Neighbors lift a man from a muddy pit as a joyful community gathers with instruments

కీర్తనలు 40

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం
అధ్యాయ సారాంశం
కీర్తన 40 సహనంతో వేచి ఉండటం, నాటకీయ రక్షణ, కొత్త గీతం, ఇష్టపూర్వక విధేయతను కలుపుతుంది. విడుదల పొందిన వ్యక్తి గొప్ప సమాజానికి చెబుతాడు, వట్టి ఆచారం కంటే హృదయపూర్వక సేవను విలువైనదిగా భావిస్తాడు, మళ్లీ సకాలంలో సహాయం కోసం అడుగుతాడు.
రక్షణవిధేయతసాక్ష్యంవేచి ఉండటం
1యెహోవా కోసం ఓర్పుతో ఎదురుచూశాను; ఆయన నా వైపు తిరిగి నా మొరను ఆలకించారు.
2నాశనకరమైన గుంటలో నుండి నన్ను పైకి లేపారు, బురద ఊబిలో నుండి లేపి నా పాదాలను బండ మీద నిలిపారు. నిలబడడానికి నాకు స్థిరమైన స్థలాన్ని ఇచ్చారు.
3మన దేవునికి ఒక స్తుతి పాటను, ఆయన నా నోట ఒక క్రొత్త పాట ఉంచారు. అనేకులు ఆయన చేసింది చూసి ఆయనకు భయపడతారు. వారు యెహోవాలో నమ్మకం ఉంచుతారు.
4గర్విష్ఠుల వైపు చూడక అబద్ధ దేవుళ్ళ వైపు తిరుగక, యెహోవాలో నమ్మకముంచినవారు ధన్యులు.
5యెహోవా నా దేవా, మీరు మాకోసం ఎన్నో అద్భుతాలు చేశారు, ఎన్నో ప్రణాళికలు వేశారు. మీతో పోల్చదగిన వారు లేరు; మీ క్రియల గురించి నేను చెప్పాలనుకుంటే అవి లెక్కకు మించినవి.
6బలిని అర్పణను మీరు కోరలేదు, కాని మీరు నా చెవులు తెరిచారు, హోమాలు పాపపరిహార బలులు మీరు కోరలేదు.
7అప్పుడు నేను ఇలా అన్నాను, “ఇదిగో నేను ఉన్నాను. గ్రంథపుచుట్టలో నా గురించి వ్రాసి ఉంది.
8నా దేవా, మీ చిత్తం నెరవేర్చడమే నాకు సంతోషం; మీ ధర్మశాస్త్రం నా హృదయంలో ఉంది.”
9యెహోవా! మీకు తెలిసినట్టుగా, నేను నా పెదవులు మూసుకోకుండ మహా సమాజంలో మీ నీతిని గురించిన సువార్త ప్రకటించాను.
10మీ నీతిని నా హృదయంలో నేనేమి దాచుకోను; మీ విశ్వసనీయతను మీ రక్షణ సహాయాన్ని గురించి నేను మాట్లాడతాను. మీ మారని ప్రేమను, మీ నమ్మకత్వాన్ని గురించి మహా సమాజానికి చెప్పకుండ దాచిపెట్టను.
11యెహోవా, మీ కరుణను నాకు దూరం చేయకండి; మీ మారని ప్రేమ మీ విశ్వాస్యత నిత్యం నన్ను కాపాడును గాక.
12లెక్కలేనన్ని ఆపదలు నన్ను చుట్టి ఉన్నాయి; నా పాపాలు నన్ను పట్టుకున్నాయి, నేనేమి చూడలేని స్థితిలో ఉన్నాను. అవి నా తలవెంట్రుకల కంటే ఎక్కువ ఉన్నాయి, నా గుండె చెదిరిపోతుంది.
13యెహోవా, సంతోషంగా నన్ను రక్షించడానికి, యెహోవా నాకు సాయం చేయడానికి త్వరగా రండి.
14నా ప్రాణం తీయాలని కోరేవారందరు సిగ్గుకు, గందరగోళానికి గురవ్వాలి; నా పతనాన్ని కోరేవారందరు అవమానంతో వెనుకకు తిరిగి వెళ్లాలి.
15నన్ను చూసి, “ఆహా! ఆహా!” అనేవారు వారికి కలిగే అవమానానికి ఆశ్చర్యానికి గురి కావాలి.
16అయితే మిమ్మల్ని వెదికేవారంతా మీలో ఆనందించి సంతోషించాలి; మీ రక్షణను ప్రేమించేవారు ఎల్లప్పుడు, “యెహోవా గొప్పవాడు!” అని అనాలి.
17కాని నా మట్టుకైతే, నేను దీనుడను, అవసరతలో ఉన్నవాడను; ప్రభువు నా గురించి ఆలోచించుదురు గాక. మీరే నా సహాయం, నా విమోచకుడు; మీరే నా దేవుడు, ఆలస్యం చేయకండి.

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం — CC BY-SA 4.0. Where these translations come from.

Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc. Available free at biblica.com and open.bible. Text unchanged, used under CC BY-SA 4.0.