A ruler dismisses corrupt courtiers while honest workers and families gather in an open palace

కీర్తనలు 101

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం
అధ్యాయ సారాంశం
ఇంట్లో, ప్రజల్లో నిజాయితీని ఆచరించాలని నిర్ణయించుకున్న పాలకుడిని కీర్తన 101 చూపిస్తుంది. మోసం, అపవాదు, గర్వం, అవినీతికి స్వాగతం లభించదు, విశ్వసనీయ ప్రజలు నమ్మకమైన సేవా స్థానాన్ని పొందుతారు.
నిజాయితీనాయకత్వంన్యాయంవిశ్వసనీయత
1యెహోవా మీకు స్తుతిగానం చేస్తాను; మీ మారని ప్రేమను న్యాయాన్ని గురించి పాడతాను.
2నేను నింద లేకుండ జీవించేలా వివేకంతో ప్రవర్తిస్తాను, మీరు నా దగ్గరకు ఎప్పుడు వస్తారు? నేను నిందారహితమైన హృదయంతో నా ఇంటి వ్యవహారాలను నిర్వహిస్తాను.
3నీచమైన దేనినైనా సరే నేను నా కళ్లెదుట ఉంచను. విశ్వాసం లేనివారు చేసేది నాకు అసహ్యం; అందులో నేను పాలుపంచుకోను.
4కుటిల హృదయం నాకు దూరమై పోవాలి; చెడుతో నాకు ఎటువంటి సంబంధం ఉండదు.
5రహస్యంగా తమ పొరుగువారిపై అభాండాలు వేసేవారిని, నేను నాశనం చేస్తాను. అహంకారపు కళ్లు, గర్వించే హృదయం గలవారిని నేను సహించను.
6నా కళ్లు దేశంలోని నమ్మకస్థులపై ఉంటాయి, వారు నాతో నివసించాలని; నిందారహితంగా జీవించేవారు నాకు సేవ చేస్తారని.
7మోసం చేసే వారెవరూ నా భవనంలో నివసించరు; అబద్ధాలాడే వారెవరూ నా ఎదుట నిలబడరు.
8ప్రతి ఉదయం దేశంలోని దుష్టులందరిని నేను మౌనంగా ఉంచుతాను; యెహోవా పట్టణంలో నుండి కీడు చేసేవారిని పంపివేస్తాను.

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం — CC BY-SA 4.0. Where these translations come from.

Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc. Available free at biblica.com and open.bible. Text unchanged, used under CC BY-SA 4.0.