
కీర్తనలు 83
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం
అధ్యాయ సారాంశం
అనేక శత్రువులు ఇశ్రాయేలు గుర్తింపును తుడిచివేయడానికి ఐక్య కుట్రను రూపొందించినప్పుడు కీర్తన 83 సామూహిక భయాందోళనకు స్వరం ఇస్తుంది. గర్విష్ఠ దూకుడు కూలిపోవాలని, శత్రు శక్తులు తమ సంకీర్ణం కంటే గొప్ప అధికారాన్ని గుర్తించాలని ప్రార్థన అడుగుతుంది.
శత్రువులుప్రార్థనరక్షణవినయపరచడం
1ఓ దేవా! మౌనంగా ఉండకండి; ఓ దేవా, మమ్మల్ని పెడచెవిని పెట్టకండి, నిశ్చలంగా ఉండకండి.
2మీ శత్రువులు ఎలా కేకలు వేస్తున్నారో చూడండి, మిమ్మల్ని ద్వేషించేవారు తలలు పైకెత్తుతున్నారు.
3వారు మీ ప్రజలకు హాని చేయాలని చూస్తున్నారు; మీరు ఆదరించే వారికి వ్యతిరేకంగా వారు కుట్రలు చేస్తారు.
4“రండి, వారి దేశాన్ని లేకుండ నాశనం చేద్దాం అప్పుడు ఇశ్రాయేలీయుల పేరు ఇక జ్ఞాపకం ఉండదు” అని వారు అంటున్నారు.
5వారు ఏకమనస్సుతో కుట్ర చేశారు; వారు మీకు వ్యతిరేకంగా ఒప్పందం చేసుకున్నారు.
6గుడారాల్లో నివసించే ఎదోమీయులు, ఇష్మాయేలీయులు, మోయాబీయులు, హగ్రీయీలు,
7గెబాలు, అమ్మోను అమాలేకు, ఫిలిష్తియా, తూరు ప్రజలతో ఒప్పందం చేసుకున్నారు.
8లోతు వారసులను బలోపేతం చేయడానికి అష్షూరు కూడా వారితో చేరింది. సెలా
9మిద్యానుకు చేసినట్లుగా, కీషోను నది దగ్గర సీసెరా యాబీనుకు చేసినట్లుగా వారికి చేయండి.
10వారు ఎన్-దోరు దగ్గర నశించారు నేల మీద పేడలా అయ్యారు.
11ఓరేబుకు జెయేబుకు చేసినట్లు వారి సంస్థానాధిపతులకు జెబహుకు సల్మున్నాకు వారి యువరాజులందరికి చేయండి.
12వారు, “దేవుని పచ్చికబయళ్లను స్వాధీనం చేసుకుందాం” అని అన్నారు.
13నా దేవా, వారిని సుడి తిరిగే దుమ్ములా, గాలి ముందు కొట్టుకుపోయే పొట్టులా చేయండి.
14అగ్ని అడవిని దహించునట్లు కారుచిచ్చు పర్వతాలను తగలబెట్టినట్లు,
15మీ తుఫానుతో వారిని వెంటాడండి మీ సుడిగాలితో వారిని భయపెట్టండి.
16వారు మీ నామాన్ని వెదకునట్లుగా, యెహోవా, సిగ్గుతో వారి ముఖాలు కప్పండి.
17వారు ఎప్పటికీ సిగ్గుపడాలి భయపడాలి; వారు అవమానంలో నశించెదరు గాక.
18యెహోవా అనే నామం గల మీరు భూమి మీద అందరిలో మహోన్నతుడవని వారు తెలుసుకోవాలి.
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం — CC BY-SA 4.0. Where these translations come from.
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc. Available free at biblica.com and open.bible. Text unchanged, used under CC BY-SA 4.0.