A fleeing warrior climbs from stormy torrents onto a secure rock at dawn

కీర్తనలు 18

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం
అధ్యాయ సారాంశం
కీర్తన 18 బండ, తుఫాను, బలం, విశాల నేల భాషతో నాటకీయ రక్షణను వివరిస్తుంది. అపారమైన ప్రమాదం నుండి విడుదల పొంది, రాజు శిక్షణ, రక్షణ, విజయం, నిలకడైన ఒడంబడిక విశ్వసనీయతకు దేవుడికి ఘనత ఇస్తాడు.
విడుదలబండబలంరాజరికం
1యెహోవా నా బలమా, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను.
2యెహోవా నా కొండ, నా కోట నా విమోచకుడు; నా దేవుడు నేను ఆశ్రయించే నా కొండ, నా డాలు నా రక్షణ కొమ్ము , నా బలమైన కోట.
3స్తుతికి యోగ్యుడైన యెహోవాకు నేను మొరపెట్టాను, నా శత్రువుల నుండి నేను రక్షించబడ్డాను.
4మరణపు ఉచ్చులు నన్ను చుట్టుకున్నాయి; దుష్టులు వరదలా పొంగి నన్ను ముంచెత్తుతారు.
5సమాధి ఉచ్చులు నన్ను చుట్టుకున్నాయి; మరణపు ఉచ్చులు నన్ను బంధించాయి.
6నా బాధలో నేను యెహోవాకు మొరపెట్టాను; సహాయం కోసం నా దేవున్ని వేడుకున్నాను. తన మందిరంలో నుండి ఆయన నా స్వరం విన్నారు; నా మొర ఆయన సన్నిధికి, ఆయన చెవులకు చేరింది.
7భూమి కంపించి అదిరింది, పర్వతాల పునాదులు కదిలాయి; ఆయన కోపానికి అవి వణికాయి.
8ఆయన నాసికా రంధ్రాల్లో నుండి పొగలేచింది; ఆయన నోటి నుండి దహించే అగ్ని వచ్చింది, దానిలో నిప్పులు మండుతున్నాయి.
9ఆకాశాన్ని చీల్చుకొని ఆయన దిగివచ్చారు; ఆయన పాదాల క్రింద నల్లని మేఘాలు కమ్ముకున్నాయి.
10ఆయన కెరూబుల మీద ఎక్కి వచ్చారు; ఆయన గాలి రెక్కల మీద ఎగిరి వచ్చారు.
11ఆయన చీకటిని తన కప్పుగా, కారు మేఘాలను తన చుట్టూ పందిరిగా చేసుకున్నారు.
12ఆయన సన్నిధి కాంతి నుండి మేఘాలు, వడగండ్లు, మండుతున్న నిప్పులు కురిసాయి.
13యెహోవా పరలోకం నుండి ఉరిమారు; మహోన్నతుని స్వరం ప్రతిధ్వనించింది.
14ఆయన తన బాణాలు విసిరి శత్రువును చెదరగొట్టారు, మెరుస్తున్న గొప్ప పిడుగులతో వారిని తరిమికొట్టారు.
15యెహోవా, మీ గద్దింపుకు, మీ నాసికా రంధ్రాల్లో నుండి వచ్చే బలమైన ఊపిరికి, సముద్రపు అగాధాలు కనబడ్డాయి భూమి పునాదులు బయటపడ్డాయి.
16ఆయన పైనుండి చేయి చాచి నన్ను పట్టుకున్నారు; లోతైన జలాల్లో నుండి నన్ను పైకి తీశారు.
17శక్తివంతమైన నా శత్రువు నుండి, నాకన్నా బలవంతులైన పగవారి నుండి ఆయన నన్ను రక్షించారు.
18నా విపత్తు రోజున వారు నా మీదికి వచ్చారు, కాని యెహోవా నాకు అండగా ఉన్నారు.
19ఆయన నన్ను విశాలమైన స్థలంలోకి తీసుకువచ్చారు; ఆయన నాయందు ఆనందించారు కాబట్టి నన్ను విడిపించారు.
20నా నీతిని బట్టి యెహోవా నాతో వ్యవహరించారు; నా నిర్దోషత్వం బట్టి ఆయన నాకు ప్రతిఫలమిచ్చారు.
21నేను యెహోవా మార్గాలను అనుసరిస్తున్నాను; దుర్మార్గంగా నేను నా దేవుని విడిచిపెట్టలేదు.
22ఆయన న్యాయవిధులన్ని నా ముందే ఉన్నాయి; ఆయన శాసనాల నుండి నేను తొలగిపోలేదు.
23ఆయన ముందు నేను నిందారహితునిగా ఉన్నాను, నేను పాపానికి దూరంగా ఉన్నాను.
24నా నీతిని బట్టి, ఆయన దృష్టిలో నా చేతుల నిర్దోషత్వాన్ని బట్టి, యెహోవా నాకు ప్రతిఫలమిచ్చారు.
25నమ్మకస్థులకు మిమ్మల్ని మీరు నమ్మకస్థులుగా కనుపరచుకుంటారు. యథార్థంగా ఉండే వారికి మిమ్మల్ని మీరు యథార్థవంతులుగా కనుపరచుకుంటారు,
26నిష్కళంకులకు మీరు నిష్కళంకంగా కనుపరచుకుంటారు, కాని వంచకులకు మిమ్మల్ని మీరు వివేకిగా కనుపరచుకుంటారు.
27మీరు దీనులను రక్షిస్తారు కాని అహంకారులను అణిచివేస్తారు.
28యెహోవా, నా దీపాన్ని వెలిగించేది మీరే; నా దేవుడు నా చీకటిని వెలుగుగా మారుస్తారు.
29మీ సహాయంతో నేను సైన్యాన్ని ఎదుర్కోగలను; నా దేవుని తోడుతో నేను గోడను దాటుతాను.
30దేవుని విషయమైతే ఆయన మార్గం పరిపూర్ణమైనది; యెహోవా వాక్కు లోపం లేనిది; ఆయనను ఆశ్రయించిన వారందరిని ఆయన కాపాడతారు.
31యెహోవా తప్ప దేవుడెవరు? మన దేవుని మించిన కొండ ఎవరు?
32బలంతో నన్ను సాయుధునిగా చేసేది, నా మార్గాన్ని యథార్థంగా కాపాడేది నా దేవుడే.
33నా పాదాలను జింక పాదాలుగా చేస్తారు; ఎత్తైన స్థలాల మీద నన్ను నిలబెడతారు.
34నా చేతులను యుద్ధానికి సిద్ధపరుస్తారు; నా చేతులు ఇత్తడి విల్లును వంచగలవు.
35మీ రక్షణ సహాయాన్ని నా డాలుగా చేస్తారు, మీ కుడిచేయి నన్ను ఆదరిస్తుంది; మీ సహాయం నన్ను గొప్ప చేస్తుంది.
36నా చీలమండలాలు జారిపోకుండ మీరు నా పాదాలకు విశాల మార్గాన్ని ఇస్తారు.
37నేను నా శత్రువులను వెంటాడి పట్టుకున్నాను; వారిని నాశనం చేసే వరకు నేను వెనుతిరగలేదు.
38వారు మళ్ళీ లేవకుండా వారిని నలుగగొట్టాను; వారు నా పాదాల క్రింద పడ్డారు.
39మీరు యుద్ధం కోసం నాకు బలాన్ని ధరింపచేశారు; మీరు నా విరోధులను నా ముందు అణచివేశారు.
40మీరు నా శత్రువులు వెనుతిరిగి పారిపోయేలా చేశారు, నేను నా విరోధులను నాశనం చేశాను.
41వారు సాయం కోసం మొరపెట్టారు కాని వారిని రక్షించడానికి ఎవరూ లేరు యెహోవా కూడా వారికి జవాబివ్వలేదు.
42గాలికి కొట్టుకుపోయే దుమ్ములా నేను వారిని నలుగగొట్టాను; వీధుల్లోని బురదలా నేను వారిని తొక్కాను
43ప్రజల దాడుల నుండి మీరు నన్ను విడిపించారు; జనులకు నాయకునిగా మీరు నన్ను స్థిరపరిచారు. నాకు తెలియని ప్రజలు నాకు సేవ చేస్తున్నారు.
44విదేశీయులు నా ముందు భయపడుతున్నారు; నా గురించి వినగానే వారు నాకు లోబడుతున్నారు.
45వారందరి గుండె జారిపోతుంది; వారు వణుకుతూ తమ బలమైన కోటలలో నుండి బయటకు వస్తారు.
46యెహోవా సజీవుడు! నా కొండకు స్తుతి! నా రక్షకుడైన దేవునికి మహిమ!
47నా పక్షాన పగతీర్చుకునే దేవుడు ఆయనే, దేశాలను నాకు లోబరచేది ఆయనే.
48నా శత్రువుల నుండి నన్ను రక్షించేది ఆయనే. నా విరోధులకు పైగా మీరు నన్ను హెచ్చించారు; హింసాత్మక వ్యక్తుల నుండి మీరు నన్ను విడిపించారు.
49అందుకే యెహోవా, దేశాల మధ్య నేను మిమ్మల్ని స్తుతిస్తాను; మీ నామ సంకీర్తన చేస్తాను.
50ఆయన తన రాజుకు ఘన విజయాలు ఇస్తారు; ఆయన తన అభిషిక్తుడైన దావీదుకు అతని సంతానానికి, తన మారని ప్రేమను చూపిస్తారు.

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం — CC BY-SA 4.0. Where these translations come from.

Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc. Available free at biblica.com and open.bible. Text unchanged, used under CC BY-SA 4.0.