
2 కొరింథీ పత్రిక 4
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం
అధ్యాయ సారాంశం
పౌలు మోసాన్ని తిరస్కరించి యేసును బహిరంగంగా ప్రకటించి, హృదయాల్లో వెలుగును ప్రకాశింపజేయమని దేవుడిని నమ్ముతాడు. శుభవార్త నిధి పెళుసైన మట్టి పాత్రల్లో మోయబడుతుంది, కాబట్టి బాధ పునరుత్థాన శక్తిని ప్రదర్శిస్తుంది, అంతర్గత నూతనీకరణ తాత్కాలిక కష్టాన్ని అధిగమిస్తుంది.
శుభవార్త వెలుగుమట్టి పాత్రలుబాధనూతనీకరణ
1దేవుని కనికరాన్ని బట్టి ఈ పరిచర్యను మేము కలిగి ఉన్నాము, కాబట్టి మేము ధైర్యాన్ని కోల్పోము.
2అయితే సిగ్గుపడాల్సిన రహస్యమైన పనులను విడిచిపెట్టాం; మోసాన్ని చేయడం లేదు, దేవుని వాక్యాన్ని వంకరగా బోధించకుండా సత్యాన్ని స్పష్టంగా ప్రకటించడం ద్వారా దేవుని దృష్టిలో ప్రతివాని మనస్సాక్షికి మమ్మల్ని మేము అప్పగించుకుంటున్నాము.
3ఒకవేళ మేము బోధించే సువార్త ఎవరికైనా మురుగు చేయబడి ఉంటే అది నశించేవారికి మాత్రమే.
4దేవుని స్వరూపియైన క్రీస్తు మహిమను తెలియజేసే సువార్త వెలుగును వారు చూడకుండ ఈ యుగసంబంధమైన దేవత అవిశ్వాసులైనవారి మనస్సుకు గ్రుడ్డితనం కలుగజేసింది.
5ఎందుకంటే మా గురించి మేము ప్రకటించడం లేదు కాని యేసు క్రీస్తు ప్రభువని, యేసు కోసం మేము మీ సేవకులమని ప్రకటిస్తున్నాము.
6“చీకటి నుండి వెలుగు ప్రకాశించును గాక” అని పలికిన ఆ దేవుడే క్రీస్తు ముఖంపై ప్రకాశించే దైవ మహిమను, జ్ఞానమనే వెలుగును మాకు ఇవ్వడానికి మా హృదయాల్లో తన వెలుగును ప్రకాశింపజేశారు.
7అయితే ఈ అత్యధిక శక్తి అంతా దేవునిదే గాని మాది కాదు అని చూపించడానికి, మేము మట్టి పాత్రల్లో ఈ సంపదను కలిగి ఉన్నాము.
8మేము అన్ని వైపుల నుండి తీవ్రమైన శ్రమలకు గురయ్యాం కాని నలిగిపోలేదు; ఆందోళన కలిగినా నిరాశ చెందలేదు;
9హింసించబడినా విడిచిపెట్టబడలేదు; పడత్రోయబడినా నాశనమవ్వలేదు.
10మా శరీరంలో యేసు జీవం ప్రత్యక్షపరచబడాలని ఆయన మరణాన్ని మా శరీరంలో ఎప్పుడు మోస్తునే ఉన్నాము.
11మా క్షయమైన శరీరంలో యేసు జీవం ప్రత్యక్షపరచబడాలని సజీవులమైన మేము ఎల్లప్పుడు యేసు కొరకై మరణానికి అప్పగించబడుతున్నాము.
12కాబట్టి మాలో మరణం పని చేస్తుంది, కాని మీలో జీవం పని చేస్తుంది.
13“నేను విశ్వసించాను కాబట్టి మాట్లాడాను” అని వ్రాయబడి ఉంది. అదే విశ్వాసపు ఆత్మ మాలో కూడా ఉంది, కాబట్టి మేము కూడా విశ్వసిస్తున్నాం కాబట్టి మాట్లాడుతున్నాము.
14ఎందుకంటే, ప్రభువైన యేసును మృతులలో నుండి లేపిన దేవుడు, యేసుతో పాటు మమ్మల్ని కూడా లేవనెత్తి మీతో పాటు తన ఎదుట నిలబెడతారని మాకు తెలుసు.
15ఇదంతా మీ మేలు కోసమే, అప్పుడు దేవుని కృప అధికంగా వ్యాపించి ప్రజలు అధిక సంఖ్యలో దేవుని మహిమకు విస్తారంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు.
16కాబట్టి మేము ఎప్పుడు ధైర్యాన్ని కోల్పోము. మేము బాహ్యంగా క్షీణిస్తున్నా, అంతరంగంలో దినదినం నూతనపరచబడుతున్నాము.
17మేము అనుభవిస్తున్న ఈ క్షణికమైన తేలికైన కష్టాలు వాటికన్నా ఎంతో అధికమైన నిత్య మహిమను సంపాదిస్తున్నాయి.
18కాబట్టి కనిపించే వాటిపై కాక కనిపించని వాటిపై మా దృష్టిని నిలిపాము. ఎందుకంటే కనిపించేవి తాత్కాలికమైనవి, కనిపించనివి శాశ్వతమైనవి.
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం — CC BY-SA 4.0. Where these translations come from.
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc. Available free at biblica.com and open.bible. Text unchanged, used under CC BY-SA 4.0.