
కీర్తనలు 86
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం
అధ్యాయ సారాంశం
కీర్తన 86 వ్యక్తిగత అవసరం, నమ్మకం, స్తుతిని వినయపూర్వక ప్రార్థనలో సమకూరుస్తుంది. గర్విష్ఠ శత్రువులతో చుట్టుముట్టబడి, విన్నపదారుడు దయ, బలం, బోధించిన మార్గం, దేవుడిని గౌరవించే అవిభక్త హృదయం కోసం అడుగుతాడు.
ప్రార్థనదయబోధననమ్మకం
1యెహోవా, చెవియొగ్గి ఆలకించండి, నాకు జవాబివ్వండి, ఎందుకంటే నేను దీనుడను నిరుపేదను.
2మీపట్ల విశ్వాసంగా ఉన్న నా ప్రాణాన్ని కాపాడండి; మీయందు నమ్మకం ఉంచిన సేవకుడిని రక్షించండి. మీరే నా దేవుడు;
3ప్రభువా! నాపై దయచూపండి. దినమంతా నేను మీకు మొరపెడుతున్నాను.
4ప్రభువా, మీ సేవకునికి ఆనందం ప్రసాదించండి, ఎందుకంటే నేను మీయందు నమ్మకం ఉంచాను.
5ప్రభువా, మీరు మంచివారు క్షమించేవారు, మీకు మొరపెట్టే వారందరి పట్ల మారని ప్రేమ కలిగి ఉన్నారు.
6యెహోవా, నా ప్రార్థన వినండి; నా మనవుల ధ్వని ఆలకించండి.
7నేను బాధలో ఉన్నప్పుడు మీకు మొరపెడతాను, మీరు నాకు జవాబిస్తారు.
8ప్రభువా, దేవుళ్ళలో మీవంటి వారు లేరు; మీ క్రియలకు ఏది సాటిలేదు.
9ప్రభువా, మీరు సృజించిన దేశాలన్నీ వచ్చి మీ ముందు ఆరాధిస్తారు; వారు మీ నామానికి కీర్తి తెస్తారు.
10మీరు గొప్ప దేవుడు. మీ అద్భుతాలు గొప్పవి; మీరే ఏకైక దేవుడు.
11యెహోవా, మీ సత్యాన్ని అనుసరించి జీవించేలా, మీ మార్గాలు మాకు బోధించండి, నేను మీ నామానికి భయపడేలా నా హృదయానికి ఏకాగ్రత దయచేయండి.
12ప్రభువా నా దేవా, నా పూర్ణహృదయంతో నేను మిమ్మల్ని స్తుతిస్తాను; నేను మీ నామాన్ని నిరంతరం మహిమపరుస్తాను.
13ఎందుకంటే నా పట్ల మీ మారని ప్రేమ ఎంతో గొప్పది; అగాధాల్లో నుండి, పాతాళంలో నుండి మీరు నన్ను విడిపించారు.
14ఓ దేవా, గర్విష్ఠులైన శత్రువులు నాపై దాడి చేస్తున్నారు; క్రూరులైన ప్రజలు నన్ను చంపాలని గుమికూడుతున్నారు వారు మిమ్మల్ని లక్ష్యపెట్టరు.
15కాని ప్రభువా, మీరు కనికరం, కరుణ గల దేవుడు, త్వరగా కోప్పడరు, మారని ప్రేమ, నమ్మకత్వం కలిగి ఉన్నారు.
16నా వైపు తిరగండి నా మీద కరుణ చూపండి; మీ సేవకునికి మీ బలాన్ని ప్రసాదించండి; నన్ను రక్షించండి, ఎందుకంటే నేను మీ దాసురాలి కుమారుడను.
17నాకు మీ ఆదరణ గుర్తు ఇవ్వండి, నన్ను ద్వేషించేవారు అది చూసి సిగ్గుపడతారు, ఎందుకంటే యెహోవా, మీరు నాకు సహాయం చేశారు నన్ను ఆదరించారు.
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం — CC BY-SA 4.0. Where these translations come from.
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc. Available free at biblica.com and open.bible. Text unchanged, used under CC BY-SA 4.0.