
యోబు 41
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం
అధ్యాయ సారాంశం
దేవుడు లివ్యాతానును విస్తృతంగా వర్ణిస్తాడు. ఏ గాలం అతనిని బయటకు లాగలేదు, ఏ ఒప్పందం అతనిని మచ్చిక చేయలేదు, అతని పొలుసుల వరుసలు ముద్రలా గట్టిగా మూసుకుపోయి ఉంటాయి, అతని తుమ్ములలో వెలుగు మెరుస్తుంది, ఇనుము అతనికి గడ్డిలా ఉంటుంది. అతనిని రెచ్చగొట్టేంత క్రూరుడు ఎవరూ లేకపోతే, తన సృష్టికర్త ముందు ఎవరు నిలబడగలరని దేవుడు అడుగుతాడు.
లివ్యాతానుసృష్టి శక్తిమానవ పరిమితులుదైవిక జ్ఞానం
1“లెవియాథన్ ను చేపగాలంతో లాగగలవా? త్రాడుతో దాని నాలుకను కట్టగలవా?
2దాని జమ్ము తాడును ముక్కుకు వేయగలవా? దవడకు గాలం ఎక్కించగలవా?
3దయచూపమని అది నిన్ను వేడుకుంటుందా? మృదువైన మాటలు నీతో మాట్లాడుతుందా?
4జీవితాంతం నీవు దానిని బానిసగా ఉంచుకునేలా అది నీతో ఒప్పందం చేసుకుంటుందా?
5ఒక పక్షితో ఆడుకున్నట్లు నీవు దానితో ఆడుకుంటావా? నీ ఇంట్లోని అమ్మాయిలు ఆడుకోడానికి దానిని కట్టి ఉంచగలవా?
6వ్యాపారులు దానితో పరివర్తకం చేస్తారా? వారు దానిని ముక్కలుగా కోసి వ్యాపారులకు అమ్ముతారా?
7దాని చర్మం నిండా బల్లెములను గుచ్చగలవా? చేపలను పట్టే ఈటెలతో దాని తల నిండా పొడవగలవా?
8నీవు దాని మీద చేయి వేసి చూడు, దానితో చేసే పోరాటాన్ని జ్ఞాపకం చేసుకుని మళ్ళీ అలా చేయవు.
9దానిని వశపరుచుకోవాలనే ఆశ అబద్ధం; కేవలం దానిని చూస్తే చాలు ఎవరైనా భయపడిపోతారు.
10దానిని లేపే సాహసం ఎవరు చేయలేరు. అలాంటప్పుడు నా ఎదుట ఎవరు నిలబడగలరు?
11నేను తిరిగి చెల్లించవలసి ఉందని ఎవరు నన్ను అడగగలరు? ఆకాశం క్రింద ఉన్నదంతా నాదే.
12“లెవియాథన్ అవయవాల గురించి, దానికున్న అధిక బలాన్ని గురించి, దాని మనోహరమైన రూపాన్ని గురించి చెప్పకుండా ఉండలేను.
13దానిపై కవచాన్ని ఎవరు లాగివేయగలరు? దాని రెండంతల కవచంలోకి ఎవరు చొచ్చుకోగలరు?
14భయంకరమైన పళ్ళ వరుస గల, దాని నోటిద్వారాన్ని తెరవడానికి ఎవరు సాహసం చేస్తారు?
15దాని వీపుమీది పొలుసులు చాలా గట్టివి; అవి దగ్గరగా బిగుసుగా కూర్చబడ్డాయి.
16గాలికూడా వాటి మధ్యలోనికి చొరబడలేనంత ప్రతిదీ దాని తర్వాత దానికి చాలా దగ్గరగా ఉంటుంది.
17ఒక దానితో ఒకటి అతుక్కుని ఉన్నాయి, అవి అంటిపెట్టుకుని ఉంటాయి వాటిని ఎవరు వేరు చేయలేరు.
18దాని గురక కాంతి వెలుగులను విసురుతుంది; దాని కళ్లు ఉదయపు కిరణాల్లా ఉన్నాయి.
19దాని నోటి నుండి అగ్నిజ్వాలలు ప్రవహిస్తాయి; నిప్పు కణాలు ఎగిరివస్తాయి.
20జమ్ము మంట పై ఉడికే కుండలో నుండి పొగ వచ్చినట్లు దాని నాసికా రంధ్రాల్లో నుండి పొగ వస్తుంది.
21దాని ఊపిరి నిప్పు కణాలను రాజేస్తుంది, దాని నోటి నుండి మంటలు బయలుదేరతాయి.
22బలం దాని మెడలో ఉంటుంది; నిరాశ దాని ముందర నడుస్తుంది.
23దాని మాంసం యొక్క మడతలు దగ్గరగా కలుపబడ్డాయి; అవి దృఢంగా అంటుకుని ఉంటాయి.
24దాని రొమ్ము బండలా గట్టిగా, తిరుగటిరాయి క్రింది దిమ్మలా ఉంటుంది.
25అది లేచినప్పుడు, బలవంతులు భయపడతారు; అది కొట్టకుండానే పారిపోతారు.
26ఖడ్గంతో దాడి చేసినా ప్రభావం ఉండదు, ఈటెలు బాణాలు బరిసెలు దాని మీద పని చేయవు.
27దానికి ఇనుము అంటే తుక్కుతో ఇత్తడి అంటే పుచ్చిపోయిన చెక్కతో సమానము.
28బాణాలు దానిని పారిపోయేలా చేయలేవు; వడిసెల రాళ్లు దానికి పొట్టుతో సమానము.
29దుడ్డుకర్ర దానికి తుక్కు ముక్కలా ఉంటుంది; వడిగా వెళ్తున్న ఈటెను చూసి నవ్వుతుంది.
30దాని దిగువ భాగం పగిలిన కుండపెంకుల వలె గరుకుగా ఉంటాయి, బురద మీద నూర్పిడి కర్రను పోలిన గుర్తులను ఏర్పరుస్తుంది.
31అది దాని గందరగోళంతో నీటిని మరిగేలా చేస్తుంది. అది సముద్రాన్ని కదిలించి నూనె మరుగుతున్న కుండలా చేస్తుంది.
32అది వెళ్లిన దారంతా మెరుస్తున్న నురుగును వదలుతుంది; అది చూసేవారికి సముద్రానికి తెల్ల వెంట్రుకలు ఉన్నాయేమో అనిపిస్తుంది.
33భూమి మీద దానికి సమానమైనదేదీ లేదు; ఒక భయంలేని సృష్టి.
34అహంకారం కలిగిన వాటన్నిటిని చిన్న చూపు చూస్తుంది; గర్వపడే వాటన్నిటికి అది రాజు.”
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం — CC BY-SA 4.0. Where these translations come from.
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc. Available free at biblica.com and open.bible. Text unchanged, used under CC BY-SA 4.0.