A diverse community listening with transformed faces as a translucent veil opens toward sunrise

2 కొరింథీ పత్రిక 3

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం
అధ్యాయ సారాంశం
కొరింథీయులు తాము సిరాతో కాకుండా ఆత్మచే రాయబడిన క్రీస్తు జీవించే లేఖ. పౌలు పాత ఒడంబడిక క్షీణిస్తున్న మహిమను ఆత్మ నిలకడైన స్వేచ్ఛతో పోల్చుతాడు, దాని ద్వారా ముసుగు తీయబడిన విశ్వాసులు రూపాంతరం చెందుతారు.
జీవించే లేఖకొత్త ఒడంబడికఆత్మరూపాంతరం
1మమ్మల్ని మేమే మరల మెచ్చుకోవడం ప్రారంభించామా? లేదా ఇతరుల్లా మీకు గాని మీ దగ్గరి నుండి గాని మాకు సిఫారసు పత్రికలు అవసరమా?
2మా హృదయాల మీద వ్రాయబడి, మనుష్యులందరు తెలుసుకుని చదవాల్సిన మా పత్రిక మీరే.
3రాతి పలక మీద గాని సిరాతో గాని వ్రాయక మానవ హృదయాలు అనే పలకల మీద జీవంగల దేవుని ఆత్మ ద్వారా వ్రాయబడిన క్రీస్తు పత్రిక మీరేనని, మా పరిచర్య ఫలితం మీరేనని మీరు తెలియపరుస్తున్నారు.
4ఇలాంటి నమ్మకం క్రీస్తు ద్వారా దేవునిపై మాకుంది.
5మేము ఈ పనిని సాధించగలమని చెప్పుకోడానికి మేము సమర్థులమని కాదు, మాలో ఉన్న సామర్థ్యం దేవుని నుండి వచ్చింది.
6వ్రాతపూర్వకమైన నియమాలను కాక, ఆత్మతో కూడిన క్రొత్త నిబంధనను సేవించగల సామర్ధ్యాన్ని ఆయనే మాకు ఇచ్చారు. అక్షరం చంపుతుంది కాని ఆత్మ జీవం ఇస్తాడు.
7మరణాన్ని తెచ్చే పరిచర్య రాళ్లమీద అక్షరాలలో చెక్కబడినా, అది మహిమతో వచ్చింది. మోషే ముఖంపై ప్రకాశించిన మహిమ శాశ్వతమైనది కాకపోయినా ఇశ్రాయేలీయులు దాన్ని నేరుగా చూడలేకపోయారు.
8అయితే ఆత్మ సంబంధమైన పరిచర్య మరి ఎంత మహిమకరంగా ఉంటుంది?
9శిక్షను తెచ్చే పరిచర్య మహిమ కలిగి ఉంటే, నీతిమంతులుగా చేసే పరిచర్య ఇంకా ఎంత అధిక మహిమ కలిగి ఉంటుందో!
10అందుకే, ఇప్పటి అత్యున్నతమైన మహిమతో పోల్చినప్పుడు ఇప్పటివరకు మహిమకరంగా ఉన్నవేవి మహిమగా ఉండవు.
11ఎందుకంటే, గతించిపోయే దానిలోనే మహిమ ఉంటే, ఎల్లప్పుడు నిలిచి ఉండే దానిలో ఇంకెంత మహిమ ఉంటుందో కదా!
12కాబట్టి, మాకు ఇలాంటి నిరీక్షణ ఉంది, అందుకే మేము ఇంత ధైర్యంతో ఉన్నాము.
13మేము మోషేలాంటి వారం కాదు, తరిగిపోతున్న దాని అంతాన్ని ఇశ్రాయేలు ప్రజలు చూడకుండ మోషే తన ముఖం మీద ముసుగు వేసుకున్నాడు.
14నిజానికి వారి మనస్సులు మొద్దుబారాయి, పాత నిబంధన చదువుతున్నపుడు ఈనాటికీ వారి మనస్సులకు ఆ ముసుగు అలాగే ఉంది. అది తీసివేయబడలేదు ఎందుకంటే కేవలం క్రీస్తులో మాత్రమే అది తీసివేయబడుతుంది.
15నేటికీ వారు మోషే ధర్మశాస్త్రాన్ని చదివేటప్పుడు, వారి హృదయాల మీద ముసుగు ఉంది.
16కాని ఎవరైనా ప్రభువు వైపుకు తిరిగితే ఆ ముసుగు తీసివేయబడుతుంది.
17ఇప్పుడు ప్రభువే ఆత్మ. ప్రభువు ఆత్మ ఎక్కడ ఉన్నాడో అక్కడ స్వాతంత్ర్యం ఉంటుంది.
18కాబట్టి ముసుగు తొలగిన ముఖాలతో ఆత్మయైన ప్రభువు నుండి వచ్చే ఆయన మహిమను ప్రతిబింబిస్తూ, అంతకంతకు అధికమయ్యే ఆయన మహిమ రూపంలోనికి మనమందరం మార్చబడుతున్నాము.

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం — CC BY-SA 4.0. Where these translations come from.

Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc. Available free at biblica.com and open.bible. Text unchanged, used under CC BY-SA 4.0.