
పరమ 4
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం
అధ్యాయ సారాంశం
ప్రియుడు గువ్వలు, మందలు, ఎర్రటి రంగు, గోపురాలు, పర్వతాలు, తేనె, సుగంధం నుండి తీసుకున్న కవితా చిత్రాల ద్వారా తన వధువును కొనియాడుతాడు. అతను ఆమెను లెబానోను నుండి ఆహ్వానించి, పండు, సుగంధద్రవ్యాలు, జీవజలంతో సమృద్ధిగా ఉన్న మూసిన తోట, ముద్రించిన ఊటగా వర్ణిస్తాడు.
ప్రశంసఅందంనమ్మకంతోటజీవజలం
1నా ప్రియురాలా, నీవు ఎంత అందంగా ఉన్నావు! ఓ, ఎంత అందం! మీ ముసుగు వెనుక మీ కళ్లు గువ్వల్లా ఉన్నాయి. నీ శిరోజాలు గిలాదు పర్వతం మీది నుండి దిగివొచ్చే మేకల మందల్లా కనిపిస్తున్నాయి.
2నీ పళ్ళు అప్పుడే కత్తెర వేయబడి, కడుగబడి పైకి వస్తున్న గొర్రె మందలా ఉన్నాయి. ప్రతిదీ జంటగా ఉన్నాయి, వాటిలో ఒక్కటి కూడా ఒంటరిగా లేదు.
3నీ పెదవులు ఎర్ర త్రాడులా ఉన్నాయి; నీ నోరు మనోహరము. నీ ముసుగు వెనుక ఉన్న నీ చెక్కిళ్ళు, సగం దానిమ్మ పండులా ఉన్నాయి.
4నీ మెడ అందంగా నిర్మించబడిన దావీదు గోపురంలా ఉన్నది; దాని మీద వేయి డాళ్లు వ్రేలాడుతున్నాయి; అవన్నీ శూరుల డాళ్లు.
5నీ స్తనములు రెండు జింక పిల్లల్లా ఉన్నాయి, తామర పువ్వుల మధ్య మేసే దుప్పి కవల పిల్లల్లా ఉన్నాయి.
6తెల్లవారుజాము రాకముందు నీడలు పారిపోకముందు, నేను బోళం కొండకు బోళం పర్వతానికి వెళ్తాను.
7నా ప్రియురాలా, నీవు అధిక మనోహరం; నీలో ఏ కంళంకమూ లేదు.
8నా వధువు, లెబానోను నుండి నాతో రా, లెబానోను నుండి నాతో రా. అమాన పర్వత శిఖరం నుండి, శెనీరు, హెర్మోను శిఖరాల నుంచీ, సింహాల బోనుల నుండి, చిరుత పులులు సంచరించే కొండల నుండి దిగిరా.
9నా సోదరీ, నా వధువా, నీవు నా హృదయం దొంగిలించావు; నీ ఒక్క చూపుతో, నీ హారంలోని ఒక్క ఆభరణంతో నీవు నా హృదయాన్ని దొంగిలించావు.
10నా సోదరీ, నా వధువా, నీ ప్రేమ ఎంత ఆహ్లాదకరం! ద్రాక్షరసం కంటే నీ ప్రేమ ఆనందమయం, నీవు పూసుకున్న పరిమళ తైల సువాసన సుగంధ ద్రవ్యాలన్నిటినీ మించింది!
11నా వధువు! నీ పెదవులు తేనెతెట్టెలా మాధుర్యాన్ని వదులుతున్నాయి; నీ నాలుక క్రింద పాలు తేనె ఉన్నాయి. నీ వస్త్ర సువాసన లెబానోను సువాసనగా ఉంది.
12నా సోదరీ, నా వధువు! నీవు మూసివేయబడిన తోటవు నీవు చుట్టబడిన ఊటవు, మూయబడిన సరస్సువు.
13నీ మొక్కలు ఒక దానిమ్మతోట కోరుకున్న ఫలములతో, గోరింట జటామాంసి చెట్లతో,
14జటామాంసి కుంకుమ పువ్వు, వోమ దాల్చిన చెక్క, ప్రతి విధమైన పరిమళ చెట్టుతో, బోళం కలబంద, అన్ని సుగంధద్రవ్యాలు.
15నీవు ఉద్యానవనంలోని జలాశయానివి, లెబానోను నుండి దిగువకు ప్రవహించే, నీటి ఊటలు కల బావివి.
16ఉత్తర వాయువూ, మేలుకో, దక్షిణ వాయువూ, రా! నా ఉద్యానవనం మీద వీచండి, తద్వారా అందలి పరిమళ వాసన అన్ని వైపుల వ్యాపించాలి. నా ప్రియుడు తన ఉద్యాన వనానికి వచ్చి నచ్చిన పండ్లు రుచి చేయును గాక.
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం — CC BY-SA 4.0. Where these translations come from.
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc. Available free at biblica.com and open.bible. Text unchanged, used under CC BY-SA 4.0.