A community prays among the burned sanctuary ruins while sea, sun, moon, and seasons fill the horizon

కీర్తనలు 74

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం
అధ్యాయ సారాంశం
కీర్తన 74 అపవిత్రం చేయబడిన పవిత్ర స్థలం, దాని తరువాతి కనిపించే మౌనంపై సామూహిక విలాపం. శిథిలాల మధ్య, ప్రజలు సముద్రాలు, పగలు, రాత్రి, ఋతువులపై దేవుని పురాతన ఆధిపత్యాన్ని గుర్తుచేసుకుని, ఒడంబడిక విశ్వసనీయత, నూతన చర్య కోసం వేడుకుంటారు.
విలాపంపవిత్ర స్థలంసృష్టిఒడంబడిక
1దేవా, మమ్మల్ని శాశ్వతంగా ఎందుకు తిరస్కరించారు? మీ పచ్చికలోని గొర్రెల మీద మీ కోపం ఎందుకు రగులుకొంది?
2మీ స్వాస్థ్య గోత్రాన్ని మీరు పూర్వం సంపాదించుకుని విమోచించిన మీ వారసత్వ సమాజాన్ని, మీరు నివసించిన సీయోను పర్వతాన్ని జ్ఞాపకం చేసుకోండి.
3ఈ నిత్య శిధిలాల వైపు, శత్రువు పరిశుద్ధాలయం మీదికి తెచ్చిన ఈ విధ్వంసం అంతటి వైపు మీ అడుగులు తిప్పండి.
4మీరు మాతో కలిసిన ప్రదేశంలో మీ శత్రువులు గర్జించారు; వారు తమ ధ్వజాలను సంకేతాలుగా ఏర్పరచుకున్నారు.
5దట్టమైన పొదలను నరికే పురుషుల్లా వారు గొడ్డళ్ళు పట్టుకున్నారు.
6చెక్కిన పలకను వారు తమ గొడ్డళ్ళతో చేతిగొడ్డళ్ళతో పగల కొట్టారు.
7మీ పవిత్రాలయానికి నిప్పు పెట్టి నేలమట్టం చేశారు; మీ నామం కలిగియున్న నివాస స్థలాన్ని అపవిత్రం చేశారు.
8వారు తమ హృదయాల్లో, “దేవుని ఆరాధన స్థలాలను పూర్తిగా ధ్వంసం చేద్దాం!” అనుకుని, దేశంలో దేవుడు ఆరాధించబడే ప్రతీ స్థలాన్ని తగలబెట్టారు.
9దేవుని నుండి మాకు ఏ సంకేతాలు లేవు; ప్రవక్తలు లేరు గతించిపోయారు, ఇదంతా చివరికి ఏమవుతుందో చెప్పే వాడెవడూ మా మధ్యలేడు.
10దేవా, ఎంతకాలం శత్రువు మిమ్మల్ని వెక్కిరిస్తాడు? శత్రువు శాశ్వతంగా మీ పేరును దూషిస్తాడా?
11మీరు ఎందుకు మీ కుడిచేతిని వెనక్కి తీసుకున్నారు? జీవబల ప్రభావాలను ఎందుకు ఉపసంహరించుకున్నారు? పిడికిలి బిగించి, చేయి చాచి వారిని దెబ్బకొట్టు. నాశనం చేయి!
12అతి ప్రాచీన కాలం నుండి దేవుడే నా రాజు; దేశమంతా మీరే నాకు మహారక్షణ అనుగ్రహించావు.
13ఎర్ర సముద్రాన్ని మీ బలం చేత రెండు పాయలుగా విభజించావు, సముద్ర దేవత తలల్ని చితకకొట్టావు.
14లెవియాథన్ తలలను చితక్కొట్టింది మీరే మహా మొసలి తల చితుక కొట్టావు.
15మీ ఆజ్ఞమేరకు నీటిబుగ్గలు నదులు ప్రజలకు మీరు సరఫరా చేశారు. జీవనది యొర్దాను ప్రవాహాన్ని ఇంకి పోయేట్టు చేసి వారికి దారి ఏర్పరచింది.
16పగలు మీదే. రాత్రి కూడా మీదే. వెలిగే నక్షత్రాలు మీవే! సూర్యున్ని మీరే చేశారు.
17సమస్త ప్రకృతి మీ చేతుల్లో ఉంది. మీరే వేసవికాలం చలికాలం ఏర్పరిచారు.
18దేవా! ఈ శత్రువులు నిన్ను ఎలా ఎగతాళి చేస్తున్నారో చూడు. ఓ యెహోవా దేవా! ఈ మూర్ఖపు జనం మీ నామాన్ని దూషించారు జ్ఞాపకం తెచ్చుకోండి.
19మీ పావురపు ప్రాణాన్ని అడవి జంతువులకు అప్పగించవద్దు; నీ బాధించబడిన ప్రజల జీవితాలను ఎప్పటికీ మరచిపోవద్దు.
20మీ వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకో, దేశమంతా చీకటితో నిండి ఉంది. క్రూరులతో నిండి ఉంది.
21నలిగినవారిని మరల అపకీర్తి పాలు కానివ్వకండి. బీదలు అవసరతలో ఉన్న ఈ ప్రజలు మీ నామం స్తుతించుదురు గాక.
22దేవా, లేచి, మీ కారణాన్ని సమర్థించండి; బుద్ధిహీనులు రోజంతా మిమ్మల్ని ఎగతాళి చేసేది జ్ఞాపకముంచుకోండి.
23మీ విరోధుల గొడవను, నిరంతరం పెరిగే మీ శత్రువుల గందరగోళాన్ని విస్మరించవద్దు.

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం — CC BY-SA 4.0. Where these translations come from.

Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc. Available free at biblica.com and open.bible. Text unchanged, used under CC BY-SA 4.0.