Job bowing before storm light as a massive Behemoth grazes among reeds

యోబు 40

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం
అధ్యాయ సారాంశం
దేవుడు తనను సరిదిద్దగోరేవారిని జవాబివ్వమని సవాలు చేస్తాడు, యోబు తన నోటిపై చేయి పెట్టి ఇక మాట్లాడనని చెబుతాడు. దేవుడు తరువాత తనను తాను సమర్థించుకోవడానికి యోబు దైవిక న్యాయాన్ని కించపరుస్తాడా అని అడిగి, తనతో పాటు చేసిన అపారమైన బలం గల జీవి బెహేమోతును చూపిస్తాడు.
వినయంన్యాయంబెహేమోతుదైవిక శక్తి
1యెహోవా యోబుతో ఈ విధంగా అన్నారు:
2“సర్వశక్తిమంతునితో పోరాడేవారు ఆయనను సరిచేయగలరా? దేవునితో నిందించేవారు ఆయనకు జవాబు చెప్పాలి!”
3అప్పుడు యోబు యెహోవాకు ఇలా జవాబిచ్చాడు:
4“నేను అయోగ్యుడను, మీకెలా జవాబు చెప్పగలను? నా చేతితో నా నోరు మూసుకుంటాను.
5ఒకసారి మాట్లాడాను, కాని నా దగ్గర జవాబు లేదు; రెండు సార్లు, ఇక నేను ఏమి చెప్పను.”
6అప్పుడు యెహోవా సుడిగాలిలో నుండి యోబుతో ఇలా అన్నారు:
7“పురుషునిగా నీ నడుము కట్టుకో; నేను నిన్ను ప్రశ్నిస్తాను, నీవు నాకు జవాబు చెప్పాలి.
8“నీవు నా న్యాయాన్ని కించపరుస్తావా? నిన్ను నీవు సమర్థించుకోడానికి నన్ను ఖండిస్తావా?
9దేవుని బాహువులాంటిది నీకుందా? ఆయన స్వరంలా నీ స్వరం ఉరుమగలదా?
10అలాగైతే మహిమ వైభవంతో నిన్ను నీవే అలంకరించుకో! ఘనత ప్రభావాలను ధరించుకో!
11నీ మహా కోపాన్ని ప్రవాహంలా కుమ్మరించు, గర్విష్ఠులందరిని చూసి వారిని పడగొట్టు,
12గర్విష్ఠులందరిని చూసి వారిని అణచివేయి, వారున్న చోటులోనే దుష్టులను నలగ్గొట్టు.
13వారందరినీ దుమ్ములో పూడ్చిపెట్టు; వారిని సమాధిలో బంధించు.
14అప్పుడు నీ సొంత కుడి చేయి నిన్ను రక్షించగలదని నేనే నీ ముందు ఒప్పుకుంటాను.
15“నీటిగుర్రాన్ని చూడు, నిన్ను చేసినట్లే దానిని కూడా సృజించాను అది ఎద్దులా గడ్డిమేస్తుంది.
16దాని బలం దాని నడుములో ఉంది, దాని శక్తి దాని కడుపు కండరాల్లో ఉంది!
17దాని తోక దేవదారు చెట్టు కొమ్మ వంగినట్లు వంగుతుంది; దాని తొడనరాలు గట్టిగా అతికి ఉన్నాయి.
18దాని ఎముకలు ఇత్తడి గొట్టాలు, దాని ప్రక్కటెముకలు ఇనుప కడ్డీల్లాంటివి.
19దేవుని కార్యాల్లో అది మొదటి స్థానంలో ఉంటుంది, అయినా దాని సృష్టికర్తే దానిని తన ఖడ్గంతో సమీపించగలడు.
20కొండలు దానికి ఆహారం అందిస్తాయి, అడవి జంతువులన్నీ దగ్గరలోనే ఆడుకుంటాయి.
21తామర మొక్కల క్రింద అది పడుకుంటుంది, బురదనేలలోని రెల్లు మధ్యలో అది దాక్కుంటుంది.
22తామరచెట్లు వాటి నీడలో దానిని కప్పుతాయి; కాలువలోని నిరవంజి చెట్లు దానిని చుట్టుకొని ఉంటాయి.
23నది పొంగిపొర్లినా అది భయపడదు. యొర్దాను నది పొంగి దాని నోటి వరకు నీరు వచ్చినా అది ధైర్యంగా ఉంటుంది.
24అది మెలకువగా ఉన్నప్పుడు ఎవరైనా దానిని బంధించగలరా, దానికి వలవేసి ముక్కుకు తాడువేయగలరా?

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం — CC BY-SA 4.0. Where these translations come from.

Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc. Available free at biblica.com and open.bible. Text unchanged, used under CC BY-SA 4.0.