
కీర్తనలు 69
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం
అధ్యాయ సారాంశం
శత్రుత్వం, సిగ్గు, తప్పుడు ఆరోపణ కింద మునిగిపోతున్న వ్యక్తి అలసటను కీర్తన 69 వ్యక్తం చేస్తుంది. ఉత్సాహం నిందను తెచ్చింది, అయినప్పటికీ బాధితుడు సకాలంలో రక్షణ కోసం విజ్ఞప్తి చేసి పేదల స్తుతి తిరస్కారాన్ని మించి నిరీక్షణను పునరుద్ధరిస్తుందని నమ్ముతాడు.
విలాపంనిందరక్షణనిరీక్షణ
1దేవా, నన్ను రక్షించండి, నీళ్లు నా మెడ వరకు పొంగి వచ్చాయి.
2లోతైన ఊబిలో నేను దిగబడిపోతున్నాను, నేను నిలబడలేకపోతున్నాను. నేను అగాధ జలాల్లో ఉన్నాను; వరదలు నన్ను ముంచేస్తున్నాయి.
3సాయం కోసం అరిచి అలసిపోయాను; నా గొంతు ఆరిపోయింది. నా దేవుని కోసం చూస్తూ, నా కళ్లు క్షీణిస్తున్నాయి.
4నిష్కారణంగా నన్ను ద్వేషించేవారు నా తలవెంట్రుకల కన్నా ఎక్కువగా ఉన్నారు. నాకు చాలామంది శత్రువులు ఉన్నారు, వారు నిష్కారణంగా నన్ను నాశనం చేయాలని చూస్తున్నారు. నేను దొంగతనం చేయని దానిని నేను బలవంతంగా తిరిగి ఇవ్వవలసి వచ్చింది.
5దేవా! నా బుద్ధిహీనత మీకు తెలుసు; నా అపరాధాలు మీ నుండి దాచబడలేదు.
6సైన్యాల అధిపతియైన యెహోవా, మీలో నిరీక్షణ ఉంచినవారు నా వలన అవమానానికి గురికావద్దు; ఇశ్రాయేలు దేవా, మిమ్మల్ని వెదకేవారు నా వలన సిగ్గుపడకూడదు.
7మీ కోసం నేను నిందల పాలయ్యాను, సిగ్గు నా ముఖాన్ని కప్పేసింది.
8నా కుటుంబానికే నేను పరాయివాడిని అయ్యాను, నా సొంత తల్లి కుమారులకే నేను అపరిచితుని అయ్యాను;
9మీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను దహించి వేస్తుంది, మిమ్మల్ని అవమానపరచే వారి అవమానాలు నా మీద పడును గాక.
10నేను ఉపవాసముండి ఏడ్చినప్పుడు అది నా నిందకు కారణమైంది.
11నేను గోనెపట్ట కట్టుకున్నప్పుడు వారు నన్ను హేళనకు సామెతగా చేశారు.
12గుమ్మం దగ్గర కూర్చునేవారు నన్ను ఎగతాళి చేస్తారు, త్రాగుబోతులు నా గురించి పాటలు పాడుతున్నారు.
13అయితే యెహోవా, ఇది మీ దయ చూపే సమయమని నేను మీకు ప్రార్థిస్తున్నాను. దేవా, మీ గొప్ప ప్రేమతో, మీ నమ్మకమైన రక్షణతో నాకు జవాబు ఇవ్వండి.
14ఊబిలో నుండి నన్ను విడిపించండి, నన్ను మునిగి పోనివ్వకండి; నన్ను ద్వేషించేవారి నుండి లోతైన నీటిలో నుండి నన్ను కాపాడండి.
15వరదలు నన్ను ముంచనీయకండి, అగాధాలు నన్ను మ్రింగనివ్వకండి గుంటలో నన్ను పడనివ్వకండి.
16యెహోవా, మీ ప్రేమలోని మంచితనంతో నాకు జవాబు ఇవ్వండి; మీ గొప్ప కనికరాన్ని బట్టి నా వైపు తిరగండి.
17మీ సేవకుని నుండి మీ ముఖాన్ని దాచకండి; నేను ఇబ్బందిలో ఉన్నాను, నాకు త్వరగా జవాబివ్వండి.
18నా దగ్గరకు వచ్చి నన్ను కాపాడండి; నా శత్రువుల నుండి నన్ను విడిపించండి.
19నన్ను ఎలా హేళన చేశారో, అవమానపరిచారో, సిగ్గుపరిచారో మీకు తెలుసు; నా శత్రువులంతా మీ ఎదుటే ఉన్నారు.
20వారు చేసిన అవమానాలకు నా గుండె బద్దలయ్యింది. నేను నిరాశలో ఉన్నాను; నేను సానుభూతి కోసం చూశాను, కానీ ఎవరూ లేరు ఆదరించేవారి కోసం చూశాను, కానీ ఒక్కరూ దొరకలేదు.
21నా ఆహారంలో వారు చేదు కలిపారు దాహమైతే పులిసిన ద్రాక్షరసం ఇచ్చారు.
22వారి ఎదుట ఉన్న భోజనబల్ల వారికి ఉరి అవును గాక; వారి క్షేమం వారికి ఉచ్చు అవును గాక.
23వారు చూడకుండ వారి కళ్లకు చీకటి కమ్మును గాక, వారి నడుములు శాశ్వతంగా వంగిపోవును గాక.
24మీ ఉగ్రతను వారి మీద కుమ్మరించండి; మీ కోపాగ్ని వారిని తాకనివ్వండి.
25వారి స్థలం పాడైపోవును గాక; వారి డేరాలలో ఎవరు నివసించకుందురు గాక.
26మీరు గాయం చేసిన వారిని వారు హింసిస్తారు మీరు బాధపెట్టిన వారి బాధ గురించి మాట్లాడతారు.
27నేరం మీద నేరం వారిపై మోపండి; మీ నీతిలో వారిని పాలు పంచుకోనివ్వకండి.
28జీవగ్రంథంలో నుండి వారు తుడిచివేయబడుదురు గాక, నీతిమంతుల జాబితాలో వారి నమోదు చేయబడకుండును గాక.
29కాని నా మట్టుకైతే నేను బాధించబడి వేదనలో ఉన్నాను, దేవా! మీ రక్షణ నన్ను కాపాడును గాక.
30నేను పాడుతూ దేవుని నామాన్ని స్తుతిస్తాను. కృతజ్ఞత చెల్లించి ఆయనను కీర్తిస్తాను.
31ఎద్దును, కొమ్ములు డెక్కలు కలిగిన కోడెను అర్పించడం కంటే, ఆయనను స్తుతించడం యెహోవాకు ఇష్టము.
32దీనులు చూసి ఆనందిస్తారు; దేవున్ని వెదికేవారి హృదయాలు తిరిగి బ్రతుకును గాక.
33అవసరత ఉన్నవారి మొర యెహోవా వింటారు, బందీగా ఉన్న తన ప్రజలను ఆయన అలక్ష్యం చేయరు.
34ఆకాశం భూమి ఆయనను స్తుతించును గాక, సముద్రాలు వాటిలో ఉండే జలచరాలన్నీ ఆయనను స్తుతించును గాక.
35ఎందుకంటే దేవుడు సీయోనును రక్షిస్తారు, యూదా పట్టణాలను తిరిగి కడతారు. అప్పుడు ప్రజలు అక్కడ నివసించి దానిని స్వాధీనం చేసుకుంటారు.
36దేవుని సేవకుల సంతానం ఆ భూమిని వారసత్వంగా పొందుతారు. ఆయన నామాన్ని ప్రేమించేవారు అక్కడ నివసిస్తారు.
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం — CC BY-SA 4.0. Where these translations come from.
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc. Available free at biblica.com and open.bible. Text unchanged, used under CC BY-SA 4.0.