
కీర్తనలు 59
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం
అధ్యాయ సారాంశం
దావీదు ఇంటిని గమనిస్తున్న సాయుధులను, ప్రతి సాయంత్రం తిరిగివచ్చే ప్రమాదాన్ని, వేటాడే కుక్కల్లా తిరుగుతున్న అపవాదును కీర్తన 59 వివరిస్తుంది. ప్రార్థన వ్యక్తిగత ప్రతీకారాన్ని ప్రతిఘటించి, బహిరంగ బహిర్గతం కోసం వెతికి, తెల్లవారుజామున స్థిరమైన ఆశ్రయాన్ని గానం చేస్తుంది.
నిఘాఅపవాదుఆశ్రయంస్థిరమైన ప్రేమ
1దేవా! నా శత్రువుల నుండి నన్ను విడిపించండి; నా మీద దాడి చేసేవారికి వ్యతిరేకంగా నా కోటగా ఉండండి.
2కీడుచేసేవారి నుండి నన్ను విడిపించండి, హంతకుల నుండి నన్ను రక్షించండి.
3నా కోసం వారు ఎలా పొంచి ఉన్నారో చూడండి! యెహోవా, చేయని నేరం గాని పాపం గాని లేకుండానే భయంకరమైన పురుషులు నాపై కుట్ర చేస్తున్నారు.
4నేను ఏ తప్పు చేయలేదు, అయినా నా మీద దాడి చేయడానికి వారు సిద్ధంగా ఉన్నారు. నాకు సహాయం చేయడానికి లేవండి; నా దుస్థితిని చూడండి!
5సైన్యాల యెహోవా దేవా, ఇశ్రాయేలు దేవా! సర్వ దేశాలను శిక్షించడానికి లేవండి; దుష్టులైన దేశద్రోహులకు దయ చూపకండి. సెలా
6వారు సాయంకాలం మళ్ళీ వస్తారు, కుక్కల్లా మొరుగుతూ, వేట కోసం పట్టణం చుట్టూ తిరుగుతారు.
7వారు వారి నోటి నుండి ఏమి చిమ్ముతారో చూడండి; వారి పెదవుల నుండి వచ్చే మాటలు పదునైన ఖడ్గాల్లాంటివి, “మా మాటలు ఎవరు వింటారు?” అని వారనుకుంటారు.
8కాని యెహోవా! మీరు వారిని చూసి నవ్వుతారు; ఆ దేశాలన్నిటిని చూసి, పరిహసిస్తారు.
9మీరే నా బలం, మీ కోసమే నేను వేచి ఉంటాను; దేవా, మీరు, నాకు ఎత్తైన కోట,
10తన మారని ప్రేమను బట్టి, నా దేవుడు నాతో ఉంటారు. ఆయన నాకు ముందుగా వెళ్తారు నన్ను అపవాదు చేసిన వారిపై నేను సంతోషించేలా చేస్తారు.
11కాని వారిని చంపకండి, ప్రభువా మా డాలు, వారు చస్తే నా ప్రజలు మరచిపోతారు. మీ బలముతో వారిని వేర్లతో పెకిలించి వారిని అణచివేయండి.
12వారి నోళ్ళ పాపాల కోసం, వారి పెదవుల మాటల కోసం, వారి గర్వంలో వారు పట్టబడుదురు గాక. వారు పలికే శాపాలు అబద్ధాలను బట్టి,
13మీ ఉగ్రతలో వారిని దహించివేయండి, వారు ఇక లేకుండునంతగా వారిని దహించివేయండి. అప్పుడు దేవుడు యాకోబును పరిపాలిస్తున్నారని భూదిగంతాల వరకు తెలియపరచబడుతుంది. సెలా
14వారు సాయంకాలం మళ్ళీ వస్తారు, కుక్కల్లా మొరుగుతూ, వేట కోసం పట్టణం చుట్టూ తిరుగుతారు.
15వారు ఆహారం కోసం తిరుగుతారు సంతృప్తి చెందకపోతే కేకలు వేస్తారు.
16కానీ నేను మీ బలాన్ని గురించి పాడతాను, ఉదయం మీ ప్రేమను గురించి పాడతాను; ఎందుకంటే మీరు నా కోట, కష్ట సమయాల్లో నా ఆశ్రయము.
17మీరు నా బలం, నేను మీకు స్తుతిగానం చేస్తున్నాను; దేవా, మీరు, నా కోట, నన్ను ప్రేమించే నా దేవుడు.
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం — CC BY-SA 4.0. Where these translations come from.
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc. Available free at biblica.com and open.bible. Text unchanged, used under CC BY-SA 4.0.