Travel-worn ministers arriving from a stormy harbor as believers welcome them through broad open doors

2 కొరింథీ పత్రిక 6

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం
అధ్యాయ సారాంశం
కృపను వ్యర్థంగా పొందవద్దని పౌలు కొరింథీయులను కోరి, కష్టం, పరిశుద్ధత, సహనం, ప్రేమ ద్వారా భరించిన పరిచర్యను వర్ణిస్తాడు. అతని హృదయం విశాలంగా తెరుచుకుని ఉంది, పూర్ణ హృదయ పవిత్రత, ఆప్యాయత కోసం విజ్ఞప్తి చేస్తాడు.
సహనంపరిచర్య నిజాయితీతెరిచిన హృదయాలుపవిత్రత
1దేవుని తోటిపనివారిగా మేము, మీరు పొందిన దేవుని కృపను వ్యర్థం చేసుకోవద్దని మిమ్మల్ని వేడుకుంటున్నాము.
2అయితే, “నా అనుకూల సమయంలో నీ మొర ఆలకించాను, రక్షణ దినాన నేను నీకు సహాయం చేశాను” అని ఆయన చెప్తున్నారు. ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం అని మీకు నేను చెప్తున్నాను.
3మా పరిచర్యకు ఎలాంటి నింద రాకూడదని మేము ఎవరి మార్గానికి ఆటంకాన్ని కలిగించడం లేదు.
4కాని, మేము దేవుని సేవకులంగా మాకు మేమే అన్ని విధాలుగా మెప్పించుకుంటున్నాము: సహనంలో సమస్యల్లో కష్టాల్లో దుఃఖాల్లో;
5దెబ్బల్లో చెరసాలల్లో అల్లర్లలో కష్టమైన పనిలో నిద్రలేని రాత్రుల్లో ఆకలిలో;
6పవిత్రతలో జ్ఞానంలో ఓర్పులో దయలో; పరిశుద్ధాత్మలో నిజమైన ప్రేమలో;
7సత్యంగా మాట్లాడంలో దేవుని శక్తిలో; కుడిచేతిలో ఎడమ చేతిలో నీతి అనే ఆయుధాలను కలిగి;
8ఘనతలో అవమానంలో నిందల్లో మెప్పుల్లో; యథార్థవంతులం అయినప్పటికి మోసం చేసేవారమనే నింద మామీద వేయబడింది;
9తెలిసినవారమైనా తెలియనివారిగా ఎంచబడ్డాము; మరణిస్తున్నా జీవిస్తూనే ఉన్నాం; కొట్టబడ్డాం కాని చంపబడలేదు;
10దుఃఖపడినా ఎల్లప్పుడు సంతోషిస్తూనే ఉన్నాం; మేము పేదలం కాని అనేకమందిని ధనవంతులుగా చేస్తున్నాము; ఏమి లేదు కాని సమస్తాన్ని కలిగి ఉన్నాము.
11కొరింథీయులారా, మేము మీతో స్వేచ్ఛగా మాట్లాడాము, మా హృదయాలను మీ ఎదుట విశాలంగా తెరిచాం.
12మా అభిమానాన్ని మీ నుండి మేము తగ్గించడం లేదు, కానీ మా నుండి మిమ్మల్ని మీరే దూరం ఉంచుతున్నారు.
13నా బిడ్డలుగా భావించి నేను మీతో మాట్లాడుతున్నాను, మాలా మీరు కూడా మీ హృదయాలను విశాలంగా తెరవండి.
14అవిశ్వాసులతో సహవాసం చేయకండి. ఎందుకంటే నీతి అవినీతి ఎలా కలిసి ఉంటాయి? చీకటి వెలుతురు ఎలా కలిసి ఉంటాయి?
15క్రీస్తుకు బెలియాలుతో ఏమి సంబంధం? విశ్వాసికి అవిశ్వాసికి పొత్తు ఏమిటి?
16దేవాలయాలకు విగ్రహాలకు మధ్య ఉన్న ఒప్పందం ఏమిటి? మనం జీవంగల దేవుని ఆలయమై ఉన్నాము. కాబట్టి దేవుడు ఇలా చెప్పారు: “నేను వారితో నివసిస్తాను వారి మధ్య నడుస్తాను, నేను వారి దేవునిగా ఉంటాను, వారు నా ప్రజలుగా ఉంటారు.”
17కాబట్టి, “వారి మధ్య నుండి బయటకు వచ్చి ప్రత్యేకంగా ఉండండి, అని ప్రభువు చెప్తున్నాడు. అపవిత్రమైన దానిని తాకకండి, అప్పుడు నేను మిమ్మల్ని చేర్చుకుంటాను.
18ఇంకా, “నేను మీకు తండ్రిగా ఉంటాను, మీరు నాకు కుమారులు కుమార్తెలుగా ఉంటారు, అని సర్వశక్తిగల ప్రభువు చెప్తున్నాడు.”

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం — CC BY-SA 4.0. Where these translations come from.

Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc. Available free at biblica.com and open.bible. Text unchanged, used under CC BY-SA 4.0.