలు దేవుడైన యెహోవాయే నిత్యత్వం నుండి నిత్యత్వం వరకు స్తుతింపబడును గాక! ఆమేన్. ఆమేన్.
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం — CC BY-SA 4.0. Where these translations come from.
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc. Available free at biblica.com and open.bible. Text unchanged, used under CC BY-SA 4.0.