
కీర్తనలు 88
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం
అధ్యాయ సారాంశం
కీర్తన 88 మరణానికి దగ్గరగా, ముంచెత్తబడి, ఒంటరిగా, స్పష్టంగా జవాబు లేకుండా ఉన్న వ్యక్తి నుండి ఉపశమనం లేని విలాపం. కనిపించే పరిష్కారం లేకున్నా, బాధితుడు రేయింబవళ్లు దేవుడిని సంబోధించడం కొనసాగిస్తాడు, పట్టుదల గల ప్రార్థనను చివరి చర్యగా చేస్తాడు.
విలాపంఒంటరితనంబాధప్రార్థన
1యెహోవా, మీరు నన్ను రక్షించే దేవుడు; రాత్రింబగళ్ళు నేను మీకు మొరపెడతాను.
2నా ప్రార్థనలు మీ ఎదుటకు వచ్చును గాక; చెవియొగ్గి నా మొర ఆలకించండి.
3నేను ఇబ్బందుల్లో మునిగి ఉన్నాను నా ప్రాణం మరణానికి చేరువగా ఉంది.
4సమాధికి వెళ్లే వారితో నేను లెక్కించబడ్డాను; నేను బలం లేనివాడిలా ఉన్నాను.
5సమాధిలో పడి ఉన్న హతులైనవారిలా, నేను చచ్చినవారితో విడిచిపెట్టబడ్డాను, వారిని మీరు ఎన్నటికి జ్ఞాపకముంచుకోరు, వారు మీ సంరక్షణ నుండి తొలగిపోయారు.
6మీరు నన్ను లోతైన గుంటలో, చీకటి గుంటలో ఉంచారు.
7మీ ఉగ్రత నా మీద భారంగా ఉంది; మీ అలలతో నన్ను ముంచివేశారు. సెలా
8నా దగ్గరి స్నేహితులను నా నుండి దూరం చేశారు నన్ను వారికి అసహ్యమైన వానిగా చేశారు. నేను నిర్బంధించబడ్డాను నేను తప్పించుకోలేను;
9దుఃఖంతో నా కళ్లు మసకబారాయి. యెహోవా, ప్రతిరోజు నేను మీకు మొరపెడుతున్నాను; మీ వైపు నా చేతులు చాచాను.
10మృతులకు మీరు అద్భుతాలు చూపిస్తారా? వారి ఆత్మలు లేచి మిమ్మల్ని స్తుతిస్తాయా? సెలా
11సమాధిలో మీ మారని ప్రేమ ప్రకటించబడుతుందా? నాశనకూపంలో మీ నమ్మకత్వం ప్రకటించబడుతుందా?
12చీకటి స్థలంలో మీ అద్భుతాలు తెలుస్తాయా? మరుపుకు గురియైన దేశంలో మీ నీతి క్రియలు తెలుస్తాయా?
13కాని యెహోవా, నేను సహాయం కోసం మీకు మొరపెడతాను; ఉదయం నా ప్రార్థన మీ ఎదుటకు వస్తుంది.
14యెహోవా, మీరు ఎందుకు నన్ను తృణీకరిస్తూ నా నుండి మీ ముఖాన్ని దాచుకుంటున్నారు?
15నా యవ్వనం నుండి నేను బాధను అనుభవించి మరణానికి దగ్గరగా ఉన్నాను; నేను మీ భయాలను భరించి నిరాశలో ఉన్నాను.
16మీ ఉగ్రత నన్ను ముంచేసింది; మీ భయాలు నన్ను నిర్మూలం చేశాయి.
17అవి రోజంతా ప్రవాహంలా నన్ను చుట్టుముట్టాయి; అవి నన్ను పూర్తిగా ముంచేశాయి.
18నా స్నేహితులను నా పొరుగువారిని నాకు దూరం చేశారు చీకటే నాకు దగ్గరి స్నేహితుడు.
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం — CC BY-SA 4.0. Where these translations come from.
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc. Available free at biblica.com and open.bible. Text unchanged, used under CC BY-SA 4.0.