A fugitive gathers poor and fearful people around bread as danger recedes at sunrise

కీర్తనలు 34

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం
అధ్యాయ సారాంశం
కీర్తన 34 వ్యక్తిగత విడుదలను సామూహిక ఆహ్వానంగా మారుస్తుంది. వినయస్థులు స్తుతిలో చేరతారు, వెతికేవారు జవాబు కనుగొంటారు, భయపడేవారు దేవుని మంచితనాన్ని రుచి చూస్తారు, హృదయవిచ్ఛిన్నులు శ్రద్ధగల రక్షణ, నిలబెట్టే ఆశ్రయాన్ని కనుగొంటారు.
స్తుతిఆశ్రయంవిడుదలహృదయవిచ్ఛిన్నులు
1నేను అన్ని వేళలా యెహోవాను కీర్తిస్తాను; ఆయన స్తుతి నిత్యం నా పెదవులపై ఉంటుంది.
2నేను యెహోవాలో అతిశయిస్తాను. బాధించబడినవారు ఇది విని సంతోషించుదురు గాక!
3నాతో కలిసి యెహోవాను మహిమపరచండి; మనం కలసి ఆయన నామాన్ని గొప్ప చేద్దాం.
4నేను యెహోవాను వెదికాను, ఆయన నాకు జవాబిచ్చారు; నా భయాలన్నిటి నుండి ఆయన నన్ను విడిపించారు.
5ఆయన వైపు చూసేవారికి వెలుగు కలుగుతుంది; వారి ముఖాలు ఎప్పుడూ సిగ్గుపడవు.
6ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించారు కష్టాలన్నిటిలో నుండి ఆయన నన్ను రక్షించారు.
7యెహోవా దూత ఆయనకు భయపడేవారి చుట్టూ ఉండి, వారిని విడిపిస్తాడు.
8యెహోవా మంచివాడని రుచి చూసి తెలుసుకోండి; ఆయనను ఆశ్రయించినవారు ధన్యులు.
9యెహోవా పరిశుద్ధ జనమా, ఆయనకు భయపడండి, ఆయనకు భయపడేవారికి ఏ కొదువ ఉండదు.
10సింహాలు ఆకలితో బలహీనం కావచ్చు, కాని యెహోవాను వెదికేవారికి ఏ మేలు కొరతగా ఉండదు.
11నా పిల్లలారా, రండి, నా మాట వినండి; నేను మీకు యెహోవా పట్ల భయాన్ని బోధిస్తాను.
12మీలో ఎవరైతే జీవితాన్ని ప్రేమిస్తారో ఎవరు ఎక్కువ మంచి రోజులను చూడాలనుకుంటారో
13మీరు చెడు పలుకకుండ మీ నాలుకను, అబద్ధాలు చెప్పకుండ తమ పెదవులను అదుపులో పెట్టుకోవాలి.
14కీడు చేయడం మాని మేలు చేయాలి; సమాధానాన్ని వెదికి దానిని వెంటాడాలి.
15యెహోవా కళ్లు నీతిమంతుల మీద ఉన్నాయి, ఆయన చెవులు వారి మొరను వింటాయి;
16అయితే కీడుచేసేవారి జ్ఞాపకాన్ని భూమి మీద లేకుండా చేయడానికి యెహోవా ముఖం వారికి విరోధంగా ఉన్నది.
17నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకిస్తారు; వారి ఇబ్బందులన్నిటి నుండి ఆయన వారిని విడిపిస్తారు.
18విరిగిన హృదయం గలవారికి యెహోవా సమీపంగా ఉంటారు. ఆత్మలో నలిగినవారిని ఆయన రక్షిస్తారు.
19నీతిమంతులకు అనేక శ్రమలు కలుగవచ్చు, కాని, యెహోవా వాటన్నిటిలో నుండి వారిని విడిపిస్తారు.
20వారి ఎముకలన్నిటిని ఆయన కాపాడతారు, ఒక్క ఎముక కూడా విరగదు.
21చెడుతనం దుష్టులను నాశనం చేస్తుంది; నీతిమంతుల శత్రువులు శిక్షింపబడతారు.
22యెహోవా తన సేవకులను విడిపిస్తారు; ఆయనను ఆశ్రయించిన వారిలో ఎవరూ శిక్షింపబడరు.

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం — CC BY-SA 4.0. Where these translations come from.

Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc. Available free at biblica.com and open.bible. Text unchanged, used under CC BY-SA 4.0.