A frail exile sits among nesting birds and ruined stones while workers rebuild Jerusalem at dawn

కీర్తనలు 102

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం
అధ్యాయ సారాంశం
కీర్తన 102 శారీరక అలసట, ఒంటరితనం, తగ్గిపోయిన దినాల నుండి సీయోను పునరుద్ధరణపై నమ్మకం వైపు కదులుతుంది. మానవ తరాలు గడిచిపోతాయి, కానీ నిలకడైన కరుణ నగరాన్ని తిరిగి కడుతుంది, భావితరాల మధ్య స్తుతిని మేల్కొల్పుతుంది.
బాధసీయోనుపునరుద్ధరణసహనం
1యెహోవా, నా ప్రార్థన వినండి; సాయం కోసం నేను పెడుతున్న నా మొర మీకు చేరును గాక.
2నేను కష్టంలో ఉన్నప్పుడు మీ ముఖాన్ని నాకు మరుగు చేయకండి. మీ చెవి నా వైపు త్రిప్పండి; నేను మొరపెట్టినప్పుడు, త్వరగా జవాబివ్వండి.
3నా దినాలు పొగలా కనుమరుగు అవుతున్నాయి; నా ఎముకలు నిప్పుకణాల్లా కాలిపోతున్నాయి.
4దెబ్బకు వాడిన గడ్డిలా ఉంది నా హృదయం; నేను భోజనం చేయడం మరచిపోతున్నాను.
5నా బాధలో నేను గట్టిగా మూలుగుతూ ఉన్నందుకు నేను అస్థిపంజరంలా ఉన్నాను.
6నేను ఎడారి గుడ్లగూబలా, శిధిలాల మధ్య బిగ్గరగా అరిచే గుడ్లగూబలా ఉన్నాను.
7నేను మేల్కొని ఉన్నాను; ఇంటికప్పు మీద ఒంటరిగా ఉన్న పిచ్చుకలా ఉన్నాను.
8రోజంతా నా శత్రువులు నన్ను తిడతారు; నన్ను ఎగతాళి చేసేవారు నా పేరును శాపంగా ఉపయోగిస్తారు.
9నేను బూడిదను ఆహారంగా తింటున్నాను పానీయంలో కన్నీరు కలిపి త్రాగుతున్నాను.
10మీ ఉగ్రతను బట్టి; మీరు నన్ను ఎత్తి అవతల విసిరివేశారు.
11నా రోజులు సాయంకాలపు నీడలా ఉన్నాయి; నేను గడ్డిలా వాడిపోతున్నాను.
12కాని యెహోవా, మీరు ఎప్పటికీ ఆసీనులై ఉంటారు; మీ జ్ఞాపకం తరతరాలకు నిలిచి ఉంటుంది.
13మీరు లేచి సీయోనుపై కనికరం చూపిస్తారు, ఎందుకంటే ఆమెపై దయ చూపే సమయం వచ్చింది; నిర్ణీత సమయం వచ్చింది.
14దాని రాళ్లు మీ సేవకులకు ఇష్టమైనవి; దుమ్ము వారికి దయ కలిగించింది.
15జనులు యెహోవా నామానికి భయపడతారు, భూరాజులంతా మీ మహిమ ఎదుట వణకుతారు.
16ఎందుకంటే యెహోవా సీయోనును పునర్నిర్మించి తన మహిమతో ప్రత్యక్షమవుతారు.
17దిక్కులేని దరిద్రులు ప్రార్థిస్తే ఆయన వింటారు; ఆయన వారి మనవులను త్రోసివేయరు.
18ఇది రాబోయే తరాల కోసం వ్రాయబడును గాక, ఇంకా సృజించబడని ప్రజలు యెహోవాను స్తుతించుదురు గాక:
19“బందీల మూలుగులు వినడానికి మరణశిక్ష విధించబడిన వారిని విడుదల చేయడానికి, యెహోవా ఎత్తైన పరిశుద్ధాలయం నుండి క్రిందికి వంగిచూశారు, పరలోకంలో నుండి భూమిని చూశారు.”
21ఈ విధంగా ఎప్పుడైతే ప్రజలు రాజ్యాలు యెహోవాను ఆరాధించడానికి సమాజముగా కూడుతారో అప్పుడు సీయోనులో యెహోవా నామం ప్రకటించబడుతుంది యెరూషలేములో ఆయన స్తుతించబడతారు.
23నా జీవిత గమనంలో నా బలాన్ని కృంగదీశారు; ఆయన నా రోజుల్ని తగ్గించారు.
24అందుకు నేనన్నాను: నా దేవా, నా దినాల మధ్యలో నన్ను తీసుకెళ్లకండి; మీ సంవత్సరాలు తరతరాలకు సాగిపోతూనే ఉంటాయి.
25ఆదిలో మీరు భూమికి పునాదులు వేశారు, ఆకాశాలు మీ చేతి పని.
26అవి అంతరించిపోతాయి, కాని మీరు నిలిచి ఉంటారు; ఒక వస్త్రంలా అవన్నీ పాతగిల్లుతాయి. మీరు వాటిని దుస్తుల్లా మార్చి వేస్తారు అవి అంతరిస్తాయి.
27కాని మీరు అలాగే ఉంటారు, మీ సంవత్సరాలకు అంతం ఉండదు.
28మీ సేవకుల పిల్లలు మీ సన్నిధిలో నివాసం చేస్తారు; వారి పిల్లలు మీ సమక్షంలో స్థిరంగా ఉంటారు.

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం — CC BY-SA 4.0. Where these translations come from.

Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc. Available free at biblica.com and open.bible. Text unchanged, used under CC BY-SA 4.0.