
యోబు 26
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం
అధ్యాయ సారాంశం
యోబు తన స్నేహితులు నిస్సహాయులకు ఎలా సహాయం చేశారని అడిగి, తరువాత తన సొంత వర్ణనతో వారిని మించిపోతాడు. చనిపోయినవారు నీటి కింద వణుకుతారు, భూమి శూన్యంపై వేలాడుతుంది, మేఘాలు పగలకుండా నీటిని పట్టుకుంటాయి, సముద్రం దేవుని శక్తితో నిశ్చలమవుతుంది. ఇదంతా తన మార్గాల బాహ్య అంచు మాత్రమేనని చెబుతాడు.
సృష్టిదైవిక శక్తిరహస్యంజ్ఞానం
1అప్పుడు యోబు ఇచ్చిన జవాబు:
2“శక్తిలేనివారికి నీవు ఎంత సహాయం చేశావు! బలహీనమైన చేతిని నీవు రక్షించావా?
3జ్ఞానం లేనివారికి నీవు ఎలాంటి ఆలోచన చెప్పావు? ఎంత చక్కగా వివరించావు?
4ఈ మాటలు చెప్పడానికి నీకు ఎవరు సహాయం చేశారు? ఎవరి మనస్సులోని మాటలు నీ నోటి నుండి వచ్చాయి?
5“జలాల క్రింద, వాటిలో జీవించే జీవుల క్రింద ఉన్న మృతులు, మృతులు వణుకుతున్నారు.
6పాతాళలోకం దేవుని ఎదుట తెరిచి ఉంది; నరకం ఆయనకు తేటగా కనిపిస్తుంది.
7శూన్యమండలంపైన ఉత్తరాన ఆకాశాలను ఆయన విశాలపరిచారు; శూన్యంలో భూమిని వేలాడదీసారు.
8ఆయన తన మేఘాలలో నీళ్లను బంధించారు అయినా వాటి బరువుకు మేఘాలు చినిగిపోవు.
9దాని మీద మేఘాలను వ్యాపింపజేసి ఆయన తన సింహాసనపు కాంతిని మరుగుపరిచారు.
10వెలుగు చీకట్ల సరిహద్దు వరకు జలాలకు ఆయన హద్దును నియమించారు.
11ఆయన గద్దింపుకు ఆకాశాల స్తంభాలు కంపిస్తాయి.
12ఆయన బలం చేత సముద్రం ఉప్పొంగుతుంది; తన జ్ఞానం చేత రాహాబును ముక్కలుగా చేస్తారు.
13ఆయన ఊపిరిచే ఆకాశాలు అలంకరించబడతాయి; ఆయన చేయి పారిపోతున్న సర్పాన్ని పొడిచింది.
14ఇవన్నీ ఆయన చేసినపనులలో కొంతవరకు మాత్రమే; మనం ఆయన గురించి విన్నది కేవలం గుసగుస ధ్వని వంటిది మాత్రమే! అలాంటప్పుడు ఆయన శక్తి యొక్క ఉరుమును గ్రహించగలిగిన వారెవరు?”
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం — CC BY-SA 4.0. Where these translations come from.
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc. Available free at biblica.com and open.bible. Text unchanged, used under CC BY-SA 4.0.