A young traveler consults an elder while pilgrims take a bright road past concealed traps

కీర్తనలు 25

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం
అధ్యాయ సారాంశం
కీర్తన 25 నమ్మకం, మార్గదర్శకత్వం, క్షమాపణ, ఒడంబడిక స్నేహం, ఒంటరితనాన్ని కలిపి అల్లుతుంది. నేర్చుకోగలవారు మంచి మార్గాల్లో నడిపించబడతారు, శత్రువులు, దాగిన ఉరులు నిజాయితీగా, వినయంగా నమ్మకమైన ప్రార్థనలోకి తీసుకురాబడతాయి.
మార్గదర్శకత్వంక్షమాపణఒడంబడికనమ్మకం
1యెహోవా, నా దేవా, నేను మీపై నమ్మిక ఉంచాను.
2నా దేవా, నేను మిమ్మల్ని నమ్ముతాను; నాకు అవమానం కలగనివ్వకండి, నా శత్రువులకు నాపై విజయాన్ని ఇవ్వకండి.
3మీ కోసం ఎదురు చూసే వారెవరూ ఎన్నటికి సిగ్గుపరచబడరు; ఎన్నడూ ఆశాభంగం చెందరు, కారణం లేకుండ ద్రోహం చేసేవారి మీదకు అవమానం వస్తుంది.
4యెహోవా, మీ మార్గాలేవో నాకు చూపండి. మీ పద్ధతులను నాకు ఉపదేశించండి.
5మీ సత్యంలో నన్ను నడిపించి నాకు బోధించండి, మీరే నా రక్షకుడవైన నా దేవుడవు, మీ కోసమే రోజంతా నిరీక్షిస్తాను.
6యెహోవా, మీ కరుణ, మీ మారని ప్రేమ జ్ఞాపకం చేసుకోండి, ఎందుకంటే, అవి అనాది కాలంనాటి నుండి ఉన్నాయి.
7యవ్వనంలో నేను చేసిన పాపాలు, నా తిరుగుబాటుతనాన్ని మీరు జ్ఞాపకం చేసుకోకండి; మీ మారని ప్రేమను బట్టి నన్ను జ్జాపకముంచుకోండి. ఎందుకంటే యెహోవా మీరు మంచివారు.
8యెహోవా మంచివాడు యథార్థవంతుడు; కాబట్టి తన మార్గాలను పాపులకు బోధిస్తారు.
9న్యాయమైన మార్గాల్లో దీనులను నడిపిస్తారు, తన మార్గాలను వారికి బోధిస్తారు.
10తన నిబంధనలను శాసనాలను పాటించేవారి విషయంలో యెహోవా మార్గాలు, ఆయన మారని ప్రేమ నమ్మదగినవి.
11యెహోవా, నా దోషం ఘోరమైనది మీ నామం కోసం నా దోషాన్ని క్షమించండి.
12అప్పుడు యెహోవాకు భయపడేవారికి వారు కోరుకోవలసిన మార్గాలను ఆయన బోధిస్తారు.
13వారు క్షేమం కలిగి జీవిస్తారు, వారి వారసులు భూమిని వారసత్వంగా పొందుతారు.
14ఆయన పట్ల భయభక్తులు గలవారికి యెహోవా రహస్యాలు తెలుస్తాయి; ఆయన తన నిబంధనను వారికి తెలియపరుస్తారు.
15నా కళ్లు ఎప్పుడూ యెహోవా మీద ఉన్నాయి, ఎందుకంటే ఆయన మాత్రమే వలలో నుండి నా పాదాలు విడిపిస్తారు.
16నా వైపు తిరిగి నాపై దయ చూపండి, నేను ఒంటరి వాడను, బాధింపబడ్డాను.
17నా హృదయంలో ఉన్న ఇబ్బందులు తొలగించండి నా వేదన నుండి విడిపించండి.
18నా వేదన బాధను చూడండి నా పాపాలన్నిటిని క్షమించండి.
19నా శత్రువులు ఎంతమంది ఉన్నారో చూడండి వారు ఎంత తీవ్రంగా నన్ను ద్వేషిస్తున్నారో చూడండి!
20నా ప్రాణాన్ని కాపాడండి నన్ను రక్షించండి; నాకు అవమానం కలగనివ్వకండి, ఎందుకంటే నేను మిమ్మల్నే ఆశ్రయించాను.
21నా నిరీక్షణ యెహోవాలోనే ఉంది, కాబట్టి నా నిజాయితీ యథార్థత నన్ను కాపాడతాయి.
22దేవా, ఇశ్రాయేలు ప్రజలను వారి ఇబ్బందులన్నిటి నుండి విడిపించండి.

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం — CC BY-SA 4.0. Where these translations come from.

Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc. Available free at biblica.com and open.bible. Text unchanged, used under CC BY-SA 4.0.