
కీర్తనలు 37
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం
అధ్యాయ సారాంశం
కీర్తన 37 తాత్కాలిక దుష్క్రియ చూసి అసూయతో మండిపోవద్దని విశ్వసనీయులకు సలహా ఇస్తుంది. నమ్మకం, నిశ్శబ్ద సహనం, దాతృత్వం, స్థిరమైన న్యాయం నిలకడైన వారసత్వాన్ని రూపొందిస్తాయి, హింసాత్మక పథకాలు, ఆందోళనతో పట్టుకోవడం చివరికి మసకబారతాయి.
సహనంనమ్మకంన్యాయంవారసత్వం
1దుష్టులను బట్టి బాధపడకు తప్పు చేసేవారిని చూసి అసూయపడకు;
2గడ్డిలా వారు త్వరలోనే వాడిపోతారు, పచ్చ మొక్కల్లా వారు త్వరలోనే ఎండిపోతారు.
3యెహోవా మీద నమ్మకం ఉంచి మంచి చేయి; దేశంలో నివసించి సురక్షితమైన క్షేమకరమైన పచ్చికను ఆస్వాదించు.
4యెహోవాయందు ఆనందించు, ఆయన నీ హృదయ కోరికలు తీరుస్తారు.
5నీ మార్గాన్ని యెహోవాకు అప్పగించండి; ఆయనపై నమ్మకం ఉంచితే ఆయన నీకు సహాయం చేస్తారు.
6ఆయన నీ నీతిని తెల్లవారు వెలుగులా ప్రకాశింపజేస్తారు, నీ నిర్దోషత్వాన్ని మధ్యాహ్న సూర్యునిలా ప్రకాశింపజేస్తారు.
7యెహోవా ముందు మౌనంగా ఉండు ఆయన కోసం ఓర్పుతో వేచి ఉండు. ప్రజలు వారి మార్గాల్లో విజయవంతమైనప్పుడు వారు తమ దుష్ట పన్నాగాలు అమలు చేసినప్పుడు చింతించకు.
8కోపం మాని ఆగ్రహాన్ని విడిచిపెట్టు; చింతించకు అది కీడుకే దారి తీస్తుంది.
9చెడ్డవారు నాశనం చేయబడతారు, కాని యెహోవా కోసం నిరీక్షించే వారు దేశాన్ని స్వాధీనం చేసుకుంటారు.
10దుష్టులు కొంతకాలం తర్వాత కనుమరుగవుతారు; వారి కోసం వెదకినా వారు కనబడరు.
11కాని సాత్వికులు భూమిని స్వాధీనం చేసుకుంటారు సమాధానం అభివృద్ధి కలిగి జీవిస్తారు.
12దుష్టులు నీతిమంతుల మీద కుట్రలు పన్నుతారు, వారిని చూసి పళ్ళు కొరుకుతారు.
13వారి సమయం దగ్గరపడింది, కాబట్టి ప్రభువు దుష్టులను చూసి నవ్వుతారు.
14దుష్టులు కత్తి దూసి, విల్లు ఎక్కుపెట్టి, అవసరతలో ఉన్న దీనులను నిరుపేదలను పతనం చేయాలని యథార్థవంతులను హతమార్చాలని చూస్తారు.
15వారి ఖడ్గాలు వారి గుండెల్లోకే దూసుకుపోతాయి, వారి విండ్లు విరిగిపోతాయి.
16అనేకమంది దుష్టుల ధనం కంటే నీతిమంతుల దగ్గర ఉన్న కొంచెం మేలు.
17దుష్టుల చేతులు విరిగిపోతాయి, నీతిమంతులను యెహోవా సంరక్షిస్తారు.
18నిందారహితులు తమ రోజులు యెహోవా సంరక్షణలో గడుపుతారు, వారి వారసత్వం శాశ్వతంగా ఉంటుంది.
19విపత్తు సమయాల్లో వారు వాడిపోరు; కరువు దినాల్లో వారు సమృద్ధిని అనుభవిస్తారు.
20కాని దుష్టులు నశిస్తారు: యెహోవా శత్రువులు పొలంలో ఉండే పూవుల్లా ఉన్నా, వారు కాల్చబడతారు పొగలా పైకి వెళ్తారు.
21దుష్టులు అప్పు తెచ్చుకుంటారు కాని తీర్చరు, కాని నీతిమంతులు దయ కలిగి ఇస్తారు.
22యెహోవా ఆశీర్వదించినవారు భూమిని స్వాధీనపరచుకుంటారు, కాని ఆయన శపించినవారు నాశనమౌతారు.
23తనను బట్టి ఆనందించేవారి అడుగులను యెహోవా స్థిరపరుస్తారు;
24యెహోవా వారి చేతిని పట్టుకుంటారు, కాబట్టి వారు తొట్రిల్లినా పడిపోరు.
25ఒకప్పుడు నేను యవ్వనస్థుడను ఇప్పుడు ముసలివాడినయ్యాను, అయినాసరే నీతిమంతులు విడిచిపెట్టబడడం వారి పిల్లలు ఆహారం అడుక్కోవడం నేనెప్పుడు చూడలేదు.
26వారు ఎల్లప్పుడు దయ గలవారై ఉచితంగా అప్పు ఇస్తారు; వారి పిల్లలు దీవెనకరంగా ఉంటారు.
27కీడు చేయడం మాని మేలు చేయి; అప్పుడు నీవు శాశ్వతంగా దేశంలో నివసిస్తావు.
28యెహోవా నీతిమంతులను ప్రేమిస్తారు తన నమ్మకస్థులను ఆయన విడిచిపెట్టరు. ఆయన వారిని శాశ్వతంగా భద్రపరుస్తారు; కాని దుష్టుల సంతానం నశిస్తుంది.
29నీతిమంతులు భూమిని వారసత్వంగా పొందుకొని అందులో చిరకాలం నివసిస్తారు.
30నీతిమంతుల నోరు జ్ఞానాన్ని పలుకుతుంది, వారి నాలుక న్యాయమైనది మాట్లాడుతుంది.
31వారి దేవుని ధర్మశాస్త్రం వారి హృదయాల్లో ఉంది; వారి పాదాలు జారవు.
32దుష్టులు నీతిమంతులను చంపాలని దారిలో పొంచి ఉంటారు.
33కాని యెహోవా వారిని దుష్టుల చేతికి అప్పగించరు, వారు విచారణకు వచ్చినప్పుడు వారిని శిక్షింపబడనీయరు.
34యెహోవాయందు నిరీక్షణ ఉంచి ఆయన మార్గాన్ని అనుసరించు. భూమిని వారసత్వంగా పొందేలా ఆయన నిన్ను హెచ్చిస్తారు; దుష్టులు నాశనమైనప్పుడు నీవు చూస్తావు.
35నేను దుష్టులను, క్రూరులైన మనుష్యులను చూశాను; వారు స్వస్థలంలో ఏపుగా పెరుగుతున్న చెట్టులా ఉన్నారు.
36కాని అంతలోనే వారు గతించిపోయారు; నేను వారి కోసం వెదికినా వారు కనబడలేదు.
37నిర్దోషులను గమనించు, యథార్థ హృదయులను గమనించు; సమాధానం వెదకే వారి కోసం భవిష్యత్తు వేచి ఉంది.
38కాని పాపులందరు నశిస్తారు, దుష్టులకు భవిష్యత్తు ఉండదు.
39నీతిమంతుల రక్షణ యెహోవా నుండి వస్తుంది; కష్ట సమయంలో ఆయన వారికి బలమైన కోట.
40యెహోవా వారికి సాయం చేసి వారిని విడిపిస్తారు; వారు ఆయనను ఆశ్రయిస్తారు కాబట్టి, దుష్టుల చేతి నుండి ఆయన వారిని విడిపించి రక్షిస్తారు.
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం — CC BY-SA 4.0. Where these translations come from.
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc. Available free at biblica.com and open.bible. Text unchanged, used under CC BY-SA 4.0.