
2 కొరింథీ పత్రిక 2
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం
అధ్యాయ సారాంశం
పౌలు తన మునుపటి లేఖ వెనుక ఉన్న బాధను వివరించి పశ్చాత్తాపపడిన తప్పిదస్తుడిని క్షమించి ఓదార్చమని సంఘాన్ని కోరతాడు. తీతు కోసం ఆందోళన చెందుతున్నప్పటికీ, అతను క్రీస్తు సేవకులను వెల్లడించే సుగంధంగా నడిపిస్తున్నందుకు దేవుడికి కృతజ్ఞతలు తెలుపుతాడు.
క్షమాపణపునరుద్ధరణతీతుక్రీస్తు సుగంధం
1కాబట్టి నేను దుఃఖం కలిగించేలా మీ దగ్గరకు తిరిగి రాకూడదని నేను నిర్ణయించుకున్నాను.
2ఎందుకంటే, నేను మీకు దుఃఖం కలిగిస్తే, నేను దుఃఖంలో విడిచిపెట్టిన వారు తప్ప మరి ఎవరు నన్ను సంతోషపెట్టగలరు?
3కాబట్టి, నేను అక్కడికి వచ్చినపుడు నన్ను సంతోషపెట్టాల్సిన వ్యక్తులే నన్ను దుఃఖపెట్టకూడదని నేను మీకు వ్రాశాను. నా ఆనందమే మీ అందరి ఆనందమని నాకు గట్టి నమ్మకము.
4ఎంతో దుఃఖ హృదయంతో, కన్నీటితో మీకు వ్రాశాను. నేను వ్రాసింది మిమ్మల్ని బాధపెట్టడానికి కాదు కాని, నేను మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నానో, మీరు గుర్తించడానికి మాత్రమే.
5ఎవరైనా దుఃఖం కలిగిస్తే, నాకు మాత్రమే గాక మీకందరికిని దుఃఖం కలిగించినట్లే. ఇంతకంటే కఠినంగా మాట్లాడటం నాకు ఇష్టం లేదు.
6అలాంటి వానికి మీలో ఎక్కువ మంది ద్వారా విధించబడిన శిక్షే చాలు.
7కాబట్టి మీరిక అతన్ని శిక్షించకుండా క్షమించి, ఓదార్చడం మంచిది, లేకపోతే అతడు అధిక దుఃఖంలో మునిగిపోతాడేమో.
8అందుకే, మీరు అతని పట్ల మీ ప్రేమను మళ్ళీ రూఢిపరచుమని మిమ్మల్ని వేడుకుంటున్నాను.
9మిమ్మల్ని పరీక్షించి, అన్ని విషయాల్లో మీరు విధేయత చూపుతారో లేదో తెలుసుకోవడానికి నేను అలా వ్రాశాను.
10మీరు క్షమించేవారిని నేను క్షమిస్తాను. నేను ఏ దోషమైన క్షమిస్తే, మీ కోసమే క్రీస్తును బట్టి క్షమిస్తాను.
11సాతాను మనపై ఆధిక్యాన్ని పొందకుండా అలా చేశాను, సాతాను తంత్రాలు మనకు తెలియనివి కావు.
12క్రీస్తు సువార్తను బోధించడానికి నేను త్రోయకు చేరినప్పుడు ప్రభువు నా పని కోసం అప్పటికే అక్కడ మార్గం సిద్ధపరచి ఉంచారని తెలుసుకున్నాను.
13కాని నా సోదరుడు తీతును అక్కడ నాకు కనిపించకపోవడంతో నా మనస్సుకు నెమ్మది లేదు. కాబట్టి అక్కడి ప్రజలకు వీడ్కోలు చెప్పి మాసిదోనియా ప్రాంతానికి వెళ్లాను.
14కాబట్టి ఆయన మా ద్వారా ప్రతి స్థలంలో క్రీస్తును గురించిన జ్ఞానపు సువాసన వ్యాపింపచేస్తూ, ఆయనలో మమ్మల్ని ఎల్లప్పుడు విజయోత్సాహంతో ముందుకు నడిపిస్తున్న దేవునికి కృతజ్ఞతలు.
15ఎందుకంటే, రక్షించబడుతున్నవారి మధ్య, నశించేవారి మధ్య మేము దేవునికి ఇష్టమైన క్రీస్తు పరిమళంగా ఉన్నాము.
16ఒకరికి మరణం తెచ్చే వాసనగా, మరొకరికి జీవం తెచ్చే వాసనగా ఉన్నాము. కాబట్టి, అలాంటి కార్యానికి యోగ్యులు ఎవరు?
17మేము దేవుని వాక్యాన్ని స్వలాభం కోసం అమ్మేవారం కాదు, మేము దేవుని వాక్యాన్ని నిజాయితీగా క్రీస్తు అధికారంతో ఆయన ఎదుట బోధిస్తున్నాము. దేవుడు మమ్మల్ని చూస్తున్నారని మాకు తెలుసు.
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం — CC BY-SA 4.0. Where these translations come from.
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc. Available free at biblica.com and open.bible. Text unchanged, used under CC BY-SA 4.0.