
కీర్తనలు 32
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం
అధ్యాయ సారాంశం
కీర్తన 32 క్షమించబడిన తప్పిదం యొక్క స్వేచ్ఛను కొనియాడుతుంది. దాచిపెట్టడం జీవశక్తిని హరిస్తుంది, కానీ నిజాయితీ ఒప్పుకోలు సంతోషాన్ని పునరుద్ధరిస్తుంది; క్షమించబడిన వ్యక్తి తరువాత జ్ఞానవంతమైన బోధను పొంది సంతోషకరమైన స్తుతిలో నీతిమంతుల సమాజంతో చేరతాడు.
క్షమాపణఒప్పుకోలుబోధనసంతోషం
1తమ పాపాలు క్షమించబడినవారు తమ పాపాలు పరిహరించబడినవారు ధన్యులు.
2యెహోవాచేత పాపం లేనివారిగా పరిగణించబడినవారు ఆత్మలో మోసం లేనివారు ధన్యులు.
3నేను మౌనంగా ఉండి, రోజంతా మూలుగుతూ ఉన్నందుకు నా ఎముకలు కృశించాయి.
4రాత్రింబగళ్ళు మీ చేయి నాపై భారంగా ఉంది; వేసవిలో నీరు ఎండిపోయినట్లు నాలో సారం యింకి పోయింది. సెలా
5అప్పుడు నేను నా పాపాన్ని మీ దగ్గర ఒప్పుకున్నాను నా దోషాన్ని నేను దాచుకోలేదు. “యెహోవా ఎదుట నా అతిక్రమాలను ఒప్పుకుంటాను” అని ఒప్పుకున్నాను. అప్పుడు నా అతిక్రమాన్ని మీరు క్షమించారు. సెలా
6మీరు దొరికే సమయంలోనే నమ్మకమైన వారంతా మీకు ప్రార్థించుదురు గాక; జలప్రవాహాలు ఉప్పొంగినా వారిని చేరవు.
7నా దాగుచోటు మీరే; కష్టాల నుండి మీరే నన్ను కాపాడతారు విమోచన గీతాలతో నా చుట్టూ ఆవరించారు. సెలా
8మీరు నడవాల్సిన మార్గాన్ని నేను మీకు ఉపదేశించి నేర్పుతాను; మీమీద దృష్టిపెట్టి నేను మీకు సలహా ఇస్తాను.
9వివేచనలేని గుర్రంలా కంచరగాడిదలా ప్రవర్తించకండి కళ్లెంతో పగ్గంతో వాటిని అదుపు చేయాలి లేకపోతే మీరు వాటిని వశపరచుకోలేరు.
10దుష్టులకు చాలా బాధలు కలుగుతాయి, కాని యెహోవాను నమ్ముకున్న వారి చుట్టూ ఆయన మారని ప్రేమ ఆవరించి ఉంటుంది.
11నీతిమంతులారా యెహోవాలో ఆనందించి సంతోషించండి. యథార్థ హృదయులారా, మీరు పాడండి.
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం — CC BY-SA 4.0. Where these translations come from.
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc. Available free at biblica.com and open.bible. Text unchanged, used under CC BY-SA 4.0.