
కీర్తనలు 33
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం
అధ్యాయ సారాంశం
కీర్తన 33 నీతిమంతులను తాజా, నైపుణ్యం గల స్తుతికి పిలుస్తుంది. దేవుని నమ్మదగిన మాట సృష్టిని క్రమబద్ధం చేస్తుంది, జాతీయ పథకాలను వమ్ము చేస్తుంది, న్యాయాన్ని ప్రేమిస్తుంది, సైన్యాలు, గుర్రాలు, మానవ బలానికి అతీతంగా నిరీక్షణ ఉన్నవారిని కాపాడుతుంది.
స్తుతిసృష్టిన్యాయంనిరీక్షణ
1నీతిమంతులారా, యెహోవాకు ఆనందంతో పాడండి; ఆయనను స్తుతించడం యథార్థవంతులకు తగినది.
2సితారాతో యెహోవాను స్తుతించండి; పది తంతుల వీణతో ఆయనను కీర్తించండి.
3ఆయనకు క్రొత్త పాట పాడండి; నైపుణ్యతతో వాయించండి, ఆనందంతో కేకలు వేయండి.
4యెహోవా వాక్కు న్యాయమైనది; ఆయన చేసే ప్రతిదీ నమ్మకమైనది.
5యెహోవా నీతిన్యాయాలను ప్రేమిస్తారు; భూమంతా ఆయన మారని ప్రేమతో నిండిపోయింది.
6యెహోవా మాటతో ఆకాశాలు చేయబడ్డాయి, ఆయన నోటి శ్వాసతో నక్షత్ర కూటమి కలిగింది.
7ఆయన సముద్ర జలాలను రాశిగా సమకూర్చుతారు; అగాధాలను ఆయన గోదాములలో ఉంచుతారు.
8భూమంతా యెహోవాకు భయపడును గాక; లోక ప్రజలందరు ఆయనను గౌరవించుదురు గాక.
9ఆయన మాట్లాడారు అది జరిగింది; ఆయన ఆజ్ఞాపించారు అది దృఢంగా నిలబడింది.
10యెహోవా దేశాల ప్రణాళికలను విఫలం చేస్తారు; ప్రజల ఉద్దేశాలను ఆయన అడ్డుకుంటారు.
11కానీ యెహోవా ప్రణాళికలు శాశ్వతంగా నిలుస్తాయి, ఆయన హృదయ ఉద్దేశాలు అన్ని తరాల వరకు ఉంటాయి.
12యెహోవాను దేవునిగా కలిగిన దేశం ధన్యమైనది. తన వారసత్వంగా ఆయన తన కోసం ఎంచుకున్న ప్రజలు ధన్యులు.
13ఆకాశం నుండి యెహోవా క్రిందకు చూస్తున్నారు ఆయన మనుష్యులందరిని కనిపెడుతున్నారు.
14ఆయన తన నివాసస్థలం నుండి భూమిపై నివసించే వారందరినీ పరిశీలిస్తున్నారు.
15అందరి హృదయాలను రూపించింది ఆయనే, వారు చేసే ప్రతిదీ ఆయన గమనిస్తారు.
16ఏ రాజు తన సైనిక బలంతో రక్షించబడడు; ఏ యోధుడు తన గొప్ప శక్తితో తప్పించుకోడు.
17విడుదల పొందడానికి గుర్రం ఉపయోగపడదు; దానికి గొప్ప బలం ఉన్నా అది ఎవరిని రక్షించలేదు.
18కానీ యెహోవా కళ్లు ఆయనకు భయపడే వారిపైన, తన మారని ప్రేమలో ఆశ పెట్టుకున్న వారిపైన ఉన్నాయి.
19ఆయన మరణం నుండి వారి ప్రాణాన్ని తప్పిస్తారు, కరువు సమయంలో వారిని సజీవులుగా ఉంచుతారు.
20మనం నిరీక్షణ కలిగి యెహోవా కోసం వేచి ఉందాం; మనకు సహాయం మనకు డాలు ఆయనే.
21మన హృదయాలు ఆయనలో ఆనందిస్తాయి, ఎందుకంటే మనం ఆయన పరిశుద్ధ నామాన్ని నమ్ముకున్నాము.
22యెహోవా, మేము మా నిరీక్షణ మీలో ఉంచాం కాబట్టి, యెహోవా, మీ మారని ప్రేమ మాతో ఉండును గాక.
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం — CC BY-SA 4.0. Where these translations come from.
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc. Available free at biblica.com and open.bible. Text unchanged, used under CC BY-SA 4.0.