
2 కొరింథీ పత్రిక 5
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం
అధ్యాయ సారాంశం
పౌలు ప్రస్తుత భూలోక గుడారాన్ని దేవుడు అందించే నిలకడైన నివాసంతో పోల్చి విశ్వాసంలో నడవమని విశ్వాసులను పిలుస్తాడు. క్రీస్తు ప్రేమ నూతన సృష్టిని సృష్టించి, సామరస్య సందేశంతో సామరస్యం పొందిన ప్రజలను అప్పగిస్తుంది.
పునరుత్థాన నిరీక్షణవిశ్వాసంనూతన సృష్టిసామరస్యం
1మనం నివసిస్తున్న భూసంబంధమైన గుడారం నాశనమైనా, మానవ నిర్మితం కాని దేవుడు కట్టిన ఒక శాశ్వతమైన గృహం పరలోకంలో ఉందని మనకు తెలుసు.
2ఈలోగా పరలోకం నుండి వచ్చే మన నివాసాన్ని ధరించుకోవాలని ఆశపడుతూ మనం మూలుగుతున్నాము.
3ఎందుకంటే దాన్ని ధరించుకుంటే మనం దిగంబరులుగా కనబడము.
4ఈ గుడారంలో ఉన్నంతసేపు మనం భారం మోస్తూ మూల్గుతూ ఉన్నాం, ఎందుకంటే, మనం దిగంబరులుగా ఉండాలని కోరుకోం కాని చనిపోయేది జీవం చేత మ్రింగివేయబడేలా, మన పరలోక నివాసాన్ని ధరించుకోవాలని కోరుతున్నాము.
5దీని కోసం మనల్ని సిద్ధపరచింది దేవుడే; ఆయనే రాబోయే దానికి హామీగా తన ఆత్మను మనకు ఇచ్చారు.
6కాబట్టి మనం ఎల్లప్పుడు ఆత్మవిశ్వాసంతో ఉన్నాం, ఈ దేహంలో నివసించేంత కాలం ప్రభువుకు దూరంగా ఉన్నామని మనకు తెలుసు.
7మనం కంటికి కనిపించే దాన్ని కాక, విశ్వాసం వల్ల జీవిస్తున్నాము.
8కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, మనం సంపూర్ణ నమ్మకం కలిగి ఈ శరీరాన్ని విడిచిపెట్టి ప్రభువు దగ్గర నివసించాలని ఎంతగానో ఇష్టపడుతున్నాము.
9కాబట్టి మనం ఈ శరీరంలో ఉన్నా లేదా దానికి దూరంగా ఉన్నా ఆయనను సంతోషపెట్టడమే లక్ష్యంగా ఉందాము.
10ఎందుకంటే, మనలో ప్రతి ఒక్కరు తాము శరీరంలో ఉండగా చేసిన వాటికి, అవి మంచివైనా చెడ్డవైనా, తగిన ప్రతిఫలాన్ని పొందడానికి మనమందరం క్రీస్తు న్యాయసింహాసనం ఎదుట ఖచ్చితంగా కనబడాలి.
11అయితే, ప్రభువుకు భయపడడం అంటే ఏమిటో మాకు తెలుసు కాబట్టి ఇతరులకు నచ్చచెప్పడానికి ప్రయత్నిస్తున్నాము. మేమేంటో దేవునికి స్పష్టంగా తెలుసు, మీ మనస్సాక్షికి కూడ స్పష్టంగా తెలుసని నేను నమ్ముతున్నాను.
12మరల మీ ముందు మమ్మల్ని మేము పొగడుకోవాలని ప్రయత్నించడం లేదు కాని, హృదయంలో ఉన్నదానిని బట్టి కాక, కనిపించే దానిని బట్టి గర్వించే వారికి మీరు జవాబు చెప్పగలిగేలా మమ్మల్ని బట్టి మీరు గర్వించడానికి ఒక కారణాన్ని ఇస్తున్నాము.
13కొందరు చెప్పినట్లు, మేము పిచ్చివారమైతే అది దేవుని కోసం మాత్రమే; మేము వివేకవంతులమైనా అది మీ కోసమే.
14క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతం చేస్తుంది, ఎందుకంటే అందరి కోసం ఒక్కడే మరణించాడు కాబట్టి అందరు మరణించినట్టే అని మనం ఒప్పించబడ్డాము.
15ఆయన అందరి కోసం చనిపోయారు, కాబట్టి జీవిస్తున్నవారు ఇకపై తమ కోసం కాక, వారి కోసం మరణించి తిరిగి లేచిన ఆయన కొరకే జీవించాలి.
16అందువల్ల, మేము ఇప్పటినుండి లోక దృష్టితో ఎవరిని లక్ష్యపెట్టము. ఒకప్పుడు మేము క్రీస్తును ఇలాగే లక్ష్యపెట్టినా, ఇక మేము అలా చేయము.
17కాబట్టి ఎవరైనా క్రీస్తులో ఉంటే, వారు నూతన సృష్టి; పాతవి గతించాయి, క్రొత్తవి మొదలయ్యాయి!
18ఇదంతా దేవుని వల్లనే జరిగింది, ఆయన క్రీస్తు ద్వారా మనల్ని తనతో సమాధానపరచుకుని ఆ సమాధానపరిచే పరిచర్యను మాకు అప్పగించారు.
19ఆ పరిచర్య ఏంటంటే: దేవుడు ప్రజల పాపాలను వారి మీద మోపకుండా క్రీస్తు ద్వారా లోకాన్ని తనతో సమాధానపరచుకున్నారు. ఆ సమాధాన సందేశాన్ని బోధించే పని మాకు అప్పగించారు.
20అందువల్ల మేము దేవుడు మా ద్వారా వేడుకోడానికి ఏర్పరచబడిన క్రీస్తు రాయబారులము. దేవునితో సమాధానపడమని క్రీస్తు పక్షంగా మిమ్మల్ని బ్రతిమాలుతున్నాము.
21మనం ఆయనలో దేవుని నీతి అయ్యేలా, పాపమెరుగని ఆయనను మన కోసం పాపంగా చేశారు.
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం — CC BY-SA 4.0. Where these translations come from.
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc. Available free at biblica.com and open.bible. Text unchanged, used under CC BY-SA 4.0.