
కీర్తనలు 48
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం
అధ్యాయ సారాంశం
దైవిక సన్నిధి, స్థిరమైన ప్రేమ ద్వారా తెలిసిన అందమైన, సురక్షితమైన నగరంగా సీయోనును కీర్తన 48 కొనియాడుతుంది. భావితరాలు రక్షణ, జీవితకాల మార్గదర్శకత్వం రెండింటినీ గుర్తుంచుకోగలిగేలా ఆరాధకులు గోపురాలు, కోటగోడలను పరిశీలిస్తారు.
సీయోనుభద్రతజ్ఞాపకంమార్గదర్శకత్వం
1మన దేవుని పట్టణంలో ఆయన పరిశుద్ధ పర్వతం మీద యెహోవా గొప్పవాడు, అధిక స్తోత్రార్హుడు.
2మహారాజు పట్టణమైన సీయోను పర్వతం సాఫోన్ ఎత్తైన స్థలంలా అందంగా కనిపిస్తూ సర్వలోకానికి ఆనందం కలిగిస్తుంది.
3దేవుడు ఆమె కోటలలో ఉన్నారు; ఆయనే దానికి కోట అని చూపించారు.
4రాజులు దళాలతో కలిసి, వారు ముందుకు వచ్చినప్పుడు,
5వారు దాన్ని చూసి ఆశ్చర్యపడ్డారు; వారు భయంతో పారిపోయారు.
6వారిలో వణుకు పుట్టింది, ప్రసవ వేదనలాంటి బాధ వారికి కలిగింది.
7తూర్పు గాలితో బద్దలైన తర్షీషు ఓడల్లా మీరు వారిని నాశనం చేశారు.
8మనం విన్నదే, మనం చూశాం; సైన్యాల యెహోవా పట్టణంలో, మన దేవుని పట్టణంలో, దేవుడు దాన్ని నిత్యం సుస్థిరంగా ఉండేలా చేస్తారు. సెలా
9దేవా! మీ మందిరం మధ్యలో మీ మారని ప్రేమను మేము ధ్యానిస్తాము.
10ఓ దేవా, మీ పేరులా, మీ స్తుతి భూదిగంతాలకు చేరుతుంది; మీ కుడిచేయి నీతితో నిండి ఉంది.
11మీ తీర్పులను బట్టి సీయోను పర్వతం ఆనందిస్తుంది యూదా పట్టణాలు సంతోషంగా ఉన్నాయి.
12సీయోను వైపు వెళ్లండి, దాని చుట్టూ నడవండి, దాని బురుజులెన్నో లెక్కించండి.
13ఆమె గురించి రాబోయే తరం వారికి మీరు చెప్పగలిగేలా, దాని కోటగోడలను పరిశీలించండి, దాని కోటలను చూడండి.
14ఈ దేవుడు ఎప్పటికీ మన దేవుడు; ఆయన చివరి వరకు నడిపిస్తారు.
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం — CC BY-SA 4.0. Where these translations come from.
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc. Available free at biblica.com and open.bible. Text unchanged, used under CC BY-SA 4.0.