A sick remorseful man bows apart from distant friends as an elder approaches to help

కీర్తనలు 38

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం
అధ్యాయ సారాంశం
కీర్తన 38 దాచకుండా తీవ్రమైన శారీరక బాధ, దోషభావం, ఒంటరితనం, శత్రు ఆరోపణను వ్యక్తం చేస్తుంది. తనను తాను రక్షించుకోలేక, కీర్తనకారుడు తప్పును ఒప్పుకుని, తన కోరికను బహిరంగంగా దేవుడి ముందు ఉంచి, సహాయం కోసం అత్యవసరంగా వేచి ఉంటాడు.
విలాపంబాధఒప్పుకోలువేచి ఉండటం
1యెహోవా, మీ కోపంలో నన్ను గద్దించకండి ఉగ్రతలో నన్ను శిక్షించకండి.
2మీ బాణాలు నాకు గుచ్చుకున్నాయి, మీ చేయి నా మీద బరువుగా పడింది.
3మీ ఉగ్రత వల్ల నా శరీరంలో ఆరోగ్యం లేదు; నా పాపాన్ని బట్టి నా ఎముకల్లో నెమ్మది లేదు.
4నా దోషం భరించలేని భారంలా నన్ను ముంచెత్తింది.
5నా బుద్ధిహీనతతో చేసిన పాపాల వల్ల నా గాయాలు కుళ్ళి దుర్వాసన వస్తున్నాయి.
6నేను చాలా క్రుంగిపోయాను; దినమంతా దుఃఖంలోనే ఉన్నాను.
7నా వీపు తీవ్రమైన బాధతో ఉంది నా శరీరం అనారోగ్యంతో క్షీణించింది,
8నేను బలహీనంగా ఉన్నాను పూర్తిగా నలిగిపోయాను; నేను హృదయ వేదనతో మూలుగుతున్నాను.
9ప్రభువా, నా కోరికలన్నీ మీ ముందు ఉన్నాయి; నా నిట్టూర్పు మీ నుండి ఉంది.
10నా గుండె వేగంగా కొట్టుకుంటుంది. నా బలం క్షీణిస్తూ ఉంది; నా కంటి చూపు తగ్గిపోతుంది.
11నా గాయాల వల్ల నా స్నేహితులు నా సహచరులు నన్ను దూరం పెడుతున్నారు; నా పొరుగువారు నన్ను దూరంగా ఉంచుతున్నారు.
12నన్ను చంపాలనుకున్నవారు ఉచ్చులు బిగుస్తున్నారు, నాకు హాని కలిగించేవారు నా పతనం గురించి మాట్లాడుతున్నారు; రోజంతా వారు కుట్రలు చేస్తున్నారు.
13చెవిటివానిలా నేను వినక ఉన్నాను, మూగవానిలా మాట్లాడక ఉన్నాను;
14నేను వినలేనివానిగా అయ్యాను, జవాబు చెప్పలేనివానిగా ఉన్నాను.
15యెహోవా, నేను మీ కోసం ఎదురుచూస్తున్నాను; ప్రభువా నా దేవా, మీరు జవాబిస్తారు.
16నేను, “నా కాలు జారితే వారు సంతోషించవద్దు వారు నాపై రెచ్చిపోవద్దు” అని ప్రార్థించాను.
17నేను పడిపోయేలా ఉన్నాను, నా బాధ నిత్యం నాతోనే ఉంది.
18నా దోషాన్ని ఒప్పుకుంటున్నాను; నా పాపాన్ని గురించి బాధపడుతున్నాను.
19కారణం లేకుండ అనేకులు నాకు శత్రువులయ్యారు; కారణం లేకుండ అనేకులు నన్ను ద్వేషిస్తున్నారు;
20నేను చేసిన మేలుకు ప్రతిగా వారు నాకు కీడు చేస్తున్నారు, నేను మంచిని మాత్రమే అనుసరిస్తున్నా సరే, వారు నన్ను వ్యతిరేకిస్తున్నారు.
21యెహోవా, నన్ను విడువకండి; నా దేవా, నాకు దూరంగా ఉండకండి.
22నా ప్రభువా నా రక్షకా, త్వరగా వచ్చి నాకు సాయం చేయండి.

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం — CC BY-SA 4.0. Where these translations come from.

Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc. Available free at biblica.com and open.bible. Text unchanged, used under CC BY-SA 4.0.